న్యుమోనియాపై పోరుకు రూ.80 సాధనం

ఆమిర్ రఫీక్ పీర్‌జాదా, పాలిన్ మాసన్ (ఇన్నొవేటర్స్, బంగ్లాదేశ్)

‘‘ఆస్పత్రిలో ఇంటర్న్‌గా నాకు అదే తొలి రోజు. రాత్రి వేళ విధులు నిర్వహిస్తున్నా. నా కళ్ల ముందే ముగ్గురు పసిపిల్లలు చనిపోయారు. ఏమీ చేయలేకపోయా. ఆ నిస్సహాయ స్థితితో నాకు ఏడుపొచ్చింది’’ - డాక్టర్ మహమ్మద్ జొబాయెర్ చిష్టీ

డాక్టర్ చిష్టీ 1996లో బంగ్లాదేశ్‌లోని షిల్హెట్ బోధనాస్పత్రిలో చిన్నపిల్లల విభాగంలో పనిచేస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. ఇది చూసి చలించిపోయిన ఆయన, న్యుమోనియాతో పిల్లలు చనిపోవడాన్ని అడ్డుకొనేందుకు ఏదో ఒకటి చేయాలని సంకల్పించుకొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 9.2 లక్షల మంది చిన్నారులు ఈ వ్యాధితో చనిపోతున్నారు. అత్యధిక మరణాలు దక్షిణాసియా, సబ్ సహారన్ ఆఫ్రికాల్లోనే సంభవిస్తున్నాయి.

బాలల్లో న్యుమోనియో మరణాలను నివారించే మార్గాలపై రెండు దశాబ్దాలపాటు పరిశోధనలు సాగించిన డాక్టర్ చిష్టీ చవకైన ఒక సాధనాన్ని రూపొందించారు. దీని ఖరీదు రూ.80 మించదు.

ఫొటో క్యాప్షన్,

డాక్టర్ మహమ్మద్ జొబాయెర్ చిష్టీ

న్యుమోనియాతో ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతింటుంది. ఆక్సిజన్ తీసుకొనే సామర్థ్యం కొరవడుతుంది.

అభివృద్ధి చెందిన దేశాల్లో న్యుమోనియాతో బాధపడే చిన్నారులకు శ్వాస సరిగా అందేలా చూసేందుకు వైద్యులు వెంటిలేటర్లు వాడతారు. ఇందుకోసం ఉపయోగించే యంత్రం ఒక్కోటి సుమారు రూ.9.5 లక్షలు ఉంటుంది. సుశిక్షితులైన ప్రత్యేక సిబ్బంది మాత్రమే వీటిని నిర్వహించగలరు.

బంగ్లాదేశ్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వీటి కొనుగోలు, నిర్వహణ చాలా ఖరీదైన వ్యవహారం.

తీవ్రస్థాయి న్యుమోనియాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఒక ప్రత్యామ్నాయ చికిత్సా విధానాన్ని సూచించింది. లో-ఫ్లో ఆక్సిజన్ అని పిలిచే ఈ విధానం కూడా వంద శాతం సత్ఫలితాలను ఇవ్వలేకపోయింది. వ్యాధి బారిన పడ్డ పిల్లల్లో ప్రతి ఏడుగురిలో ఒకరు ఈ చికిత్స అందించినా చనిపోతున్నారు.

డాక్టర్ చిష్టీ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో పనిచేస్తున్నప్పుడు చూసిన ఒక యంత్రం ఆయన వినూత్న ఆలోచనకు ప్రేరణగా నిలిచింది. చికిత్సలో భాగంగా ఈ యంత్రం ‘కంటిన్యూయస్ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెజర్(సీపీఏపీ)’ను ప్రయోగిస్తుంది.

ఈ యంత్రం సాయంతో, ఊపిరితిత్తులు పూర్తిస్థాయిలో విఫలం కాకుండా చూస్తూ, శరీరానికి అవసరమైనంత ప్రాణవాయువు అందిస్తారు. అయితే ఈ యంత్రం ఖరీదైనది.

ఫొటో క్యాప్షన్,

చికిత్సలో ఉపయోగించే ప్లాస్టిక్ బాటిల్ ఇదే

డాక్టర్ చిష్టీ మెల్‌బోర్న్‌ నుంచి బంగ్లాదేశ్‌లోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ డయేరియల్ డిసీజ్ రీసర్చ్‌కు తిరిగి వచ్చాక, చవకయిన, సరళతరమైన బబుల్ సీపీఏపీ సాధనాన్ని తయారుచేసే పని మొదలుపెట్టారు.

ఐసీయూ నుంచి తీసుకొన్న ఒక ఖాళీ ప్లాస్టిక్ షాంపూ బాటిల్‌తో ఆయన ఈ పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఒక కొలీగ్ ఆయనకు సహకారం అందించారు.

ఈ ‘బబుల్ కాన్స్టంట్ పాజిటివ్ ఎయిర్ ప్రెజర్’ పరికరం న్యుమోనియా కారణంగా తగ్గిపోయిన ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ పరికరంలో ఉండే ప్లాస్టిక్ బాటిల్, ట్యూబ్ ఖర్చు కలిపి రూ.80 మించదు.

సాధనం పనితీరును డాక్టర్ చిష్టీ వివరిస్తూ- ‘‘ఐసీయూ నుంచి తీసుకున్న బాటిల్‌లో నీళ్లు నింపాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ సరఫరా చేసే ఆక్సిజన్ సిలిండర్ నుంచి ఒక ట్యూబును కత్తిరించి, దానికి ఒకవైపు సీలు వేశాం. రెండో వైపు ట్యూబును బాటిల్‌లో పెట్టాం. పిల్లలు సిలిండర్‌లోంచి ఆక్సిజన్‌ను పీల్చుకొని మరో ట్యూబు ద్వారా బాటిల్‌లోకి గాలిని వదిలేలా ఏర్పాటు చేశాం. ఫలితంగా బాటిల్‌లో నీళ్లపైన ఒత్తిడి పెరిగి, బుడగలు ఏర్పడతాయి. బుడగల వల్ల ఏర్పడే పీడనం ఊపిరితిత్తుల్లోని చిన్నపాటి ఎయిర్ సాక్స్‌ను తెరచి ఉంచుతుంది’’ అని చెప్పారు. (సాధనం పనితీరును ఈ కథనంతోపాటు ఉన్న వీడియోలో చూడొచ్చు. )

మొదట్లో నలుగురైదుగురు పిల్లలకు ఈ సాధనాన్ని ఉపయోగించి చూశామని, కొన్ని గంటల్లోనే గణనీయమైన పురోగతి కనిపించిందని ఆయన తెలిపారు.

ఈ పరికరంతో చికిత్స పొందిన రూనా అనే బాలిక తల్లి కోహినూర్ బేగం మాట్లాడుతూ- వైద్యులు చాలా కష్టపడ్డారని, తన కూతురు కోలుకున్న తర్వాత చాలా సంతోషమేసిందని చెప్పారు.

ఈ సాధనంతో రెండేళ్లపాటు పరిశోధనను కొనసాగించిన తర్వాత డాక్టర్ చిష్టీ తన అధ్యయన ఫలితాలను ద లాన్సెట్ పత్రికలో ప్రచురించారు. లో-ఫ్లో ఆక్సిజన్ విధానంతో పోలిస్తే బబుల్ సీపీఏపీ సాధనంతో చికిత్స పొందిన బాలల్లో న్యుమోనియా మరణాలు చాలా తక్కువని అధ్యయనంలో తేలింది. ఈ సాధనం మరణాల రేటును 75 శాతం తగ్గించినట్లు వెల్లడైంది. ఈ సాధనంతో ఆక్సిజన్‌ను కూడా మరింత సమర్థంగా ఉపయోగించుకోవచ్చు. తద్వారా ఆక్సిజన్ బిల్లుల భారం తగ్గుతుంది.

ఫొటో క్యాప్షన్,

తల్లిదండ్రులు కోహినూర్ బేగం, రెజవావుల్ కరీంలతో చిన్నారి రూనా

ఈ సాధనం వినియోగంపై అద్-దిన్ మహిళా వైద్య కళాశాలలో పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ‌ఆర్ఎం లత్పుల్ కబీర్ మాట్లాడుతూ దేశవ్యాప్త అధ్యయనం చేయాల్సి ఉందని, ఫలితాలు ఉత్సాహం కలిగిస్తున్నాయని చెప్పారు. ఈ పరికరాన్ని ఏ ఆస్పత్రైనా వినియోగించగలదని, అందువల్ల ఇది మరణాల రేటును భారీగా తగ్గించగలదని ఆశాభావం వ్యక్తంచేశారు.

ఈ పరికరంతో ఇప్పటివరకు దాదాపు 600 మంది బాలలకు విజయవంతంగా చికిత్స అందించారు.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ప్రతీ ఆస్పత్రి బబుల్ సీపీఏపీ సాధనాన్ని వాడితే న్యుమోనియా మరణాలను దాదాపు లేకుండా చేయొచ్చని కబీర్ అభిప్రాయపడ్డారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)