డబ్ల్యూఎల్ఎం: వేగంగా నక్షత్రాలను తయారు చేస్తున్న డ్వార్ఫ్ గెలాక్సీ

డబ్ల్యూఎల్ఎం మరుగుజ్జు నక్షత్రవీధి
ఫొటో క్యాప్షన్,

మన నక్షత్రవీధుల బృందాల శివార్లలోని డబ్ల్యూఎల్ఎం మరుగుజ్జు నక్షత్రవీధి చాలా వేగంగా కొత్త నక్షత్రాలను తయారు చేస్తోంది

ఇది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన ఆస్ట్రోసాట్ తాజాగా తీసిన ఫొటో.

సీటస్ (తిమింగలం) నక్షత్ర మండలంలోని ఓ బలహీనమైన మరుగుజ్జు నక్షత్రవీధి (డ్వార్ఫ్ గెలాక్సీ) ఇది. దీని పేరు వోల్ఫ్-లుండ్‌మార్క్-మెలోట్. సంక్షిప్తంగా డబ్ల్యూఎల్ఎం అంటున్నారు. ఇది భూమికి 30 లక్షల కాంతి సంవత్సరాల దూరంలో మన స్థానిక నక్షత్ర బృందాల శివార్లలో ఒంటరిగా ఉంది.

దీని ద్రవ్యరాశి మన పాలపుంత నక్షత్రవీధి కన్నా వేల రెట్లు తక్కువగా ఉంది. దీని లోహత్వం (మెటాలిసిటీ) సౌరకుటుంబంలో 13 శాతం మాత్రమే. లోహత్వం తక్కువగా ఉందంటే భార లోహాలు తక్కువగా ఉంటాయని అర్థం. ఏదైనా నక్షత్ర వీధిలో భార లోహాలు తక్కువగా ఉంటే.. అక్కడ కొత్త నక్షత్రాలు ఏర్పడటం కష్టం.

కానీ, ఈ డబ్ల్యూఎల్ఎం మరుగుజ్జు నక్షత్రవీధి అత్యధిక సామర్థ్యంతో కొత్త నక్షత్రాలను తయారు చేయగలుగుతోంది. మన పాలపుంత నక్షత్ర వీధితో పోలిస్తే.. డబ్ల్యూఎల్ఎంలో 12 రెట్లు అధిక రేటుతో నక్షత్రాలు తయారవుతున్నాయి. ఈ మరుగుజ్జు నక్షత్రవీధికి ఇదెలా సాధ్యమవుతోందో అంతరిక్ష పరిశోధకులకు ఇంకా అర్థం కాలేదు.

ఫొటో క్యాప్షన్,

ఆస్ట్రోసాట్ మీద ఉన్న అల్ట్రా వయెలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్‌ ద్వారా డబ్ల్యూఎంఎల్‌ లోని కొత్త నక్షత్ర సముదాయాలను ఫొటో తీశారు

ఈ సూక్ష్మ నక్షత్ర వీధి ఇంత సమర్థవంతమైన నక్షత్రాల కర్మాగారం ఎలా అయిందనేది తెలుసుకోవాలని బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ పరిశోధకురాలు అన్నపూర్ణి సుబ్రమణియమ్, ఆమె విద్యార్థి చాయన్ మండల్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా డబ్ల్యూఎంఎల్‌‌లోని కొత్త నక్షత్ర సముదాయాలను.. ఆస్ట్రోసాట్ మీద గల అల్ట్రా వయెలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్‌ ద్వారా ఫొటో తీశారు.

ఈ ఫొటోలోని నీలి రంగు చుక్కలు ఫార్ అల్ట్రా-వయొలెట్‌ ఇమేజింగ్ టెలిస్కోప్‌తో తీసిన నక్షత్ర సముదాయాలు. పసుపు రంగు చుక్కలు నియర్ అల్ట్రా-వయొలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్‌తో తీసిన నక్షత్ర సముదాయాలు.

ఈ సమాచారాన్ని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. డబ్ల్యూఎల్ఎం చిక్కుముడిని త్వరలో మరో ముడిని విప్పగలరని భావిస్తున్నారు.

భారతదేశపు తొలి పూర్తిస్థాయి అంతరిక్ష పరిశోధక (స్పేస్ అబ్జర్వేటరీ) ఉపగ్రహం ఆస్ట్రోసాట్‌. దీనిని ఇస్రో రెండేళ్ల కిందట- 2015 సెప్టెంబర్ 28న అంతరిక్షంలోకి పంపించింది. అందులో ఐదు అత్యాధునిక పరికరాలు - అల్ట్రా వయొలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, సాఫ్ట్ ఎక్స్-రే టెలిస్కోప్, లార్జ్ ఏరియా ఎక్స్-రే ప్రొపోర్షనల్ కౌంటర్, కాడ్మియం జింక్-టెల్యూరైడ్ ఇమేజర్, స్కానింగ్ స్కై మానిటర్ ఉన్నాయి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)