ఫ్రాన్స్‌లో దొరికిన 'మోనాలిసా నగ్న చిత్రం'

  • 30 సెప్టెంబర్ 2017
మోనాలిసా, మోనా వానా Image copyright AFP/ALAMY
చిత్రం శీర్షిక మోనాలిసా (ఎడమ), మోనా వానా (కుడి)

మోనాలిసా నగ్న చిత్రంగా భావిస్తున్న పురాతన పెయింటింగ్ ఫ్రాన్స్‌లో వెలుగులోకి వచ్చింది. ప్రఖ్యాత మోనాలిసా పెయింటింగ్‌కు చిత్తుగా భావిస్తున్న 'మోనా వానా' చిత్రం పారిస్‌ సమీపంలోని కాండె మ్యూజియంలో బయటపడింది.

1862 నుంచి ఇది మ్యూజియంలోని రినైజాన్స్ ఆర్ట్ కలెక్షన్‌లో ఉంది.

ఈ చార్‌కోల్‌ చిత్రంలోని నగ్న మహిళ ’మోనా వానా‘ అని పిలుస్తున్నారు. ఇప్పటివరకూ ఈ చిత్రం డావిన్సీ స్టూడియోలో తయారైందని మాత్రమే భావించేవారు. అయితే డావిన్సీ స్వయంగా దీనిని వేశారనేందుకు తగినన్ని ఆధారాలను నిపుణులు గుర్తించారు.

డావిన్సీ రేఖలు

పారిస్‌లోని లూవర్ మ్యూజియంలో పరీక్షల అనంతరం, ఈ చిత్రంలో కొంత భాగాన్ని డావిన్సీ చిత్రించి ఉంటారని నిపుణులు భావిస్తున్నారు.

లియోనార్డో డా విన్సీ (1452-1519) ఇటాలియన్ పునరుజ్జీవనోద్యమం నుంచి పుట్టుకొచ్చిన ప్రముఖ చిత్రకారుల్లో ఒకరు. ఆయన చిత్రించిన మోనాలిసా పెయింటింగ్ (దాన్నే 'లా జొకొండ' అని కూడా అంటారు) ప్రపంచంలో ప్రఖ్యాతి చెందింది.

అత్యంత విలువైన కళాఖండంగా ఆ మోనాలిసా చిత్రం పేరు పొందింది.

ఫ్రాన్సెస్కో డెల్ జొకొండ అనే వ్యాపారి భార్య అయిన లిసా గెరార్దినీ చిత్రమే మోనాలిసా చిత్రంగా రూపు దిద్దుకుందని భావిస్తున్నారు.


కుడి, ఎడమల కన్ఫ్యూజన్..

''ఆ ముఖం, చేతులను చిత్రించిన విధానం చాలా అసాధారణం'' అని లావర్ మ్యూజియం క్యురేటర్ మాథ్యూ డెల్డిక్ ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు తెలిపారు.

బహుశా అది మోనాలిసా ఆయిల్ పెయింటింగ్‌కు ముందు వేసిన ‘ప్రిపరేటరీ పెయింటింగ్’ అయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

Image copyright @CHANTILLYDOMAIN
చిత్రం శీర్షిక ‘మోనా వానా’ పరిశీలిస్తున్న నిపుణులు

డెల్డిక్ చెప్పిన వివరాల ప్రకారం.

  • రెండు బొమ్మల చేతులు, శరీరం ఒకే విధంగా ఉన్నాయి . రెండు పోర్టెట్రెయిట్లు దాదాపు ఒకే సైజులో ఉన్నాయి
  • బొమ్మ చుట్టూ ఉన్న చిన్నచిన్న రంధ్రాలను గమనిస్తే.. దాని రూపాన్ని ఒక కాన్వాస్ మీదకు దించడానికి ఉపయోగించినట్లు సూచిస్తున్నాయి

కళాఖండాలను భద్రపరచడంలో నిపుణుడైన బ్రూనో మాటిన్.. ఆ చిత్రం డావిన్సీ జీవించిన 16వ శతాబ్దం ప్రారంభం నాటిదే అని నిర్ధారించారు.

అయితే ఈ చిత్రం తల భాగాన ఉన్న ‘హ్యాచింగ్’ను బట్టి చూస్తే.. అది కుడి చేతి వాటం వ్యక్తి గీసినట్లు ఉందని మాటిన్ చెబుతున్నారు.

కానీ డావిన్సీది ఎడమ చేతి వాటం.

మరికొన్ని పరిశోధనలు నిర్వహించిన తర్వాత కానీ అది డావిన్సీ చిత్రమా కాదా అన్నది తేల్చలేమని నిపుణులు చెబుతున్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు