ఇది కథ కాదు.. ఓ వికలాంగురాలి ఆవేదన

  • 11 అక్టోబర్ 2017
పోలీస్ స్టేషన్, రేప్, రాఘవ్,

నువ్వు వికలాంగురాలివి .. నిన్ను రేప్ చేస్తే ఏం వస్తుంది? అని అందరూ అన్నారు. పోలీసులకు చెబితే వారికి నా మీద నమ్మకం కలగలేదు. చుట్టుపక్కలవారు కూడా ఆ అబ్బాయి అలా చేయడని అంటూ చివరికి నన్నే అసహ్యించుకున్నారు.

నేను అందరిలా నడవలేను. అందుకే అందరూ కలిసి వెక్కిరిస్తారు. కుంటుతూ నడుస్తాను అందుకే పోలీసులకు నా మాట మీద నమ్మకం కలగడం లేదు.

అందుకే వాళ్ళంటుంటారు " నువ్వు అసలే వికాలాంగురాలివి .. నిన్ను రేప్ చేస్తే ఏం వస్తుంది? " అని.

నేను నిజం చెబుతున్నా. ఇద్దరు మగాళ్లు కలిసి నన్ను రేప్ చేశారు.

ఆ ఇద్దరిలో ఒకతను మా ఇంటి పక్కనే ఉంటాడు. అతని పేరు రాఘవ్. నేను నిత్యం అతడింటికి వెళుతుంటాను. ఎందుకంటే అక్కడ కలర్ టీవీ ఉంది కాబట్టి.

టీవీ చూడటం ఇష్టమే. అలాగే రాఘవ్ కూడా.

అతడికి నేను కూడా ఇష్టమేనని అనిపించేది.

ఒకరోజు రాఘవ్ నన్ను "పెళ్లి చేసుకుంటావా" అని అడిగితే ఇంట్లో ఉన్నవారంతా నవ్వారు. నాకు సిగ్గేసింది.

రాఘవ్ ఇంట్లోవాళ్ళు కూడా నన్ను బాగా చూసుకునేవారు. అందుకే వాళ్లంటే అమ్మకు కూడా నమ్మకం.

కానీ ఒకరోజు నేను రాఘవ్ ఇంటికి టీవీ చూడ్డానికి వెళితే, అతను నన్ను కారులో బయటికి తీసుకెళ్లాడు. ఆ కార్ లో అతడి మిత్రుడు కూడా ఉన్నాడు.

ఇద్దరూ కలిసి నాకు చిప్స్, కూల్ డ్రింక్ ఇచ్చారు.

ఆ చిప్స్, కూల్ డ్రింక్స్ లో వారు మత్తు మందు కలిపారు. స్పృహ కోల్పోయాను.

అప్పుడు ఏం జరిగిందో గుర్తులేదు. కానీ ఏం జరిగిందో, ఎలా జరిగిందో అర్థం చేసుకోగలను.

ఆ తర్వాత నేను ఇంట్లోవారికి సమీప రోడ్డుపై అపస్మారక స్ధితిలో కనిపించాను.

అమ్మ మాత్రమే నా మాటలను నమ్మింది. నా గాయాలను చూసింది ఆమే. నేను తేరుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకెళ్లింది.

రాఘవ్ కి, అతడి మిత్రుడికి శిక్ష పడాలి. అతడి మిత్రుడి పేరు నాకు గుర్తులేదు కానీ నేను పోలీసులకు రాఘవ్ పేరు మాత్రం చెప్పాను.

కానీ పోలీసులు నేను అబద్ధం చెబుతున్నానని అనుకుంటున్నారు.

నా శరీరంపై ఉన్న గాయాలు చూసి వారు నన్ను ఆసుపత్రికైతే తరలించారు కానీ వారు నామాటలు మాత్రం నమ్మట్లేదు.

" మీ అమ్మాయి సాధారణ పరిస్ధితిలో లేదు.. ఆమె చెబుతున్న పేరే నిజమని ఎలా నమ్మాలి " అని పోలీసులు అమ్మను ప్రశ్నించారు.

పోలీసులు కేసు నమోదు చేసినా వాళ్ళ దృష్టిలో నేను మాత్రం ఆబద్ధమాడుతున్నాను. వాళ్ళకే నమ్మకం లేకపోతే వారు దర్యాప్తు ఎలా చేస్తారు? కోర్టులో సాక్ష్యాధారాలను ఎలా ప్రవేశపెడతారు?

నేను చాలా ఏడ్చాను. నాలో ఉన్న ఆత్మస్ధైర్యం దెబ్బతింది.

చుట్టుపక్కలవారంతా రాఘవ్‌కే మద్దతు పలికారు. అతడి మాటలనే నమ్మారు.

" అతడు చాలా మంచోడు నువ్వు వికలాంగులారాలివి. నీతో శారీరక సంబంధం పెట్టుకోవడానికి అతడికెందుకు ఆసక్తి ఉంటుంది" అని వారందరూ ప్రశ్నించారు.

అతడు పెళ్లి గురించి నాతో మాట్లాడినప్పుడు నేను అతడిని నమ్మాను. ఆ ప్రతిపాదనను నేను మనస్సాక్షిగా అంగీకరించాను.

నేను అతన్ని ప్రేమించాను. కానీ నా ప్రేమకు బదులుగా అతడు ఇంత పెద్ద అన్యాయం చేసాడు.

ఆ రాత్రి మొత్తం మారిపోయింది. అన్నయ్యకు కూడా నాపై కోపం వచ్చింది.

" ఖబర్దార్ పోలీసుల దగ్గరికి వెళ్తే, కుటుంబం పేరుమీద మచ్చ పడుతుంది." అని హెచ్చరించాడు.

అమ్మ కూడా అన్నయ్య మాట వినలేదు. అమ్మను, నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు.

నేను, అమ్మ ఇద్దరూ కలిసి ఇప్పుడు అక్క ఇంట్లో ఉంటున్నాం.

కానీ నేను ఇంటికి తిరిగి వెళ్లాలని అనుకుంటున్నాను. నేను అక్కడే పుట్టి పెరిగాను. అక్కడుండే ప్రతి వస్తువు నాదే.

ఇప్పుడు నా మిత్రులందరూ నా నుంచి దూరంగా ఉన్నారు. ఇక్కడ భయంతో గడుపుతున్నాను.

అక్క దగ్గర ఉండాలనుకోవడం లేదు. ఏదైనా పని చేస్తూ డబ్బు సంపాదించాలని అనుకుంటున్నాను.

ఆ డబ్బుతో అద్దెకు ఓ ఇల్లు తీసుకుని నేను, అమ్మ కలిసి ఉండాలని అనుకుంటున్నాం.

కానీ అది కూడా సులభం కాదు. ఎందుకంటే నా చదువు పూర్తికాలేదు.

స్కూల్లో నేను ఇతర అమ్మాయిలకన్నా వెనుకబడి ఉండడంతో టీచర్ నన్ను స్కూల్ నుంచి పంపేశారు.

అమ్మ ఇంట్లోనే ఉంచి చదివించాలని అనుకుంది. కానీ అలా కూడా సాధ్యం కాలేదు.

అందుకే నేను ఇప్పుడు 'శృతి వికలాంగ హక్కుల కేంద్రం' అనే సంస్ధలో వ్యాపారంపై శిక్షణ పొందాలనుకుంటున్నాను.

కానీ అమ్మకు భయమేస్తోంది. ఎందుకంటే అమ్మ రేప్ కేసులో కోర్టు ద్వారా నిందితులకు శిక్ష పడాలి ఆ తర్వాతే అన్నీఅని అంటోంది.

నాపై సామూహిక అత్యాచారం జరిగినా అందరూ నేను ఆబద్ధమాడుతున్నానని అనుకుంటున్నారు. అమ్మ కోసం ఈ మచ్చను తొలగించాలి.

నా కోసం కూడా.

ఇంత జరిగినా కూడా నా కల చెదరలేదు. నేను ఉద్యోగం చేస్తూ పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నాను.

అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నాను.

(బీబీసీ ప్రతినిధి దివ్య ఆర్యతో సంభాషణ ఆధారంగా ఓ వికలాంగ అమ్మాయి నిజమైన కథ)

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్ లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు