అభిప్రాయం: మోదీ ప్రాభవం తగ్గుతున్నట్లు గుర్తించిన బీజేపీ

  • షకీల్ అఖ్తర్
  • బీబీసీ ఉర్దూ ప్రతినిధి
రాహుల్ గాంధీ
ఫొటో క్యాప్షన్,

ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో రాహుల్ గాంధీ

గత నెల ప్రారంభంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటించారు. అక్కడ పలు యూనివర్సిటీల విద్యార్థులతో, మేధావులతో ముచ్చటించారు. భారతదేశంలో రాజకీయాలపై చర్చించారు. రాహుల్ ప్రసంగాలకు ప్రశంసలు కూడా వచ్చాయి. దీంతో బీజేపీలో అంతర్మథనం మొదలైంది.

విదేశాల్లో మోదీ ప్రాభవం తగ్గుతున్న విషయాన్ని.. ప్రజలు రాహుల్ గాంధీ మాటలనూ ఆలకిస్తున్నారన్న అంశాన్ని కమలనాథులు గుర్తించారు.

అమెరికా పర్యటనలో మేధావులు, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాలకు మీడియాలో విస్తృత ప్రచారం లభించింది.

మోదీ పాలనతో మార్పు వచ్చిందా?

బీజేపీ పాలనలోకి వచ్చిన వెంటనే మోదీ భారత ఆర్థిక వ్యవస్థలో మార్పులు తీసుకువస్తారని భావించారు. కానీ క్షేత్రస్థాయిలో ఇంతవరకు ఎలాంటి ముఖ్యమైన మార్పులూ రాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నవంబర్‌, డిసెంబర్‌లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మోదీ పాలనపై వస్తున్న విమర్శలను బట్టి చూస్తే బీజేపీ ఈ ఎన్నికల్లో గట్టి పోటీనే ఎదుర్కొనాల్సి రావచ్చు.

ముఖ్యంగా గతంలో మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్ ఎన్నికలు బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి.

ప్రస్తుతం పరిణామాలను బట్టి చూస్తే అక్కడ బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది.

కాంగ్రెస్ వ్యూహం ఏంటి?

అమెరికా నుంచి వచ్చిన వెంటనే రాహుల్ గాంధీ గుజరాత్‌కు వెళ్లారు. ఒక ఆలయంలో పూజలతో తన పర్యటనను ప్రారంభించారు.

గుజరాత్‌లో తాను పర్యటించిన చోటంతా ఏదో ఒక గుడిలో పూజలు ఉండేలా రాహుల్ జాగ్రత్తలు తీసుకున్నారు.

గుజరాత్ ఎన్నికలను కాంగ్రెస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ పార్టీ కనుక గుజరాత్‌లో విజయం సాధిస్తే అది భారత రాజకీయాల్లో పెనుమార్పులకు నాంది పలికే అవకాశం ఉంది.

గుజరాత్‌లో తిరిగి అధికారాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ 'సున్నిత' హిందుత్వ పంథాను అనుసరిస్తోందని చాలామంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

రాహుల్ ఆలయాల సందర్శన వ్యూహాత్మకమే అంటున్నారు.

కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ

గుజరాత్ ప్రజలు మార్పును ఆశిస్తున్నా, అక్కడి ప్రజలు బలమైన ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారు.

బీజేపీ 'దూకుడు' హిందుత్వకు 'సున్నిత' హిందుత్వమే ప్రత్యామ్నాయం అని భావిస్తే మాత్రం కాంగ్రెస్ విజయం కష్టమే.

గుజరాత్ ఎన్నికలు కాంగ్రెస్ పునరుజ్జీవానికి ఒక మంచి అవకాశం.

అయితే మోదీని విమర్శించడానికి బదులుగా తగిన వ్యూహాలు రూపొందించుకోవడం కాంగ్రెస్ తక్షణావసరం.

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేసుకోండి.