అన్నా హజారే: మూడేళ్లు గడిచినా మార్పు లేదు, అందుకే మళ్లీ ఉద్యమం

‘అవినీతికి వ్యతిరేకంగా మళ్లీ పోరాటం తప్పదు‘
అవినీతికి వ్యతిరేకంగా బలమైన లోక్పాల్ చట్టం తేవాలని గతంలో నిరాహార దీక్ష చేసిన అన్నా హజారే, ఆరేళ్ల తరవాత మరోసారి ఉద్యమం తప్పదంటున్నారు.
ప్రభుత్వం తన హామీలని నెరవేర్చడంలో విఫలమైందనీ, ఇప్పటికైనా అది మేల్కొనకపోతే మరోసారి దిల్లీలో పోరాటానికి దిగుతాననీ ఇటీవలే ప్రధాని మోదీకి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు.
‘‘ప్రజలకు ఈ ప్రభుత్వంపైన చాలా అంచనాలున్నాయి. భాజపా ప్రభుత్వం కూడా అవినీతి రహిత దేశాన్ని అందిస్తామని ప్రమాణం చేసింది. కానీ మూడేళ్లు గడిచినా ఎలాంటి మార్పూ లేదు. అప్పుడు కాంగ్రెస్ కోరలు లేని లోక్పాల్ చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు మోదీ ప్రభుత్వం కూడా ఆ చట్టానికి ఎలాంటి బలమైన అధికారాల్నీ ఇవ్వలేదు. ప్రభుత్వంలో చలనం తీసుకురావడానికే మళ్లీ ఉద్యమబాట పడుతున్నా’’ అంటున్న అన్నా హజారేతో బీబీసీ మరాఠీ ప్రతినిధి మయూరేష్ ప్రత్యేక ఇంటర్వ్యూ.
‘పనితీరు మార్చుకోమని ప్రభుత్వానికి ఉత్తరాలు రాస్తూనే ఉన్నా’
బీబీసీ: 2011లో లోక్పాల్ బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టేవరకూ మీరు వెనకడుగు వేయకుండా జాతీయస్థాయి ఉద్యమాన్ని నడిపించారు. మళ్లీ ఇన్నేళ్ల తరవాత దాని గురించి మాట్లాడుతున్నారు. ఇంతకాలం ఆ విషయంలో మౌనంగా ఎందుకున్నారు?
అన్నా: కొన్నాళ్లు కుదురుకున్నాకే ఏ ప్రభుత్వ పనితీరునైనా విశ్లేషించడం, అది ఆశించిన స్థాయిలో పని చేయనప్పుడు ప్రశ్నించడం సమంజసం. కాంగ్రెస్ పార్టీ చాలా కాలం పాటు దేశాన్ని పాలించింది. అందుకే అప్పుడు ఉద్యమాన్ని ఉద్దృతం చేసి ప్రభుత్వంపైన ఒత్తిడి పెంచాం. కానీ భాజపా అధికారంలోకి వచ్చాక, ఆ పార్టీకి కొంత సమయం ఇవ్వాలనుకున్నాం. అందుకే ఇంతకాలం మౌనంగా ఉన్నాం. అయినా ప్రభుత్వం గతంలో చేసిన హామీలను గుర్తుచేస్తూ ఎప్పటికప్పుడు ఉత్తరాల్ని రాస్తూనే ఉన్నా. కానీ మూడేళ్లు గడిచినా అవినీతిని నిర్మూలించడంలో ప్రభుత్వానికి ఆసక్తి ఉన్న దాఖలాలు కనిపించడం లేదు. అందుకే మరోసారి ఉద్యమాన్ని మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నా.
‘ఫడణవీస్ ఎప్పుడూ మోదీ కంటే ముందే’
బీబీసీ: గోమాంస నిషేధానికి సంబంధించి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ అల్లర్లలో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ప్రధాని సైతం అలాంటి సంఘటనల్ని ఖండించారు. ఓ గాంధేయవాదిగా మీరీ అంశంపై ఎలా స్పందిస్తారు?
అన్నా: ప్రధాని ఆ అల్లర్లని బహిరంగంగా ఖండించినప్పడు, వాటికి పాల్పడిన వాళ్లపైన చర్యలెందుకు తీసుకోలేదు? ఆయన దేశం మొత్తానికీ ప్రధాని. అది మరచిపోయి, కేవలం తన మనుషులు కాబట్టే గోసంరక్షకుల పేరుతో హింసకు పాల్పడే వాళ్లపైన చర్యలు తీసుకోవట్లేదా అన్నదే నా ప్రశ్న.
బీబీసీ: మహారాష్ట్రలో ఫడణవీస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, మోదీ కంటే ఫడణవీసే బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. ఆయన గురించి ఇప్పుడు మీ అభిప్రాయమేంటి?
అన్నా: నేను వ్యక్తుల్నే చూస్తా తప్ప వాళ్ల వెనకున్న పదవులూ, పార్టీలని కాదు. నాకు సంబంధించినంత వరకూ ఫడణవీస్ ఎప్పుడూ మోదీకంటే ఒక అడుగు ముందే ఉంటారు.
బీబీసీ: ఎందుకు?
అన్నా: ఎందుకంటే... ఫడణవీస్ అవినీతిపరుడు కాదు కాబట్టి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)