లండన్‌లో విజయ్ మాల్యా అరెస్ట్, బెయిల్‌పై విడుదల

  • 3 అక్టోబర్ 2017
విజయ్ మాల్యా Image copyright Getty Images
చిత్రం శీర్షిక విజయ్ మాల్యా

భారత వ్యాపారవేత్త విజయ్ మాల్యాను ఓ మనీ లాండరింగ్ కేసులో లండన్‌లో అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనను బెయిల్‌పై విడుదల చేశారు.

మాల్యాను ఈ ఏడాది బ్రిటన్‌లో అరెస్టు చేయడం ఇది రెండోసారి. మోసం తదితర కేసుల్లో నిందితుడైన మాల్యాను తమకు అప్పగించాలని చాలా కాలంగా యూకేను భారత్ కోరుతూ వస్తోంది. భారత్ విజ్ఞప్తి మేరకు ఒక కేసులో ఏప్రిల్‌లో ఆయన్ను యూకే అధికారులు అరెస్టు చేశారు. అయితే వెస్ట్‌మిన్‌స్టర్ మెజిస్ట్రేట్ కోర్టులో మాల్యాకు బెయిలు లభించింది.

బ్యాంకులకు రూ. 10 వేల కోట్ల రుణాలు ఎగవేశారన్న ఆరోపణలు మాల్యా ఎదుర్కొంటున్నారు.

61 ఏళ్ల మాల్యా లండన్‌లో మంగళవారం మరో కేసులో అరెస్టు అయ్యారు.

మాల్యా బ్రిటన్‌కు వెళ్లిపోయిన తర్వాత ఆయన పాస్‌పోర్టును భారత్ రద్దు చేసింది.

మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి భారత ప్రభుత్వం కొన్ని అదనపు ఆరోపణలు చేసింది. మనీ లాండరింగ్ ఆరోపణలనూ, దానికి సంబంధించిన సాక్ష్యాలనూ ఆయనపై ఉన్న మోసం ఆరోపణలకు జత చేశారు.

తాజా ఆరోపణల్లో మాల్యా డబ్బును ఎక్కడికి తరలించారనే స్పష్టమైన వివరాలున్నాయి.

అయితే, ముందు నుంచి ఉన్న మోసం ఆరోపణలకు, తాజా మనీ లాండరింగ్ ఆరోపణలు తోడైన నేపథ్యంలో ఆయనను మరోసారి అరెస్ట్ చేశారు. అయితే ఆయనను భారత్‌కు పంపించాలన్న అభ్యర్థనపై విచారణ 4 డిసెంబర్‌న మొదలవ్వాల్సి ఉన్నందున ఆయనకు వెస్ట్‌మిన్‌స్టర్ కోర్టు మళ్లీ బెయిల్ మంజూరు చేసింది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)