పచ్చబొట్టు వద్దంటున్న గిరిజన మహిళలు

  • 7 అక్టోబర్ 2017
పచ్చబొట్టు Image copyright WATERAID/RONNY SEN
చిత్రం శీర్షిక 2వేల సంవత్సరాల క్రితం నుంచి బైగా తెగ మహిళలు పచ్చబొట్టు వేసుకుంటున్నారు

పచ్చబొట్టు, టాటూ... పేరు ఏదైతేనేం నేటి యువతకు అదంటే ఎంతో మోజు. వెరైటీ టాటూలతో తమ ప్రత్యేకతను చాటుకుంటారు. స్వేచ్ఛకు, స్వాతంత్ర్యానికి టాటూను ప్రతీకగా భావిస్తుంటారు. కానీ, నా దృష్టిలో టాటూలు వేయించుకోకుండా ఉండటం ఒక తిరుగుబాటు లాంటిది. స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకోవడం లాంటిది. నేను మాత్రం వాటి జోలికి వెళ్లను.

నేను పచ్చబొట్టు గురించి ఆలోచిస్తూనే పెరిగాను. చెవి, ముక్కు కుట్టడం కూడా మహిళల అణిచివేతకు చిహ్నాలుగానే భావిస్తాను.

మా అమ్మ ఒంటిపై కొన్ని పచ్చబొట్లున్నాయి. మా అమ్మమ్మకు ఇంకా ఎక్కువున్నాయి. ఆనాడు టాటూలు వేయించుకోవడం మినహా తమకు మరో మార్గం లేకుండా పోయిందని వాళ్లు నాకు చెప్పారు.

ఉత్తరప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో పెళ్లైన మహిళలు పచ్చబొట్టు వేసుకోవడం తప్పనిసరి. స్థానికంగా దాన్ని 'గొడ్న' అంటారు. మేము ఆ పల్లెల నుంచే వచ్చాం.

పచ్చబొట్టు వేసుకోకుంటే అత్తింటివాళ్లు మేమిచ్చే నీళ్లు తాగరట. ఆహారం తీసుకోరట. పచ్చబొట్టు లేనివారిని అంటరానివారిగా చూస్తారట. ఇవన్నీ మా అమ్మే నాకు చెప్పింది. మా నాన్నకు పచ్చబొట్ల అవసరమే లేదు. ఎందుకని అమ్మను అడిగితే, అతను అమ్మాయి కాదుగా అని చెప్పింది.

అమ్మకు చిన్నప్పుడే పెళ్లైంది. 1940లో పట్టుమని పదకొండేళ్లు కూడా లేని అమ్మకు పెళ్లి చేశారు. కొన్ని వారాల తర్వాత ఓ పెద్దావిడను పిలిపించి అమ్మకు పచ్చబొట్టు పొడిపించారు.

పచ్చబొట్టు-చీకటి వారసత్వం

  • పచ్చబొట్టు వేల సంవత్సరాల నుంచి ఉన్నట్లు నమ్ముతారు.
  • ఖైదీలు, సేవకులు, బానిసలను గుర్తించేందుకు పచ్చబొట్టు వేసేవారు.
  • ప్రాచీన గ్రీకులు, రోమన్లు పచ్చబొట్టు పొడిపించుకునే వాళ్లు. అలాగే, ప్రాచీన భారతీయులు కూడా.
  • యూదులు నెంబర్ల పచ్చబొట్లు వేయించుకునేవాళ్లు.
  • తప్పుచేసిన వారిని గుర్తించేందుకు, అణిచివేతకు తరచుగా పచ్చబొట్లు వాడేవారు.
  • కొన్నిసార్లు, మహిళ చర్మంపై పేర్లు రాస్తారు. వారు ఆ పేరున్న వ్యక్తికి సొంతం అనడానికి అది చిహ్నం.
చిత్రం శీర్షిక పచ్చబొట్టు వేసుకోకుంటే ఏదోలా చూస్తారని మా అమ్మ చెప్పింది

సుమారు 7 దశాబ్దాల తర్వాత మా అమ్మ పచ్చబొట్టు కొంచెం చెరిగిపోయింది. కానీ చిన్నతనంలో టాటూ వేస్తున్నప్పుడు భరించిన బాధ ఆమె మనసులో ఇప్పటికీ అలాగే ఉంది.

చేతులపై ఉన్న పచ్చబొట్టు డిజైన్‌ ఏంటో కూడా ఆమెకు తెలియదు. నాకు కూడా అదేంటో అర్థం కాలేదు. అది బహుశా 'పూల్-పత్తి' అయి ఉండొచ్చట. అంటే పూలు-ఆకులు అన్నమాట.

ఫ్లోరా, ఫానా ఎక్కువ మంది ఇష్టపడే డిజైన్లని లక్నో యూనివర్శిటీలో సామాజిక శాస్త్రవేత్తగా పనిచేస్తున్న కియా పాండే చెప్పారు. గ్రామీణ భారతదేశంలో పచ్చబొట్లపై ఆమె విస్తృత పరిశోధన చేశారు.

భర్తల పేర్లు, తండ్రుల పేర్లు కూడా ఎక్కువగా వాడతారు. ఊరి పేరు, తెగ ఆచార, సంప్రదాయాలు, దేవుళ్ల చిత్రాలు వంటి వాటిని కూడా పచ్చబొట్టుగా పొడిపించుకుంటారు. ప్రతి పల్లెలో టాటూలు వేయించుకున్న మహిళలు వందల సంఖ్యలో కనిపిస్తారని కియా పాండే చెప్పారు.

చిత్రం శీర్షిక ఈ పచ్చబొట్టు అర్థం ఏమిటో ఈమెకు తెలియదు

కొన్ని గిరిజన తెగల్లో ఆడవాళ్లతో పాటు మగవాళ్లు కూడా పచ్చబొట్టు పొడిపించుకుంటారు.

జీవించి ఉన్నప్పుడు, మరణం తర్వాత కూడా ఇదొక రకమైన గుర్తింపు చిహ్నమట. చనిపోయిన తర్వాత ఆత్మ స్వర్గానికో, నరకానికో వెళ్తుందని, ఎక్కడి నుంచి వచ్చారని అక్కడ అడుగుతారని ఒక కథ ప్రచారంలో ఉంది. అలాంటి సమయంలో పచ్చబొట్టు ద్వారా పూర్వీకులు ఎవరో గుర్తించవచ్చని నమ్ముతారు.

అందం కోసం పచ్చబొట్టు పొడిపించుకునే తెగలు కూడా కొన్ని ఉన్నాయి. అయితే, అగ్రవర్ణ పురుషుల లైంగిక వేధింపుల నుంచి కాపాడుకునేందుకు అణగారినవర్గాల మహిళలు అసహ్యంగా కనిపించేలా పచ్చబొట్టు వేయించుకున్న సందర్భాలూ ఉన్నాయి.

కానీ మాలాగే చాలా తెగల్లో మహిళలకు పెళ్లైందనేందుకు చిహ్నంగా పచ్చబొట్టు వేస్తారు.

మా అమ్మ, అమ్మమ్మ దృష్టిలో పచ్చబొట్లు స్వచ్ఛతకు చిహ్నం. పచ్చబొట్టుతో శుద్ధీకరణ ప్రక్రియ నిర్వహించకపోతే పితృస్వామ్యంలో మహిళకు మనుగడ లేదని వారు భావిస్తారు.

ఏదేమైనా ప్రస్తుతం ఈ ఆచారం తగ్గుతోంది. చాలామంది యువతులు, బాలికలు కూడా పచ్చబొట్టు వద్దని చెప్తున్నారు. తమపై పచ్చబొట్టు ముద్ర వేయవద్దని వారిస్తున్నారు.

ఇతర ప్రచంచంతో సంబంధాలు పెరగడం, ఆధునికత గ్రామీణ, గిరిజన పల్లెల్లో మార్పు తీసుకొస్తోంది. సంప్రదాయాలు, ఆచారాలు మారుతున్నాయి. గ్రామాల్లో అమ్మాయిలు పచ్చబొట్టు పట్ల ఆసక్తి చూపించడం లేదని పాండే చెప్పారు. దానికి మధ్యభారత దేశంలోని 'బైగా' తెగే నిదర్శనంగా నిలుస్తోంది.

Image copyright WATERAID/RONNY SEN
చిత్రం శీర్షిక తల్లి బాద్రి బాయ్ శరీరమంతా పచ్చబొట్టు ఉంది, అనితకు ఒకచోట పచ్చబొట్టు ఉంది. మళ్లీ పచ్చబొట్టు వేసుకునేందుకు అనిత నిరాకరించింది

సుమారు 2వేల సంవత్సరాల పూర్వం నుంచే మహిళలకు పచ్చబొట్టు వేస్తున్నారు. అమ్మాయిలు యుక్త వయస్సుకు రాగానే నుదుటిపై తొలి టాటూ వేస్తారు. క్రమంగా కొన్నిచోట్ల మినహా శరీరం మొత్తం పచ్చబొట్టు వేస్తారని వాటర్ ఎయిడ్ ఇండియాకు చెందిన ప్రజ్ఞ గుప్తా చెప్పారు.

సురక్షిత తాగునీరు అందుతుందా లేదా అనే అంశం తెలుసుకునేందుకు ప్రజ్ఞ ఇటీవలే బంజారాలను కలిశారు. అక్కడ మహిళలందరికీ పచ్చబొట్టు ఉందని ప్రజ్ఞ బీబీసీకి చెప్పారు. అయితే, ఇప్పుడు మెజార్టీ అమ్మాయిలు పచ్చబొట్టు వేయించుకునేందుకు నిరాకరిస్తున్నారని ఆమె వివరించారు.

రోడ్ల అనుసంధానం పెరగడం, టీవీలు, సెల్‌ఫోన్లు రావడం, పిల్లలు స్కూల్‌కి వెళ్తుండటంతో పల్లెల్లో చైతన్యం వికసిస్తోంది. ఇప్పడిప్పుడే పచ్చబొట్ల సంస్కృతిని వ్యతిరేకిస్తున్నారు.

ప్రజ్ఞ ఈ పదిహేనేళ్ల అమ్మాయి అనితను కలిశారు. అనిత నుదుటిపై ఒక పచ్చబొట్టు ఉంది. టాటూ వేసేటపుడు చాలా నొప్పిగా ఉందని, ఇక జన్మలో మళ్లీ పచ్చబొట్టు వేయించుకోబోనని ఆమె చెప్పింది. అనిత అమ్మ బాద్రికి శరీరం నిండా పచ్చబొట్లు ఉన్నాయని ప్రజ్ఞ గుర్తుచేసుకుంది.

అనిత నిర్ణయానికి వాళ్ల అమ్మ బాసటగా నిలిచింది. నాకు చదువురాదు. తల్లిదండ్రులు చెప్పినట్లు మారు మాట్లాడకుండా పచ్చబొట్టు వేయించుకున్నా. కానీ, అనిత స్కూల్‌కెళ్తోంది. ఆమెకు పచ్చబొట్టు ఇష్టం లేదు. అది నాక్కూడా ఇష్టమేనని బాద్రి అంటోంది.

సిటీల్లో ఉంటున్న చదువుకున్నవాళ్లు పచ్చబొట్టు వేసుకోవడం ఇటీవల బాగా పెరిగింది. హాలీవుడ్ నటులను చూసి వారిలా టాటూలు వేసుకుంటున్నారు. నా ఫ్రెండ్స్ చాలా మందికి టాటూలున్నాయి.

కానీ నా సాంస్కృతిక వారసత్వం నేపథ్యంలో నా ప్రకారం పచ్చబొట్టంటే అణిచివేతకు చిహ్నమే.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి)