నేటి సీత రాముడి నుంచి ఏం ఆశిస్తోంది?

  • దివ్య ఆర్య
  • బీబీసీ కరస్పాండెంట్
స్నేహితులు, ఆమె

ఫొటో సోర్స్, Getty Images

రామాయణంలో సీతను త్యాగం, వినయం, పాతివ్రత్యానికి మారుపేరుగా చూపించారు.

నా స్నేహితురాలి పేరు సీత. ఆమె పేరే ఆమెకు బందిఖానా.

నేనే కాదు, తనకు తెలిసిన వాళ్లంతా నిరంతరం సీత సుగుణాలను గుర్తు చేస్తూ.. ఆ పేరు నిలబెట్టుకోవాలని హెచ్చరిస్తుంటారు.

ఉదయాన్నే ఆమె కనబడితే జన్మ ధన్యమైందని భావించే పాలవాడు, నిరంతరం ఆమె ఎక్కడికి వెళుతుందో ఒక కంట కనిపెట్టి ఉండే తల్లిదండ్రులు, ఆమె ఏ మగాడితో మాట్లాడినా అనుమానాస్పదంగా గమనించే కొలీగ్స్.. సీత పేరు కారణంగా ఆమె అంచనాలను అందుకోవాలని అందరూ భావిస్తారు.

నేను అదంతా తమాషాకు చెబితే, మిగతావాళ్లంతా దాన్ని సీరియస్‌గా తీసుకుంటారు.

కొన్ని విధాలుగా వాళ్లు మంచివాళ్లే. మనకు పురాణాలు చాలా అవసరం. ఎందుకంటే అవి మనకు చరిత్ర, సంస్కృతి, మన పూర్వీకుల గురించి తెలియజేస్తాయి.

మనం ఎక్కడి నుంచి వచ్చామో, దేన్ని ఆదర్శంగా తీసుకోవాలో, ఎలా ఉండాలో వివరిస్తాయి.

స్నేహితులు, ఆమె

ఫొటో సోర్స్, Getty Images

త్యాగం, వినయం, పాతివ్రత్యం

నిజాయితీగా చెప్పాలంటే, రాముని సీతకు సంబంధించిన విషయాలన్నిటిపై మా సీతకు అయిష్టమేం లేదు. రాముని సీత తీసుకున్న నిర్ణయాల ఆధారంగా మా సీత ఆమెను అంచనా వేయదు. మా సీత మరో రకంగా రాముని సీతతో పోల్చుకుంటుంది.

తన తరానికి చెందిన మిగతా వారిలాగే ఆమె కూడా రామాయణాన్ని చదవలేదు. సీరియళ్లలో కనిపించే సీతే ఆమెకు ప్రామాణికం.

అక్కడ ఆమె చూసిన సీతకు బలమైన వ్యక్తిత్వముంది. ఎన్ని ఆపదలు వచ్చినా సీత వాటిని తట్టుకుని నిలబడింది. ఒంటరి తల్లిగా, విజయవంతంగా తన కుమారులను పెంచి పెద్ద చేసింది.

కానీ, చాలామంది దృష్టిలో సీత అంటే త్యాగం, వినయం, పాతివ్రత్యం.

కానీ అలాంటి వాటికి కట్టుబడి ఉండడం మా సీతకు ఇష్టం లేదు.

తాను సర్వోత్తమంగా ఉండాలని ఆమె అనుకోవడం లేదు. ఒకరిని అనుసరించాలనుకోవడం లేదు. తనను ఎవరైనా సులభంగా మోసం చేస్తారని భావించడం లేదు. తన బరువు బాధ్యతలు ఎవరైనా మోయాలని అనుకోవడం లేదు. అలాగే స్వచ్ఛంగా ఉండడం మీద కూడా ఆమెకు పెద్దగా నమ్మకం లేదు.

త్యాగం, వినయం, పాతివ్రత్యం

సీత స్వాతంత్రం

ఆమె ఒక వ్యక్తితో ప్రేమలో పడింది. అతను చాలా నెమ్మదస్తుడు. సృజనాత్మక ఆలోచనలు కలిగిన వాడు. పైకి రావడానికి కష్టపడుతున్న కళాకారుడు. అతనికి క్రమం తప్పకుండా ఆదాయం వచ్చే పని లేదు.

అతను లోపరహితుడు కానందువల్లే ఆమె అతణ్ని ఇష్టపడింది.

అతను తాను గొప్పవాడన్నట్లు నటించేవాడు కాదు. మగతనం ఉట్టిపడేవాడు కాదు. దూకుడుగా వ్యవహరించేవాడు కాదు.

ఆమె వస్తుంటే తలుపు తెరిచి నిలబడేవాడు కాదు. ఇంటికి రాత్రిళ్లు ఆలస్యంగా వెళుతుందేమో అని కనుక్కోవడానికి ఫోన్ చేసేవాడు కాదు.

అతను ఆమెను ఆమెగా ఉండనిచ్చేవాడు. ఆమెను విశ్వసించేవాడు. ఆమెకు ఇబ్బంది కలిగించనంత దూరంలోనే నిలబడేవాడు.

మరీ ముఖ్యంగా - ఆమె అభిప్రాయం తెలుసుకునేవాడు. ఆమె చెప్పేది వినేవాడు. ఆమె అభిప్రాయాన్ని గౌరవించేవాడు.

ఆమెకు ఎంతో ఇష్టమైనది అతనికి సాదాసీదాగా తోచేది.

సీత ఎవర్నీ పెళ్లి చేసుకోదని అతను ఆమెతో అనేవాడు.

అతని

ఫొటో సోర్స్, Alamy

ఆదర్శ మహిళ

కానీ ఆమె అభిప్రాయం ఎవరికి పట్టింది?

ఆమె మంచేదో, చెడేదో ఆమె తండ్రే నిర్ణయిస్తాడు.

మంచి అందగాడిని, బాగా చదువుకున్న, సంపాదించే వ్యక్తిని ఎంపిక చేస్తాడు.

అతను ఆమె బాధ్యత తీసుకుంటాడు. ఆమెను సంరక్షిస్తాడు. ఆమె గౌరవానికి భంగం కలిగితే దానికి పగ తీర్చుకుంటాడు.

దానికి బదులుగా ఆమె అతని మాట వింటుంది. అతనికి నచ్చేలా ప్రవర్తిస్తుంది. అతనికి అనుగుణంగా నడుచుకుంటుంది.

ఇప్పుడు సామ్రాజ్యాలు లేవు. సమాజం ఎంతో పరిణితి చెందింది. కానీ మహిళలపై అంచనాలు మాత్రం మారలేదు.

అదే సీతకు కోపం తెప్పిస్తుంది. కానీ ఆమెకు కోపం రాకూడదేమో.

రామాయణంలోని ఆదర్శప్రాయమైన మహిళ సుగుణాల గురించి గుర్తు చేయడంలో అభ్యంతరకరం ఏముంది?

కానీ అది కోపం తెప్పించకుండా ఉండదు. ఎందుకంటే దాని వల్ల అంచనాలు, నియమాలు రంగం మీదకు వస్తాయి.

నా సీత.. సీత కావడం వల్ల వాదిస్తుంది. అంటే వారి పట్ల గౌరవం లేదని కాదు. కానీ ఆమె తన గౌరవాన్నీ కోరుకుంటుంది.

నేను అర్థం చేసుకోవాలని, విశ్వసించాలని అనుకుంటే.. బదులుగా నేనూ వాటిని ఆశిస్తాను అంటుంది.

నా గురించి నేను జాగ్రత్తలు తీసుకోగలను. నాకు సమానమైన భాగస్వామి కావాలి, నాకన్నా అధికుడు కాదు.

నన్ను అనుమానించని, ప్రశ్నించని చోటు కావాలి.

నాకు స్నేహితులు కావాలి. పురుషులు, స్త్రీలు, గే, లెస్బియన్‌, ట్రాన్స్‌జెండర్.. ఎవరైనా సరే.

ఆమె,

ఫొటో సోర్స్, Getty Images

నాపై నమ్మకముండాలని కోరుకుంటాను

నాకు రక్షణ అవసరం లేదు. నన్ను విశ్వసించే వాళ్లు కావాలి.

నేను, నా సహచరుడు కలిసి జీవించాలని ప్రమాణం చేసుకున్నపుడు మా వేళ్లు ఒకే వైపుకు చూపించాల్సిన అవసరం లేదు. కేవలం పెనవేసుకుంటే చాలు.

నేను ఒక్కదాన్నే మంటల మీద నడవను. మేమిద్దరం కలిసి నడుస్తాం.

మాపై ప్రశ్నల వర్షం కురిస్తే, కలిసే సమాధానమిస్తాం.

ఎలాంటి కష్టాలు వచ్చినా, కలిసి పోరాడతాం.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)