ట్రంప్‌తో డేటింగ్ ఇష్టం లేదన్నది వీరే

‘నేను అమెరికాలోనే అత్యంత ధనవంతుణ్ణి, నాతో డేట్‌కి వస్తావా?’ అని ట్రంప్ ప్రముఖ హాలీవుడ్ తార బ్రూక్ షీల్డ్స్‌ని అడిగారట. దానికి ఆమె ‘సారీ, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు’ అని చెప్పి వదిలించుకున్నారు. 1990ల్లో జరిగిన ఈ సంఘటనని బ్రూక్ షీల్డ్స్ ఇటీవలే బయట పెట్టారు.
అమెరికాలోని ఓ చానల్లో ప్రసారమయ్యే ‘వాచ్ వాట్ హ్యాపెన్స్ లైవ్’ అనే కార్యక్రమంలో మాట్లాడుతూ బ్రూక్ ఈ విషయాన్ని పంచుకున్నారు. మార్లా మాపిల్స్ నుంచి విడాకులు తీసుకున్నాక ట్రంప్ తనకు ఫోన్ చేసి ప్రపోజ్ చేశారని ఆమె చెప్పారు.
‘‘నేను ఓ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నప్పుడు ట్రంప్ నుంచి ఫోన్ వచ్చింది. ‘నేను అమెరికాలోనే అత్యంత ధనవంతుణ్ణి. నువ్వు అమెరికా కుర్రాళ్ల కలల రాణివి. మనిద్దరం డేటింగ్ చేస్తే ప్రజలంతా చాలా సంతోషిస్తారు’ అని ఆయన అన్నారు. నాకు ఆ ప్రపోజల్ నచ్చలేదు. దాంతో నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనీ, వేరొకరితో డేట్‌కి వెళ్లడం అతనికి నచ్చదనీ చెప్పా’’ అంటూ వ్యాఖ్యాత ఆండీ కోహెన్‌తో బ్రూక్ అప్పటి విషయాల్ని పంచుకున్నారు.
బ్రూక్ షీల్డ్స్ ఒక్కరే కాదు, గతంలో కొందరు ఇతర సినీ తారలు కూడా ట్రంప్ తమని ప్రపోజ్ చేస్తే తిరస్కరించినట్లు చెప్పారు. బ్రిటిష్ నటి ఎమ్మా థాంప్సన్‌కు ట్రంప్ ఓసారి ఫోన్ చేసి తన ట్రంప్ టవర్స్‌లో ఆమెకి వసతి కల్పిస్తానని చెప్పారట. ‘‘ట్రంప్ టవర్స్‌లో ఫ్లాట్లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయనీ, నేనొస్తే కలిసి డిన్నర్ చేద్దామనీ ట్రంప్ అన్నారు. ఆ సమయంలో నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. నేను బిజీగా ఉన్నా, మళ్లీ ఫోన్ చేస్తా అని చెప్పి పెట్టేశా’ అంటూ ఎమ్మా తన అనుభవాన్ని ‘స్కావ్లాన్’ అనే టీవీ షోలో పంచుకున్నట్లు ‘హాలీవుడ్ రిపోర్టర్’ పేర్కొంది.
మరో ప్రముఖ హాలీవుడ్ నటి సల్మా హయెక్ కూడా ట్రంప్‌కి నో చెప్పిన వాళ్ల జాబితాలో ఉన్నారు. ‘నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసి కూడా ట్రంప్ నాకు ఫోన్ చేసి డేట్‌కి రమ్మని అడిగారు. నేను మరో వ్యక్తిని ఇష్టపడుతున్నానని తెలిసి కూడా ఎలా రమ్మంటున్నారని అడిగా. దానికి ఆయన బదులిస్తూ, నా బాయ్ ఫ్రెండ్ నాకు తగిన జోడీ కాడనీ, తనతో బయటకి రావాలనీ అడిగారు. నేను కుదరదని చెప్పేశా’ అంటూ ‘ది డెయిలీ షో విత్ ట్రెవర్ నోవా’ అనే టీవీ కార్యక్రమంలో సల్మా హయెక్ ఆ సంగతిని గుర్తుచేసుకున్నారు.
హాలీవుడ్ నటి క్యాండిస్ బెర్జెన్ కూడా ‘వాచ్ వాట్ హ్యాపెన్స్ లైవ్’ అనే కార్యక్రమంలో మాట్లాడుతూ గతంలో తాను ట్రంప్‌తో డేట్‌కి వెళ్లాననీ, కానీ అదంత ఆసక్తికరంగా అనిపించలేదనీ, ఆ తరవాత మళ్లీ ఆయన్ని కలవలేదనీ చెప్పారు.
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)