మహారాష్ట్రలో పురుగు మందుల వాసన పీల్చి 50 మంది రైతుల మృతి

  • 6 అక్టోబర్ 2017
పురుగు మందుల కారణంగా ఆస్పత్రి పాలయ్యాడని అనుమానిస్తున్న రైతు Image copyright Jaideep Hardikar
చిత్రం శీర్షిక గత మూడు నెలల్లో దాదాపు 800 మంది రైతులు ఆస్పత్రి పాలయ్యారు

పొలాల్లో పురుగు మందుల వాసన పీల్చి దాదాపు యాభై మంది రైతులు చనిపోయారన్న అనుమానాలు వ్యక్తమవడంతో, నిజానిజాలు తేల్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది పురుగు మందు బాధితులు కలిగిన యావత్మల్ జిల్లాలో పరిస్థితిని బీబీసీ ప్రతినిధి జైదీప్ హార్దికర్ పరిశీలించారు.

అప్పటి వరకూ ఎంతో ఆరోగ్యంగా కనిపించిన ప్రవీణ్ సోయమ్‌కి ఉన్నట్టుండి గుండెలో నొప్పి మొదలైంది. తరవాత వాంతులూ, తలనొప్పీ ప్రారంభమయ్యాయి. మరుసటి రోజే అతడు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రవీణ్ వయసు కేవలం 23.

ప్రవీణ్‌కి చికిత్సనందించిన వైద్యులు, అతడి చావుకి పురుగు మందుల వినియోగమే కారణమన్న అనుమానాల్ని వ్యక్తం చేశారు. తమ పత్తి పొలంలో రెండ్రోజుల క్రితం వాడిన పురుగు మందుల్ని పీల్చడం వల్లే ప్రవీణ్ చనిపోయాడన్నది వైద్యుల నమ్మకం.

Image copyright Reuters
చిత్రం శీర్షిక పత్తిని ఎక్కువగా పండించే ప్రాంతాల్లోనే ఎక్కువ మరణాలు నమోదయ్యాయి

ప్రవీణ్ ఒక్కడే కాదు, మహారాష్ట్రలో దాదాపు యాభై మంది రైతులు జులై నుంచి ఇప్పటిదాకా పురుగు మందుల కారణంగా చనిపోయినట్లు అనుమానిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. రోజురోజుకీ రైతుల మరణాల సంఖ్య పెరుగుతుండటంతో ఈ అంశంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

పత్తిని ఎక్కువగా పండించే యావత్మల్ జిల్లాలోనే అత్యధికంగా 19 మంది రైతులు చనిపోయారు. గత మూడు నెలల్లో ఆ జిల్లాకు చెందిన దాదాపు ఎనిమిది వందల మంది రైతులు ఆస్పత్రుల పాలైనట్టు అధికారులు గుర్తించారు.

యావత్మల్‌లో పత్తితో పాటు సోయాబీన్‌ను ఎక్కువగా పండిస్తారు. పంటల్ని రక్షించుకునేందుకు తాము పురుగు మందుల్ని ఎక్కువగా వినియోగిస్తామని అక్కడి రైతులు బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు. బాల్ వార్మ్స్‌ని తట్టుకుంటాయన్న కారణంగా జన్యు మార్పిడి చేసిన పత్తిని వాళ్లు పండిస్తుంటారు. కానీ ఈసారి ఆ పంట కూడా పురుగుల బారిన పడటంతో, పురుగు మందుల వినియోగాన్ని పెంచాల్సి వచ్చినట్టు వాళ్లు చెప్పారు.

Image copyright Jaideep Hardikar
చిత్రం శీర్షిక బాగా శక్తిమంతమైన పురుగుమందుల్నే వాడతామని రైతులు అంటున్నారు

వరసగా ఏడు రోజుల పాటు పంటకి మందు కొట్టాక ఉన్నటుండీ తాను కుప్ప కూలిపోయినట్టు 21ఏళ్ల నికేష్ చెప్పాడు. ‘పొలంలోకి వెళ్లాక చాలా తీవ్రమైన తలనొప్పి మొదలైంది. ఎదురుగా ఏమీ కనిపించలేదు’ అంటూ ఐసీయూలో చికిత్స పొందే సమయంలో నికేష్ వైద్యులతో అన్నాడు. ప్రస్తుతం సురక్షితంగా ఉన్న నికేష్ తానింకెప్పుడూ పురుగు మందులు వాడనని అంటున్నాడు. అదే ప్రాంతంలో చాలా మంది ఇతర రైతులు కూడా తాము పురుగు మందుల వాడకాన్ని ఆపేసినట్లు బీబీసీతో చెప్పారు.

‘గతంలో ఎక్కువగా పురుగు మందుని తాగే రైతులకి చికిత్స చేసేవాళ్లం. కానీ ఇది చాలా భిన్నమైన పరిస్థితి. ఇప్పుడు ఎక్కువగా పురుగు మందుల వల్ల అనారోగ్యం పాలైన వాళ్లకి చికిత్స చేస్తున్నాం’ అంటున్నారు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి డీన్ అశోక్ రాథోడ్. ప్రమాదవశాత్తూ పురుగు మందుని పీల్చిన వారికి చికిత్స చేయడం కాస్త కష్టమనీ, దాని వల్ల వాళ్ల ఊపిరితిత్తుల్లో సమస్యలు మొదలవుతాయనీ వైద్యులు చెబుతున్నారు.

జులై ఆఖరి వారంలో 41మంది రైతులు ఒకే రకమైన సమస్యలతో ఆస్పత్రికి రావడంతో పురుగు మందులపైన అనుమానం మొదలైందని వైద్యులు అంటున్నారు. ఆగస్టు నాటికి ఆస్పత్రిలో చేరిన రోగుల సంఖ్య వంద దాటింది. సెప్టెంబరులో అది మూడొందలకు చేరింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న రైతుల్లో పది మంది ఐసీయూలో ఉన్నారనీ, పాతిక మంది ద‌ృష్టి లోపంతో బాధపడుతున్నారనీ వైద్యులు చెబుతున్నారు.

Image copyright Jaideep Hardikar
చిత్రం శీర్షిక ప్రవీణ్ సోయమ్ పురుగు మందుల కారణంగానే చనిపోయాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు

యావత్మల్‌లో పరిస్థితిపై గతనెలలో అధ్యయనం చేసిన వ్యవసాయ శాస్త్రవేత్తలు, పురుగు మందుల్ని కొట్టేటప్పుడు సరైన జాగ్రతల్ని తీసుకోకపోవడం వల్లే రైతులకు ఆరోగ్య సమస్యలొస్తున్నాయని చెప్పారు. ఇటీవల చనిపోయిన ప్రవీణ్ తండ్రి, తన కొడుకు సరైన రక్ష పరికారల్ని వాడలేదని ఒప్పుకుంటూనే, గతంలోనూ చాలాసార్లు అతడు ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోకుండానే పురుగుమందుల్ని వినియోగించాడనీ, అప్పుడు రాని సమస్య ఇప్పుడెందుకు వచ్చిందని ప్రశ్నిస్తున్నారు.

రైతులు నిజంగా విషపూరిత పురుగు మందుల్ని వాడారా? వాళ్లకు తెలీని కొత్త రకం పురుగు మందుల్ని ఏమైనా ఉపయోగించారా? లేక రక్షణ ప్రమాణలు సరిగ్గా పాటించలేకపోయారా? అన్నవి తేలాల్సిన ప్రశ్నలు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు