నిరుద్యోగం పెరగడానికి కారణం ఏంటి?

  • సౌతిక్ బిశ్వాస్
  • బీబీసీ ప్రతినిధి
క్యూ లైన్లో నిలుచున్న మగవారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

2కోట్ల 60లక్షల మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు

ఎన్నికల ప్రచారంలో భాగంగా 2013లో 'మేం అధికారంలోకి వస్తే కోటి ఉద్యోగాలను కల్పిస్తాం' అని మోదీ ప్రకటించారు. సంవత్సరం తిరక్కుండానే, భారీ మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వచ్చింది.

కానీ, తాజా సర్వే ప్రకారం ఉపాధి కల్పన నత్తనడకన సాగుతోంది. 2013-14లో నిరుద్యోగం 4.9% ఉంది. కానీ, బీజేపీ ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగం 5 శాతానికి పెరిగింది.

కార్మికశాఖ తాజా గణాంకాల ఆధారంగా ఆర్థికవేత్త వినోజ్ అబ్రహమ్ ఓ అధ్యయనం చేశారు. అందులో, భారతదేశంలో 2012-16 మధ్య ఉద్యోగాల కల్పన వృద్ధిశాతం భారీగా పడిపోయిందని తేలింది.

వినోజ్ అబ్రహమ్ అధ్యయనంలో దిగ్భ్రాంతికి గురిచేసే మరో అంశం వెలుగుచూసింది. ఉపాధి క్షీణించిపోవడంతో పాటు 2013-14, 2015-16 మధ్య కాలంలో అంతవరకూ ఉన్న ఉద్యోగాలు కూడా ఆవిరైపోయాయి. స్వతంత్ర్య భారతంలో ఇలా జరగటం బహుశా ఇదే తొలిసారి కావచ్చు.

ఉద్యోగాలు ఆవిరైపోవడం తాత్కాలికం కావచ్చు. కానీ, సగంమంది భారతీయులు ఆధారపడ్డ వ్యవసాయం రంగంలో కూడా ఉపాధి మాయమవుతోంది.

గిట్టుబాటు ధరలు లేకపోవడం, వరుస కరవులూ రైతుల్ని వ్యవసాయ రంగానికి దూరం చేస్తున్నాయి. నిరుద్యోగ రైతులూ, రైతు కూలీలూ.. గృహనిర్మాణం ఇతర రంగాలపై ఆధారపడుతున్నారు.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

కరువు ధాటికి వ్యవసాయ రంగంలో ఉపాధి కొరత

మెకిన్జీ గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ అధ్యయనం ప్రకారం వ్యవసాయ రంగంలో 2011-15 మధ్య 2 కోట్ల 60 లక్షల మంది ఉపాధి కోల్పోయారు.

ఏప్రిల్-జూన్ మధ్య జిడిపి 5.7% తో మూడేళ్ళ కనిష్టానికి చేరింది. వివాదాస్పదమైన నోట్ల రద్దు, జూలైలో ప్రవేశపెట్టిన జీఎస్టీలు వ్యవసాయ, గృహనిర్మాణ, చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపాయి.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పరిశీలన ప్రకారం.. రిటైల్, విద్యుత్, నిర్మాణ, నిత్యావసర విభాగం, ఇతర రంగాల్లోని 120 కంపెనీల్లో ఉద్యోగ నియామకాలు గణనీయంగా పడిపోయాయి. విస్తరణ ప్రణాళికలు, స్వల్పకాల వృద్ధిపై కూడా ఈ ప్రభావం పడింది.

'ఉపాధి కల్పన' ప్రస్తుతం భారతదేశం ముందున్న అతి పెద్ద సవాలు. ప్రతి సంవత్సరమూ ఒక కోటీ ఇరవై లక్షల మంది కార్మికులు ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ సమస్య దాదాపు 2030 వరకూ కొనసాగుతుంది. మరోవైపు.. ఆస్ట్రేలియా దేశ జనాభాతో దాదాపు సమానమైన 2 కోట్ల 60 లక్షల మంది భారతీయులు ఇప్పటికే ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

తక్కువ జీతాలతో, ఎటువంటి ప్రమాణాలు లేని పరిశ్రమల్లో కార్మికులు పనిచేయాల్సి వస్తోంది

ప్రాణాలు నిలుపుకునేంత సంపాదన

ఇండియాలో నిరుద్యగ సమస్య తీవ్రంగా వుంది. కానీ, విదేశాల్లోలాగ నిరుద్యోగానికి అద్దం పట్టే పోడవాటి క్యూలు ఇక్కడ కనబడవు.

సామాజిక భద్రతా వ్యవస్థ లేకపోవడం, పేదరికం వంటి కారణాలతో దేశంలో చాలామంది ప్రజలు కేవలం తమ ప్రాణాల నిలుపుకోవడానికి అవసరమైన మేరకే సంపాదించగలుగుతున్నారు.

భారతదేశంలో చాలామంది నిరుద్యోగులు తమ కుటుంబాలపైనే ఆధారపడుతున్నారు. ఉపాధి కొరత కారణంగా, తక్కువ మంది చేయగలిగిన పనిని చాలామంది పంచుకుంటున్నారు. దీంతో, వారి ఆదాయం కూడా పలుచబడుతోంది.

దేశంలో దాదాపు ఎనభై శాతం మంది కార్మికులు తగు ప్రమాణాలు పాటించని పరిశ్రమలలో చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నారు.

వీరిలో చాలా తక్కువ మందికే ఉద్యోగ భద్రత, ఆదాయ భద్రత ఉంటోంది. దేశంలో కేవలం 7 శాతం మంది మాత్రమే, ఉత్తమ ప్రమాణాలున్న ఆర్థిక వ్యవస్థల్లో పనిచేస్తూ, కార్మిక ఉపకారాలు పొందుతున్నారని అంచనా.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

జీఎస్టీ, నోట్ల రద్దుతో చిరు వ్యాపారులు చతికిలపడ్డారు

''భవిష్యత్తులో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉండబోతోంది. కార్మిక శక్తి విపరీతంగా పెరుగుతోంది. రానున్న ముఫ్ఫై సంవత్సరాల్లో నెలకు దాదాపు పదిలక్షల మంది ప్రజలు కార్మికవర్గంలో భాగమవుతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియా రెండంచెల ఆర్థిక వ్యవస్థను శాశ్వతపరుచుకునే క్రమంలో ఉంది'' అని ఇండియాస్ లాంగ్ రోడ్ పుస్తక రచయిత డాక్టర్ జోషి చెబుతున్నారు.

కార్మిక శక్తిని అసంబద్ధంగా పంపిణీ చేయడం వల్లనే నిరుద్యోగ సమస్య తలెత్తిందని చెప్పవచ్చు.

ఎక్కువ మంది కార్మికులు అవసరమైన రంగాల్లో ఉపాధి మందకొడిగా సాగుతుంటే, తక్కువమంది కార్మికులు ఉత్పత్తి చేయగలిగిన చోట పెద్దమొత్తంలో పనిచేస్తున్నారు.

ఈ కారణాలతో తక్కువ జీతాలతో, ఎటువంటి ప్రమాణాలు లేని పరిశ్రమల్లో పనిచేయాల్సి వస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

సగంమంది భారతీయులు ఆధారపడ్డ వ్యవసాయం రంగంలో కూడా ఉపాధి మాయమవుతోంది

భారత్ ఉపాధిని సృష్టించే అవకాశాన్ని కోల్పోయిందా

ఉపాధిని సృష్టించడం కోసం కార్మికులు ఎక్కువగా అవసరమయ్యే గార్మెంట్స్, లెదర్ మొదలైన పరిశ్రమలపై దృష్టి పెట్టాలి.

లైసెన్స్‌లేని కారణాలను చూపి కబేళాలను మూసివేయడం, గోవధను నియంత్రించడం వంటి నిర్ణయాల కారణంగా ఇండియాలో లెదర్ ఎగుమతులు తగ్గిపోయాయి.

తక్కువ ధర కలిగిన చిన్నచిన్న బొమ్మలు, నేత వస్తువుల తయారీ లాంటి పరిశ్రమల విషయంలో భారతదేశం, తన వైఫల్యాలను ఇంకా కొనసాగిస్తూనేవుందని మోర్గాన్ స్టాన్లీ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ ఛీఫ్ గ్లోబల్ స్ట్రాటజిస్ట్ రుచిన శర్మ అన్నారు.

చైనా మార్కెట్‌పై ఇండియా ఆధారపడ్డానికి, ఇండియాలో నిరుద్యోగం పెరగడానికీ ఇదే ప్రధాన కారణం కావచ్చు అని కూడా రుచిర్ శర్మ అభిప్రాయపడ్డారు.

బహుశా, ఉద్యోగాల కల్పన విషయంలో భారత్ తన అవకాశాలను ఎప్పుడో వదిలేసిందేమో??

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)