తొలిసారిగా భారత్‌లో ఫిఫా ప్రపంచ కప్ వేడుక

  • 6 అక్టోబర్ 2017
అండర్-17 ఫుట్‌బాల్ ప్రపంచకప్ Image copyright EPA

ప్రపంచంలో అత్యధిక ఆదరణ కలిగిన ఆట ఫుట్‌బాల్. అలాంటి ఫుట్ బాల్ అండర్ 17 ఫిఫా ప్రపంచకప్‌కి భారత్ అతిథ్యమిస్తోంది.

భారత్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో భారత్‌తో సహా 24 దేశాలు పాల్గొంటున్నాయి. టైటిల్ గెలుపే లక్ష్యంగా భారత్ బరిలో దిగుతోంది.

ఈ పోటీలో అసలైన విజేత ఎవరవుతారో తెలియాలంటే 28 అక్టోబర్ వరకూ వేచి చూడాల్సిందే. ఆ రోజు జరగబోయే ఫైనల్ మ్యాచ్‌‌కు కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియం వేదిక కానుంది.

ఈ టోర్నమెంట్‌లో మొదటి మ్యాచ్ శుక్రవారం కొలంబియా, ఘనా మధ్య జరగబోతోంది.

ఈ పోటీలకు దిల్లీలోని జవహర్ లాల్ నెహ్రు స్టేడియం వేదిక కానుంది. రెండో మ్యాచ్‌లో అమెరికాతో భారత్ తలపడనుంది.

Image copyright AFP

భారత్‌లో ఫుట్‌బాల్ అభిమానులు

1950లో బ్రెజిల్‌లో జరిగిన ఫిఫా ప్రపంచకప్‌లో భారత్ కూడా పాల్గొందనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అప్పుడు జరిగిన మ్యాచ్ లో షూ లేకుండా ఆడడంతో భారత్ పెద్ద అవకాశాన్నే కోల్పోయింది.

ఇప్పుడు అదే అవకాశం మళ్ళీ వచ్చింది. ఈ సారి అండర్ -17 ఫుట్‌బాల్ ప్రపంచకప్ పోటీలకు ఆతిథ్యమిచ్చే అవకాశం భారత్‌కి లభించింది.

ఇదో గొప్ప అవకాశమని ఫుట్‌బాల్ విశ్లేషకులు నోవీ కపాడియా అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానులు ఈ పోటీలను చూసేందుకు భారత్‌కి వస్తున్నారని ఆయన అన్నారు.

Image copyright AIFF

మొదటిసారి పాల్గొంటున్న భారత్

అమర్‌జీత్ సింగ్ కియాం నేతృత్వంలో ఆడే భారత జట్టు సభ్యులందరికీ ఇదో చారిత్రక సందర్భం. వారందరూ మొదటిసారి ఫిఫా పోటీల్లో పాల్గొంటున్నారు.

ఈ ప్రపంచకప్‌లో మొత్తం 24 జట్లు పాల్గొంటున్నాయి. ఈ జట్లను 6 గ్రూపులుగా విభజించారు.

గ్రూపు ఏ లో ఆతిథ్య జట్టు భారత్, అమెరికా, కొలంబియా, ఘనా ఉన్నాయి.

గ్రూప్‌ బి లో పరాగ్వే, మాలి, న్యూజీలాండ్, టర్కీ ఉన్నాయి.

గ్రూప్ సి లో ఇరాన్, గునియా, జర్మనీ, కోస్టారికా ఉన్నాయి.

Image copyright AFP

గ్రూప్ డి ఉత్తర కొరియా, నైజర్, బ్రెజిల్, స్పెయిన్ ఉన్నాయి.

గ్రూప్ ఈ లో హోండురాస్, జపాన్, న్యూ కాలెడోనియా, ఫ్రాన్స్ ఉన్నాయి.

గ్రూప్ ఎఫ్ లో ఇరాక్, మెక్సికో, చిలీ, ఇంగ్లండ్ బరిలోకి దిగుతున్నాయి.

గ్రూప్ ఎఫ్ ఒక రకంగా గ్రూప్ ఆఫ్ కావొచ్చని ఫుట్‌బాల్ విశ్లేషకులు నోవీ కపాడియా అంటున్నారు.

Image copyright AFP

ఈ గ్రూప్ లో ఉన్న నాలుగు జట్లన్నీ సమానమేనని ఆయన అంటున్నారు. ఇరాక్ ఆసియా ఛాంపియన్ అని, ఎన్నో ఏళ్లుగా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో పాల్గొంటున్నా ఎక్కడా అంతగా ప్రభావం చూపలేదని ఆయన అన్నారు.

కానీ అండర్ 20 టోర్నమెంట్ లో ఇంగ్లాండ్ జట్టుకు ప్రపంచ వ్యాప్తంగా పేరుంది. ఆ జట్టు క్రీడాకారులు లివర్ పూల్ - చెల్సియా వంటి ఫుట్‌బాల్ క్లబ్బులో ఆడతారు.

Image copyright AFP

రసవత్తరమైన పోరు

బలాబలాల ప్రకారంగా చూస్తే ఇంగ్లాండ్ టీం చాలా బలంగా ఉంది. ఈ టోర్నీలో సెమీస్‌లో ఇంగ్లాండ్, జర్మనీ, బ్రెజిల్, స్పెయిన్ వంటి జట్లు తలపడే అవకాశం ఉందని ఫుట్‌బాల్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరో రకంగా మెక్సికో కూడా బలంగానే ఉంది. మెక్సికో గతంలో ఈ ఛాంపియన్‌షిప్‌ను గెలుపొందింది. మరో వైపు చిలీ కూడా బలమైన జట్టనే ఫుట్‌బాల్ విశ్లేషకులంటున్నారు. ఈ గ్రూప్ నుండి ఇంగ్లాండ్ - మెక్సికో జట్లు అర్హత సాధించొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రతి గ్రూప్ నుంచి రెండు జట్లే అర్హత సాధిస్తాయి. గ్రూప్ ఏ నుంచి భారత్ అర్హత అవకాశాలపై నేవి కపాడియా విశ్లేషించారు. ఈ గ్రూప్ నుంచి భారత్ అర్హత సాధించడం ఒక రకంగా సవాలేనని ఆయన అన్నారు.

ఘనా, కొలంబియా లాంటి జట్లకు భారత్ లో ఉండే వాతావరణం కూడా అనుకూలంగా ఉందని కపాడియా చెప్పారు. వారికి ఇక్కడ ఎండ తీవ్రత తక్కువేనని ఆయన అంటున్నారు. ఘనా టీం ఇది వరకే రెండు సార్లు ఈ టైటిల్‌ని గెలుపొందింది.

అమెరికా కూడా ఈ టోర్నీ కోసం తీవ్రంగానే ప్రాక్టీస్ చేసిందని ఆయన అన్నారు.

Image copyright AFP

భారత జట్టు మ్యాచ్‌లు

ఈ అండర్-17 ప్రపంచకప్ లో భాగంగా దిల్లీ, కొచ్చి, కలకత్తా, నవి ముంబై, గువహాటి, మడ్ గావ్ వంటి నగరాల్లో భారత జట్టు మ్యాచ్‌లు ఆడనుంది.

అండర్-17 ప్రపంచకప్ ను ఇప్పటివరకూ నైజీరియా ఐదు సార్లు గెలుపొందింది. 1985, 1993, 2007, 2013, 2015 లో ఆ దేశం ఛాంపియన్‌గా నిలిచింది.

2009 లో స్విట్జర్లాండ్, 2011 లో మెక్సికో ఛాంపియన్‌లుగా నిలిచాయి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)