ఇండియా కిందకి.. అంబానీ పైపైకి

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో టాప్ 100 మంది ధనవంతుల జాబితాను ఇటీవల ఫోర్బ్స్ ఇండియా వెల్లడించింది. ఒక వైపు భారత ఆర్థిక వృద్ధి నెమ్మదించినా.. దేశంలోని 100 అత్యధిక ధనవంతుల ఆస్తి మాత్రం నాలుగో వంతు పెరిగిందని వివరించింది.
"మందగించిన ఆర్థిక వ్యవస్థలో కూడా మరింత సంపన్నులవుతున్న భారత కుబేరులు " అంటూ ఫోర్బ్స్ ఒక కథనాన్ని వెబ్సైట్ లో ప్రచురించింది.
ఫొటో సోర్స్, FORBES INDIA SCREENSHOT
దెబ్బ కొట్టిన నోట్ల రద్దు, జీఎస్టీ
ఫోర్బ్స్ఇండియా ప్రచురించిన ఈ కథనంలో నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల భారత ఆర్థిక వ్యవస్థ మందగించిందని తెలిపింది.
"గత నవంబర్ లో అమలులోకి వచ్చిన నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల నెలకున్న అనిశ్చితి కారణంగానే జూన్ త్రైమాసికంలో భారత ఆర్థిక వృద్ధి మందగించి మూడు సంవత్సరాలలో ఎప్పుడూ లేనంత తక్కువ స్థాయి 5.7 శాతానికి చేరింది " అని ఫోర్బ్స్ ఇండియా తెలిపింది.
"అయినా ప్రస్తుత పరిస్ధితుల్లో ఏమాత్రం సంబంధం లేకుండా దేశంలో అత్యధిక సంపన్నులైన వంద కుబేరులకు చెందిన కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఈ ఏడాది వారి ఆస్తి 25శాతం కన్నా ఎక్కువ వృద్ధితో 479 బిలియన్ డాలర్లకు చేరింది" అని ఫోర్బ్స్ వెల్లడించింది.
లక్ష కోట్లు పెరిగిన ముఖేశ్ అంబానీ ఆస్తి
టాప్ కుబేరుల జాబితాలో మొదటి స్థానం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీదే.
" ఈ ఏడాది చమురు, గ్యాస్ వ్యాపారాలు చేస్తున్న ముఖేశ్ అంబానీ కన్నా ఎక్కువ లాభం ఎవరికీ కలగలేదు. తన ఆస్తిలో 15.3 బిలియన్ డాలర్ల (అంటే లక్ష కోట్లు) వృద్ధితో ఆయన మొదటి స్ధానాన్ని పదిలం చేసుకున్నారు" అని ఫోర్బ్స్ ఇండియా ప్రకటించింది.
ముఖేశ్ అంబానీ మొత్తం ఆస్తి విలువ 38 బిలియన్ డాలర్లు (అంటే దాదాపు 2.47 లక్షల కోట్లు) కు చేరిందని ఫోర్బ్స్ తెలిపింది.
ఫోర్బ్స్ ఇండియా ప్రముఖ అమెరికన్ పత్రిక ఫోర్బ్స్‌కు చెందిన భారతీయ సంస్ధ. దీని యాజమాన్య హక్కులు కూడా ముఖేశ్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ దగ్గరే ఉన్నాయి.
అంతా జియో ప్రభావమే
ముఖేశ్ అంబానీ భారత్‌తో పాటు ఆసియాలో అత్యధిక సంపన్నులో 5వ స్థానంలో కూడా చేరారని ఫోర్బ్స్ తెలిపింది. జియో దీనికి ఒక కారణమని వెల్లడించింది.
"ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు జియో కారణంతోనే పెరిగాయి" అని ఫోర్బ్స్ తెలిపింది.
ఫొటో సోర్స్, FORBES INDIA SCREENSHOT
ఆ 27 మందే 1 బిలియన్ డాలర్ల సంపద సృష్టించారు
" ఈ జాబితాలో ఉన్న 27 మంది సంపన్నులు గత ఏడాది జాబితాలో కూడా ఉన్నారు. వారి ఆస్తి ప్రస్తుతం ఒక బిలియన్ డాలర్లు లేదా అంతకన్నా పెరిగింది" అని ఫోర్బ్స్ ఇండియా తెలిపింది.
ఈ జాబితాను సెప్టెంబరు15 నాటి షేర్లు, ఎక్స్చేంజ్ రేట్ల ఆధారంగా తయారు చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సన్నిహితులని ప్రచారం పొందిన గౌతమ్ అదానీ ఈ జాబితాలో 10వ స్థానంలో నిలిచారు.
ముఖేశ్ అంబానీకి తమ్ముడైన రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీ 45వ స్థానంలో నిలిచారు.
ఫొటో సోర్స్, Getty Images
టాప్ 20 లో చేరిన ఆచార్య బాలకృష్ణ
ఈ జాబితాలో పతంజలి ఆయుర్వేద మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ 19 స్థానంలో నిలిచారు. 45ఏళ్ల బాలకృష్ణ టాప్ 20 మంది సంపన్నుల జాబితాలో అత్యంత తక్కువ వయస్సుగల పారిశ్రామికవేత్త. ఆయన ఆస్తి మొత్తం 6.55 బిలియన్ డాలర్లు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్ లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)