గత టోర్నీ విజేత.. ఈ టోర్నీలో గల్లంతు

 • 6 అక్టోబర్ 2017
ముంబయి‌లోని డీవై పాటిల్ స్టేడియం దగ్గర పోలీసులు Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఫిఫా టోర్నీలో పాల్గొనడం భారత్‌కి ఇదే తొలిసారి

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఆడే ఆట ఫుట్‌బాల్. అంతర్జాతీయ స్థాయిలో ఆ క్రీడకు ప్రాతినిథ్యం వహించాలనీ, ఒక్కసారైనా ఫిఫా టోర్నీలో ఆడాలనీ తపించే భారత జట్టు చిరకాల స్వప్నం నేటితో తీరనుంది.

ఈ రోజు నుంచి దిల్లీలో ప్రారంభం కానున్న ఫిఫా అండర్-17 ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌కు ఆతిథ్య జట్టు హోదాలో భారత్ నేరుగా అర్హత సాధించింది. ఫిఫా టోర్నమెంట్‌లో ఆడే అవకాశం భారత్‌కి దక్కడం ఇదే తొలిసారి.

ఈ నేపథ్యంలో అండర్- 17 ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కి సంబంధించి కొన్ని సంగతులు:

 • అండర్-17 ప్రపంచ కప్ భారత జట్టులో ఉన్న 21మంది ఆటగాళ్లలో ఎనిమిది మంది మణిపూర్‌కి చెందిన వారే.
 • అమెరికా, బ్రెజిల్... రెంటికీ ఇది పదహారవ అండర్-17 ప్రపంచకప్. ఎక్కువసార్లు ఈ పోటీల్లో పాల్గొన్న రికార్డు వీటిదే.
 • ప్రపంచ కప్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా నైజీరియాకి పేరుంది. ఆ జట్టు ఐదు సార్లు టోర్నమెంట్‌ని గెలిచింది. మూడు సార్లు రన్నరప్‌గా నిలిచింది. గత టోర్నీలో కూడా ఆ జట్టే విజేత. కానీ ఈసారి పోటీలకు అది కనీసం అర్హత సాధించలేకపోవడం విశేషం.
Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఈ టోర్నీలో భారత జట్టులో ఎనిమిది మంది మణిపూర్ ఆటగాళ్లకు చోటు దక్కింది
 • ఫిఫా అండర్-17 టోర్నీ, ఫిఫా వరల్డ్ కప్... ఈ రెండు పోటీల ఫైనల్స్ గెలిచిన జట్టులో ఆడిన ఒకే ఒక్క ఆటగాడు, బ్రెజిల్ స్టార్ రొనాల్డిన్హో.
 • 2011లో మెక్సికో, ఉరుగ్వేకి మధ్య మెక్సికోలో జరిగిన అండర్-17 ఫైనల్‌ చూడ్డానికి అత్యధికంగా 98,943 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. అదే భారత్‌లో ఉన్న అతిపెద్ద ఫుట్‌బాల్ స్టేడియం సామర్థ్యమే 66,600. కోల్‌కతాలో ఉన్న ఈ స్టేడియంలోనే ఈసారి ఫైనల్ జరగనుంది.
 • ఇప్పటిదాకా అండర్-17 ప్రపంచ కప్‌లో వందకు పైగా గోల్స్ చేసిన జట్లు రెండే రెండు. ఒకటి బ్రెజిల్(166), రెండు నైజీరియా(149).
 • నైజీరియా ఆటగాడు విక్టర్ ఒసిమెన్ అండర్-17 ప్రపంచకప్‌లో ఆల్ టైం టాప్ స్కోరర్. 2015 టోర్నీలో అతడు అత్యధికంగా పది గోల్స్ చేశాడు.
Image copyright Getty Images
చిత్రం శీర్షిక గతేడాది టోర్నీ గెలిచిన నైజీరియా జట్టు ఈసారి టోర్నీకి కనీసం అర్హత సాధించలేదు
 • పద్నాలుగేళ్ల వయసులో ఫ్రెడ్డీ అదు అనే అమెరికన్ ఆటగాడు 2013లో జరిగిన అండర్-17 వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ (ఒకే మ్యాచ్‌లో మూడు గోల్స్) సాధించాడు. అదే అటగాడు 2007లో జరిగిన అండర్-20 వరల్డ్ కప్‌లోనూ హ్యాట్రిక్ నెలకొల్పి ఆ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు.
 • ఇప్పటిదాకా జరిగిన పదహారు టోర్నీ ఫైనల్స్‌లో నలుగురు విజేతల్ని పెనాల్టీ షూట్ అవుట్ ద్వారానే నిర్ణయించారు.
 • ఫిఫా అండర్-17 ప్రపంచ కప్ నిజానికి 1985లో ఫిఫా అండర్-16 ఛాంపియన్ షిప్‌గా మొదలైంది. 1991 తరవాత అది పదిహేడేళ్ల వాళ్లని కూడా చేర్చుకొని అండర్-17 ప్రపంచ ఛాంపియన్ షిప్‌గా మారింది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు