సీరియల్ చూసి గర్భనిరోధంపై చైతన్యం పొందిన బిహార్ మహిళ

  • 21 అక్టోబర్ 2017
నిర్మా దేవి Image copyright PFI
చిత్రం శీర్షిక నిర్మా దేవి

భారత్‌లో గర్భనిరోధం గురించి బహిరంగంగా మాట్లాడటానికి చాలా మంది వెనకాడతారు. గర్భనిరోధక మాత్రలు వాడటానికీ సంశయిస్తారు. బిహార్ లాంటి రాష్ట్రాల్లో ఈ పరిస్థితులు అధిక సంతానానికి దారితీస్తున్నాయి. అయితే బిహార్ గ్రామీణ ప్రాంతాల్లో ఒక టీవీ సీరియల్ కుటుంబ నియంత్రణపై చర్చ జరిగేలా చేస్తోంది.

ఈ అంశంపై బీబీసీ హిందీ ప్రతినిధి సరోజ్ సింగ్ అందిస్తున్న కథనం ఇది.

నిర్మా దేవి, బిహార్‌లోని గయ జిల్లాలో మారుమూల గ్రామమైన బారాచట్టికి చెందిన మహిళ. ఆమెకు 29 సంవత్సరాలు.

11 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకొని అత్తారింటికి వచ్చాక ఆమె కుటుంబ నియంత్రణ, గర్భనిరోధక పద్ధతుల గురించి ప్రస్తావన తెస్తే చాలు, ఇతర మహిళలు తప్పుబట్టేవారు.

ఒకచోట ఉండే మహిళలకు పీరియడ్స్ ఒకేసారి వస్తాయా?

ఈ 8 అద్భుత ఆవిష్కరణలు మహిళలవే

ఇలాంటి పరిస్థితుల కారణంగానే దేశంలోకెల్లా అత్యంత పేద రాష్ట్రాల్లో ఒకటైన బిహార్‌లో సగటున ఒక్కో మహిళకు ముగ్గురు లేదా నలుగురు పిల్లలు ఉన్నారు.

అన్ని రాష్ట్రాల్లోకెల్లా బిహార్‌లోనే సంతానోత్పత్తి రేటు ఎక్కువ.

Image copyright PFI
చిత్రం శీర్షిక కుటుంబంతో నిర్మా దేవి

ఒక మహిళ జన్మనిచ్చే మొత్తం పిల్లల సగటు సంఖ్యను సంతానోత్పత్తి రేటుగా పరిగణిస్తారు. ఈ విషయంలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) గణాంకాల ప్రకారం జాతీయ సగటు ఇదరు కాగా, బిహార్ సగటు మాత్రం ముగ్గురు.

మార్పుకు ప్రతినిధిగా నిర్మా దేవి

బిహార్‌లో ఇప్పుడిప్పుడే అక్కడక్కడా మార్పు కనిపిస్తోంది. కుటుంబ నియంత్రణపై గ్రామాల్లో చర్చకు తెర తీసిన ఒక టీవీ సీరియల్ నిర్మా దేవి లాంటి మహిళలను మార్పుకు ప్రతినిధులుగా నిలుపుతోంది.

వారు కుటుంబ నియంత్రణ పాటించేందుకు అడుగు ముందుకేస్తున్నారు.

‘‘నేను గర్భనిరోధక మాత్రలు వాడతాను. వీటివల్ల ప్రతికూల ప్రభావమేమీ ఉండదని నాకు తెలుసు’’ అని నిర్మా దేవి స్పష్టంగా చెబుతుండటాన్ని ఒక ఉదాహరణగా పేర్కొనవచ్చు.

నిర్మా దేవికి ఇద్దరు పిల్లలు. కొడుకుకు పదేళ్లు. కుమార్తెకు ఏడేళ్లు.

ఆమె తన ఇద్దరు సంతానం మధ్య మూడేళ్ల ఎడం పాటించడంతోపాటు గ్రామంలోని దాదాపు 200 మంది మహిళలను కూడా ఈ దిశగా ఆలోచింపజేశారు.

’’మై కుచ్ భీ కర్ సక్తీ హూ’’ (నేనేదైనా చేయగలను- అని అర్థం ) సీరియల్ తనపై చాలా ప్రభావం చూపిందని నిర్మా దేవి చెబుతున్నారు.

లైంగిక ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ పద్ధతులు, ఇతర అంశాలపై గ్రామీణ మహిళల్లో చైతన్యం పెంచాలనుకునే ముంబయి వైద్యురాలు స్నేహ కథే ఈ సీరియల్. ఈ పాత్రను చూసి నిర్మా దేవి ప్రేరణ పొందారు.

Image copyright YOUTUBE
చిత్రం శీర్షిక సీరియల్ ఇదే

‘‘ఓ ఎపిసోడ్‌లో ఒక మహిళ నాలుగో సంతానానికి జన్మనిస్తూ ఆస్పత్రి స్ట్రెచర్‌పైనే ప్రాణాలు వదిలింది. ఆమెకు మూడేళ్లలో ముగ్గురు పిల్లలు పుట్టారు. ఆమె శరీరం నాలుగో సంతానానికి అప్పటికి ఇంకా సిద్ధమైనట్లు లేదు’’ అని నిర్మా దేవి చెప్పారు.

ఈ ఎపిసోడ్ చూశాక, కుటుంబ నియంత్రణపై మహిళల్లో చైతన్యం తీసుకురావాలని ఆమె సంకల్పించుకొన్నారు. చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి మహిళలను చైతన్యపరిచేందుకు 20 మందితో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు.

ఆరోగ్య కార్యకర్త అండ

స్థానిక ఆరోగ్య కార్యకర్త పూనమ్ కల్పించిన అవగాహనతోనే తన ఇద్దరు పిల్లల మధ్య మూడేళ్ల వ్యవధిని పాటించగలిగానని నిర్మా దేవి చెప్పారు.

జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం(ఎన్‌హెచ్‌ఆర్‌ఎస్) కింద నియమితమైన సామాజిక ఆరోగ్య కార్యకర్తల బృందంలో పూనమ్ ఒకరు. వీరు లైంగిక ఆరోగ్యంపై మహిళలకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రసవాలు ఆస్పత్రుల్లో జరిగేలా ప్రోత్సహిస్తుంటారు.

తప్పని తిప్పలు

కుటుంబ నియంత్రణపై అవగాహన పెంచుకున్నా, గర్భనిరోధక మాత్రలు సంపాదించడానికి మాత్రం నిర్మా దేవి చాలా తిప్పలు పడాల్సి వచ్చింది.

‘‘మాత్రలు తెచ్చివ్వమని అడిగితే మా ఆయన మొదట్లో ససేమిరా అన్నారు. నేనెలా తీసుకురాగలను, ఊళ్లో ఎవరైనా మగవారికి తెలిస్తే ఏమనుకుంటారో ఆలోచించావా అన్నారు’’ అని ఆమె వివరించారు.

Image copyright PFI
చిత్రం శీర్షిక కుటుంబ నియంత్రణపై చైతన్యం కల్పించేందుకు ఏర్పాటు చేసిన బృందంతో సమావేశమైన నిర్మా దేవి

తాను ఒత్తిడి చేయడంతో తన భర్త ఎట్టకేలకు ఒప్పుకొన్నారని, దగ్గర్లోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారని, అక్కడ తనకు గర్భనిరోధక మాత్రలు ఉచితంగా ఇచ్చారని తెలిపారు.

తర్వాత ఊళ్లోని మిగతా ఆడవారినీ గర్భనిరోధం పాటించేలా నిర్మా దేవి ఒప్పించగలిగారు.

ప్రతి గంటకు ఐదుగురి మరణం

భారత్‌లో ప్రసవ సమయంలో ప్రతి గంటకు ఐదుగురు మహిళలు చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూ‌హెచ్‌వో) నివేదిక ఒకటి చెబుతోంది.

కుటుంబ నియంత్రణ పద్ధతులపై స్త్రీ, పురుషులిద్దరికీ సరైన అవగాహన లేకపోవడం ఈ సమస్యకు ఒక కారణం.

కుటుంబ నియంత్రణ శస్ర్తచికిత్స చేయించుకోవాల్సిన బాధ్యత భార్యదేకాని, భర్తది కాదనే భావన భారత్‌లో ఎక్కువ. నిరోధ్‌లు వాడటం, మాత్రలు వేసుకోవడం లాంటి తాత్కాలిక గర్భనిరోధక పద్ధతులపైనా అవగాహన పెద్దగా లేదు. సంతానం మధ్య తగినంత ఎడమ పాటించలేకపోవడానికి ఇదో ముఖ్య కారణం.

చదువుల రాణి ఈ తెలంగాణ కళ్యాణి

సౌదీలో ఇది ఏ మార్పులకు సంకేతం?

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు