సుజాత గిడ్ల: ‘గాంధీ హరిజనులకు శత్రువు’

గాంధీ పైన ఘాటైన వ్యాఖ్యలు చేశారు దళిత రచయిత సుజాత గిడ్ల. ''ఆలయ ప్రవేశాన్ని సమర్థించినంత మాత్రాన ఆయన్ను హరిజన బాంధవుడిగా భావించలేమని ఆయన వాస్తవానికి హరిజనులకు శత్రువు'' అని ఆమె బీబీసితో అన్నారు.
ఆయన కులవ్యవస్థను వ్యతిరేకించలేదు కదా అంటున్నారు. కులవృత్తులను సమర్థిస్తూ ఎక్కడి వారు అక్కడే, ఏ పనిచేసే వారు ఆ పనిలోనే ఉండాలని కోరుకున్న గాంధీని 'హరిజనబాంధవుడని' ఎలా చెప్తామని ఆమె ప్రశ్నిస్తున్నారు.
అలాగే, కులం పేరుతో రోజూ అవమానపరుస్తూ అదే నోటితో దేశాన్ని చూసి గర్వించు అంటే ఎలాగ అని ప్రశ్నిస్తున్నారు.
గ్రామీణ భారతాన కులం పాత్రను ఆమె తన రచన యాంట్స్ ఎమాంగ్ ఎలిఫెంట్స్(ఏనుగుల మధ్యలో చీమలు)లో లోతుగా విమర్శించారు.
''అందరికీ అందరూ తెలిసిన గ్రామసీమల్లో మిగిలిన కులాలకు వారి వారి సామాజిక హోదాను బట్టి స్థానం ఉంటుంది. కానీ దళితులకు మాత్రం చోటులేదు. వారి స్థానం గ్రామ పొలిమేరలకావలే. వారిని మిగిలిన వారితో కలవనివ్వరు. ఆలయాల్లోకి వెళ్లనివ్వరు. బావుల్లో నీటిని ఉపయోగించుకోనివ్వరు. మిగిలిన కులాలతో కలిసి తిననివ్వరు'' అని తాను పుట్టిపెరిగిన వాతావరణంలో తాను ఎదుర్కొన్న అనుభవాలను వివరించారు సుజాత గిడ్ల.
భారతదేశాన్ని చూసి మేము ఎందుకు గర్వపడాలి-రచయిత్రి సుజాత గిడ్ల
తన జీవితానుభవాలను సామాజికాంశాలతో అనుసంధానం చేస్తూ ఆమె రచించిన ఈ పుస్తకం అంతర్జాతీయ ప్రసార ప్రచార మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది.
బీబీసి న్యూస్ ఆమెను ఇంటర్య్వూ చేసింది. న్యూయార్క్ టైమ్స్ పత్రికలో పుస్తకంపై సమీక్ష వెలువడింది. ఇంకా అనేకానేక జాతీయ అంతర్జాతీయ మీడియా సంస్థల్లో ఆమె పుస్తకంపై కథనాలొచ్చాయి.
కాకినాడ దగ్గర్లోని ఎల్విన్ పేటలో పుట్టి పెరిగిన సుజాత ప్రముఖ నక్సలైట్ నాయకుడు పీపుల్స్ వార్ వ్యవస్థాపకుల్లో ఒకరైన కెజి సత్యమూర్తి మేనకోడలు.
స్వయంగా సామాజిక ఉద్యమాల్లొ పనిచేసిన వ్యక్తి. దళితురాలిగా చిన్నపుడు తాను ఎదుర్కొన్న అనుభవాలను ఆమె ఈ పుస్తకంలో వివరించారు.
చిన్నపుడు ఇతర కులాలవారు ఏదైనా ఇవ్వాలనుకున్నపుడు చేతిని ముట్టుకోకుండా పైనుంచి జారవిడిచేవారని, చివరికి దుకాణంలో ఏదైనా కొనుక్కున్నపుడు చిల్లర కూడా పైనుంచి వేసేవారని తన అనుభవాలను వివరించారు.
గ్రామ సీమల్లో కులం స్పృహ మరీ పసిప్రాయంలోనే తెలిసివస్తుందని తన అనుభవాలతో వివరించారు. రెండేళ్లపుడే తల్లితో కలిసి వెళ్లిన చోట జరిగిన ఒక ఘటన సామాజిక అంతరాల గురించి తనకు ఎరుక కలిగించిందని ఆమె బీబీసికి వివరించారు.
నక్సలైట్ నాయకుడిగా ప్రముఖ విప్లవ కవిగా శివసాగర్ అలియాస్ కెజి సత్యమూర్తి పాత్ర గురించి తనపై ఆయన ప్రభావం గురించి ఆమె ఈ పుస్తకంలో వివరించారు.
మరో ప్రపంచం పిలిచింది మరో ప్రపంచం పిలిచింది అనే శ్రీ శ్రీ విప్లవ గీతాన్ని చిన్నపుడు మామయ్య ద్వారా వినేదాన్ని అని చెపుతూ సామాజిక ఆర్థిక అంతరాలు లేని ఆ మరో ప్రపంచం ఎక్కడ, ఎంత దూరం అని సుజాత ప్రశ్నిస్తున్నారు.
పుట్టుక ద్వారా సంక్రమించే ఏ ఆధిపత్యాన్ని అయినా సవాల్ చేయకుండా సమానత్వాన్ని, నిజమైన ప్రజాస్వామిక సమాజాన్ని సాధించగలమా అని ఫ్రశ్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- మహాత్మా గాంధీని ఎందుకు హత్య చేశారు?
- మహాత్మా గాంధీ చివరి రోజు ఎలా గడిచిందంటే..
- ఇది ‘గాంధీ దేవాలయం’.. దశాబ్దాలుగా దీపారాధన
- ఎంఎస్ ధోని: ‘నా దారి.. గాంధీ దారి’
- EXCLUSIVE: అంబేడ్కర్ వీడియో ఇంటర్వ్యూ
- స్ఫూర్తి ప్రదాతల కోసం దళితుల వెదుకులాట
- భీమా-కోరెగాంలో దళితులు విజయోత్సవం ఎందుకు జరుపుకుంటారు?
- ‘జిగ్నేష్ లాంటి నాయకులతో హిందుత్వ రాజకీయాలకు ప్రమాదమా?’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)