జీఎస్‌టీలో మార్పుల మతలబు?

  • 7 అక్టోబర్ 2017
అరుణ్ జైట్లీ, జీఎస్‌టీ Image copyright Reuters

భారతదేశ పన్నుల వ్యవస్థలో కీలకమైన మార్పుగా చెప్పుకుంటున్న జీఎస్‌టీ ఆదివారంతో వందరోజులు పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో పలు వర్గాల నుంచి వచ్చిన నిరసనల వల్ల కేంద్రప్రభుత్వం పన్ను రేట్లలో పలు మార్పులు చేసింది.

శుక్రవారం కౌన్సిల్ సమావేశం తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ జీఎస్‌టీ రేట్లలో చేసిన మార్పుల వివరాలు తెలిపారు.

ఈ మార్పుల ప్రభావం ఎలా ఉండబోతోంది, మార్పులు ఎక్కడ జరిగాయి అనే అంశాలపై బీబీసీ ప్రతినిధి ఆదర్శ్ రాథోడ్ ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఎమ్‌కే వేణుతో మాట్లాడారు.

ఆయన అభిప్రాయం ప్రకారం - జీఎస్‌టీలో తాజా మార్పుల వల్ల చిన్న పరిశ్రమలకు లాభం కలగబోతోంది.

తక్కువ టర్నోవర్ ఉండే చిన్న పరిశ్రమలకు గతంలో నెలకు మూడుసార్లు అంటే ఏడాదికి 36-37 సార్లు రిటర్న్‌లు ఫైల్ చేయాల్సి వచ్చేది. చిన్న పరిశ్రమలకు ఇది భారంగా ఉండేది. జీఎస్‌టీ సిస్టం కూడా చాలా నెమ్మదిగా ఉండి త్వరగా లోడ్ కావడం లేదనేది వారి ఆరోపణ.

Image copyright iStock

తాజాగా, ఏడాదికి కోటిన్నర రూపాయల వరకూ టర్నోవర్ ఉన్న పరిశ్రమలకు నెల నెలా రిటర్న్ ఫైలింగ్ నుంచి ఉపశమనం కలిగేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు వారు మూడు నెలలకోసారి రిటర్న్ ఫైల్ చేస్తే చాలు.

పన్నులు చెల్లిస్తున్న దాదాపు 90 శాతం పరిశ్రమలు ఈ కోవలోకే వస్తాయి. తాజా పరిణామాలతో చిన్న పరిశ్రమలకు ఉపశమనం కలిగినా, జీఎస్‌టీ సిస్టంపై మాత్రం భారం పడుతుందని అంటున్నారు.

Image copyright Getty Images

మినీ బడ్జెట్ !

దాదాపు 1,200 వస్తువులలో ఎన్నో వాటిపై 28 శాతం వరకూ జీఎస్‌టీ ఉండేది.

దీనిని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రపంచంలో ఇంత జీఎస్‌టీ ఎక్కడా లేదని ఆరోపించాయి. జీఎస్‌టీ రాకతో ద్రవ్యోల్బణం కూడా పెరిగింది.

ఈ నిరసనల ప్రభావంతో పలు వస్తువులపై జీఎస్‌టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. అప్పడాలు వంటివాటిపై జీఎస్‌టీని 12 శాతం నుండి 5 శాతానికి తగ్గించారు.

పన్ను రేట్ల సవరణను చూస్తే, ఇది మినీ బడ్జెట్‌ను తలపిస్తోందని ఎమ్‌కే వేణు అభిప్రాయపడ్డారు.

జీఎస్‌టీని సమర్థంగా అమలుపరుస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా.. సాఫ్ట్‌వేర్ సమస్య పూర్తిస్థాయిలో తీరాలంటే మరికొన్ని నెలలు పట్టవచ్చని తెలుస్తోంది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు