ఫుట్‌బాల్ జ్ఞాపకాలు: లక్ష మంది ప్రేక్షకులపై విజయం

  • రెహాన్ ఫజల్
  • బీబీసీ ప్రతినిధి
ఫుట్‌బాల్‌, ఆసియా గేమ్స్

ప్రస్తుత ఫిఫా ప్రపంచకప్‌‌లో భారత జట్టు లేదు. కానీ ఫుట్‌బాల్‌లో భారత్ గతకీర్తి ఎంతో ఘనం.

1962లో ఇండోనేసియాలో జరిగిన ఆసియా గేమ్స్‌లో భారత్ అద్భుతమైన ఆటతీరుతో స్వర్ణపతకాన్ని గెలుచుకుంది.

అది సెప్టెంబర్ 4, 1962. జకార్తా ఆర్మీ స్టేడియం. ఆసియా గేమ్స్‌లో భారత్-దక్షిణ కొరియా మధ్య ఫుట్‌బాల్‌ ఫైనల్ మ్యాచ్.

స్టేడియంలో సుమారు లక్ష మందికి పైగా ప్రేక్షకులున్నారు. వారంతా భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

ఇతర క్రీడాంశాలలో పాల్గొన్న మిగతా భారత క్రీడాకారులంతా అప్పటికే స్వదేశం తిరిగి వచ్చేశారు.

ఫైనల్స్‌కు రావడానికి భారత్‌ చాలా కష్టాలే పడింది. మొదటి లీగ్ మ్యాచ్‌లోనే దక్షిణకొరియా చేతిలో 0-2 తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత జపాన్‌పై 2-0 తేడాతో, థాయ్‌ల్యాండ్‌పై 4-1 తేడాతో విజయం సాధించింది.

భారత్‌కు చెందిన అత్యుత్తమ డిఫెండర్ జర్నైల్ సింగ్ థాయ్‌ల్యాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తీవ్రంగా గాయపడ్డాడు. అతని నుదుటిపై పది కుట్లు పడడంతో దక్షిణ కొరియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ మొదట పది మంది ఆటగాళ్లతోనే బరిలోకి దిగింది. అప్పట్లో సబ్‌స్టిట్యూట్‌ నిబంధన అమలులో లేదు.

మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి చునీ గోస్వామి, పీకే బెనర్జీ, జర్నైల్ సింగ్ ,బలరాం, ఫ్రాంకో, త్రిలోక్ సింగ్ అలా నడుద్దామని బయటికి వచ్చారు.

అంత రాత్రి వేళ వారికి కోచ్ రహీం కనిపించాడు. ఆయన చాలా ఆందోళనగా ఉన్నారు.

''రేపు నాకు మీ నుంచి ఒక మంచి బహుమతి కావాలి. రేపు మీరు కప్పును గెలవాలి'' అన్నారాయన.

తమ కోచ్ అంత ఆందోళనగా కనిపించడం అదే మొదటిసారని బెనర్జీ తెలిపారు.

‘జనగణమన’ శక్తి

ఆ క్రీడల్లో పాల్గొనేందుకు ఇజ్రాయెల్‌ను, తైవాన్‌ను ఆహ్వానించలేదు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీలోని భారత ప్రతినిధి గురుదత్త సోధీ ఈ రెండు దేశాలను ఆహ్వానించలేదని ఇండోనేషియాను విమర్శించారు.

క్రీడల్లో రాజకీయాలకు తావు లేదని స్పష్టం చేశారు. అందువల్ల స్టేడియంలోని ప్రేక్షకులంతా భారత్‌ పట్ల ఆగ్రహంతో ఉన్నారు.

స్టేడియానికి వచ్చేప్పుడే సెమీఫైనల్స్‌లో ఇండోనేసియా ఓటమికి కారణమైన జర్నైల్ సింగ్‌పై దాడి జరగకుండా ఉండేందుకు అతణ్ని బస్‌లో కనిపించకుండా దాచి స్టేడియానికి తీసుకువచ్చారు.

ఆటగాళ్లలో ఉత్సాహం నింపడానికి కోచ్ రహీం మ్యాచ్ ప్రారంభానికి ముందు వాళ్లతో 'జనగణమన' పాడించారు. తిరిగి హాఫ్ టైమ్‌లో కూడా ఆటగాళ్లంతా 'జనగణమన' పాడారు.

ఫొటో క్యాప్షన్,

జకార్తా హీరో జర్నైల్ సింగ్

భారత్‌కు పాకిస్తాన్ హాకీ టీం మద్దతు

ఆట ప్రారంభమైంది. భారత్ ఆటగాళ్లకు బాల్ దొరకగానే స్టేడియం మొత్తం వారిని గేలిచేస్తూ కేకలు పెట్టేది. బాల్ భారత్ వైపుకు రాగానే రెఫరీ విజిల్ కూడా వినిపించనంత గట్టిగా హోరెత్తేది. అదే భారత ప్లేయర్లు కొరియా గోల్ పోస్ట్‌పై దాడి చేయగానే నిశబ్దంగా మారిపోయేది.

ఈ మ్యాచ్‌లో భారత్‌కు ఊహించని వైపు నుంచి మద్దతు లభించింది. స్టేడియం మొత్తం భారత్‌ ఓడిపోవాలని నినాదాలు చేస్తుండగా.. పాకిస్తాన్ హాకీ టీం సభ్యులు భారత్‌కు అనుకూలంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. అంతకు ముందు రోజే వాళ్లు భారత హకీ టీంను ఫైనల్స్‌లో 2-0 తేడాతో ఓడించారు.

కొరియా ఆటగాళ్ల ఎత్తును దృష్టిలో పెట్టుకున్న కోచ్ రహీం వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అప్పటికి ఒక గోల్ కీపర్ పీటర్ తంగరాజ్‌ గాయపడి ఉన్నాడు. అయితే కొరియన్ల ఎత్తు దృష్ట్యా రహీం, బర్మన్ స్థానంలో తిరిగి తంగరాజ్‌నే గ్రౌండ్‌లోకి పంపారు.

మరోవైపు రైట్ బ్యాక్ త్రిలోక్ సింగ్ కాలి చిటికెన వేలి గోరు విరగడంతో అతను బాధతో అల్లాడిపోతున్నాడు.

భారత్ ఈ మ్యాచ్‌లో 3-3-4 వ్యూహాన్ని అనుసరించగా, దక్షిణ కొరియా తన సంప్రదాయ 3-2-5 వ్యూహాన్నే అనుసరించింది. మ్యాచ్ 17వ నిమిషంలో పీకే బెనర్జీ యాంగిల్ షాట్‌తో భారత్‌కు 1-0 ఆధిక్యత సంపాదించి పెట్టాడు. మూడు నిమిషాల అనంతరం జర్నైల్ సింగ్ భారత్ ఆధిక్యాన్ని 2-0కు తీసుకెళ్లాడు.

రెండో అర్ధభాగంలో కొరియా ఒక గోల్ కొట్టింది. చివరి పది నిమిషాల్లో భారత్ గోల్ పోస్టుపై పదేపదే దాడి చేసి స్కోర్‌ను సమానం చేయడానికి ప్రయత్నించినా, భారత డిఫెండర్లు సమర్థంగా అడ్డుకున్నారు.

మ్యాచ్ ముగియగానే జర్నైల్ సింగ్ తలకు కట్టిన బ్యాండేజ్ మొత్తం రక్తంతో తడిసిపోయి, నేలపై పడిపోయాడు. అయినా అతను మైదానం వీడి పోలేదు.

మ్యాచ్ అనంతరం పాకిస్తానీ హాకీ ప్లేయర్లు మైదానంలోకి వచ్చి భారత ఆటగాళ్లను భుజాలపైకి ఎక్కించుకున్నారు.

ఫొటో క్యాప్షన్,

భారత టీం కోచ్ రహీం

‘బ్రెజిల్ ఆఫ్ ఏసియా

1951 తర్వాత భారత ఫుట్‌బాల్ టీం ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించడం అదే మొదటిసారి. నాటి నుంచి ఈనాటి వరకు అలాంటి టీం లేదని చెప్పవచ్చు. అందుకే ఆనాడు భారత్‌ను 'బ్రెజిల్ ఆఫ్ ఏషియా' అని పిలిచేవారు.

భారత్ ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకాన్ని గెలిచిన తొమ్మిది నెలల తర్వాత కోచ్ రహీం కన్నుమూశారు. చైన్ స్మోకర్ అయిన రహీం లంగ్ క్యాన్సర్ కారణంగా మృతి చెందారు.

ఆయన మృతిపై ఒక ఫుట్‌బాల్ విమర్శకుడు, ''రహీంతో పాటు భారత పుట్‌బాల్ కూడా మరణించింది'' అని వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)