కశ్మీరీ ‘అత్యాచార’ బాధితుల న్యాయపోరాటం

  • 8 అక్టోబర్ 2017
న్యాయం కోసం 26ఏళ్లుగా
చిత్రం శీర్షిక ఆ రోజు ఏం జరిగిందో మా రిపోర్టర్‌కు చెప్తున్న బాధిత మహిళ (కుడివైపు)

26 ఏళ్ల కిందట కశ్మీర్‌లోని కునాన్, పొష్పోరా గ్రామాలకు చెందిన 30మంది మహిళలపై భారత జవాన్లు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. నాటి బాధితులు ఇంకా న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. దీనిపై బీబీసీ ఉర్దూ రిపోర్టర్ ఆలియా నాజ్కీ అందిస్తున్న కథనం.

అది 1991 ఫిబ్రవరి 23. భారత పాలిత కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా కునాన్ గ్రామం. ఆ చల్లటి శీతాకాలం రాత్రి ఎప్పటిలాగే తమ పనులు ముగించుకొని ఊరివాళ్లంతా ఇంటిముఖం పడుతున్నారు.

కశ్మీర్‌లో దేశానికి వ్యతిరేకంగా చెలరేగుతున్న సాయుధ తిరుగుబాటును అణిచివేసే ప్రక్రియ అప్పటికే మొదలైంది. ఆ సమయంలో ఓ సైనిక చర్య మొదలైంది. ఇందులో భాగంగా సైన్యం ఆ ప్రాంతంలో దిగ్బంధ తనిఖీలు చేపట్టింది. స్థానికులు దీన్ని అణిచివేత చర్యగా పిలిచేవారు. ఇప్పటికీ ఇలాంటి దిగ్బంధ తనిఖీలు అక్కడ సర్వసాధారణం.

ఓ ప్రాంతాన్ని పూర్తిగా దిగ్బంధించి సోదాలు నిర్వహించే అధికారం భారత భద్రతాధికారులకు 1990లో సంక్రమించింది. ఇందులో భాగంగా జవాన్లు తాము ఎంచుకున్న ప్రాంతంలో తనిఖీలు నిర్వహించేవారు. ఇళ్లలోకి వెళ్లి మగాళ్లందరినీ తీసుకొచ్చి ఒక దగ్గర నిలబెట్టేవారు. అందులో ఎవరైనా తీవ్రవాదులు, వారి సానుభూతిపరులు ఉన్నారో తెలుసుకునేందుకు వాళ్లందరితో ఇన్ఫార్మర్ ముందు కవాతు చేయించేవారు. అలాంటి వారెవరైనా పట్టుబడితే వాళ్లను వెంట తీసుకెళ్లేవారు.

ఆ రోజు రాత్రి జూనీ, జరీనాలు (పేర్లు మార్చాం) తమ ఇంటి ముందే జవాన్లను చూశారు. అయితే ఎప్పటిలాగా జరిగే అణిచివేత చర్యగానే దాన్ని భావించారు. ఇంట్లోని మగాళ్లందరినీ బయటకు తీసుకెళ్లారు. జవాన్లు ఇంట్లోకి వచ్చి ఎప్పటి లాగే తనిఖీలు నిర్వహించారు. అయితే ఆ రోజు గుర్తు చేసుకుంటే మాత్రం ఇప్పటికీ వాళ్ల కళ్లు కన్నీళ్లతో నిండిపోతాయి.

చిత్రం శీర్షిక ఈ ప్రాంతంలో ఆర్మీ దిగ్బంధ తనిఖీలు చేసింది

"జవాన్లు వచ్చే సమయానికి మేం పడుకోడానికి సిద్ధమవుతున్నాం. వాళ్లు మా మగాళ్లను బయటకు తీసుకెళ్లారు. కొందరు మద్యం తాగడం మొదలు పెట్టారు. వాళ్లు నన్ను లాక్కోడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నేను రెండేళ్ల నా కూతరును గట్టిగా పట్టుకున్నా. వాళ్లను ప్రతిఘటిస్తున్నప్పుడు పెనుగులాటలో చేతిల్లోంచి జారి నా బిడ్డ కిటికీ బయట పడిపోయింది. ఇప్పుడామె జీవితమే అవిటిదైపోయింది."

"ఐదుగురు జవాన్లు ఉన్నారు. అందులో ముగ్గురు నన్ను లాగారు. నా బట్టలు చించేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పటికీ నాకు తెలియదు. ఇప్పటికీ వాళ్లను నేను గుర్తుపట్టగలను."

అప్పుడు జరీనా కూడా అదే ఇంట్లో ఉంది. ఆనాటికి ఆమెకు పెళ్లై కేవలం 11 రోజులే అయింది.

"అంతకు ముందు రోజే నేను పుట్టింటి నుంచి వచ్చాను."

"కొక్కానికి తగిలించిన కొత్త బట్టల గురించి కొందరు జవాన్లు మా అత్తమ్మను అడిగారు. నేను నవ వధువునని, కొత్తగా వాళ్లింటికి వచ్చానని ఆమె వారితో చెప్పింది."

"ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పలేను. మాకు జరిగిన అన్యాయం ఎవరూ పూడ్చలేనిది. ఇప్పటికీ ఎవరైనా జవాన్లను చూస్తే భయంతో వణికిపోతాం."

కునాన్, పొష్పోరా మహిళలపై జవాన్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని అక్కడి స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు మహిళలపై అఘాయిత్యానికి పాల్పడుతున్నప్పుడే అక్కడి మగాళ్లను దారుణంగా హింసించారని అన్నారు. అందువల్లే ఆ ఘటనపై 26 ఏళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నట్లు చెప్పారు.

ఈ ఆరోపణలపై కశ్మీర్ మంత్రి నకీమ్ అఖ్తర్ శ్రీనగర్‌లో బీబీసీ ప్రతినిధితో మాట్లాడుతూ, "కశ్మీర్‌లో వాస్తవాలు తరచూ దుమ్ముకొట్టుకపోయి మరుగునపడిపోతుంటాయి" అని వ్యాఖ్యానించారు.

అయితే ఇప్పుడు ఓ కశ్మీరీ యువ మహిళా బృందం ఆ దుమ్ము దులిపేసే పనిలో ఉన్నట్లు కనిపిస్తోంది.

ఈ కేసును తిరిగి ప్రారంభించాలని 2013లో వాళ్లు హైకోర్టులో పిటిషన్ వేశారు.

చిత్రం శీర్షిక ఈ కేసుపై నటాషా రాథర్ పుస్తకం రాశారు

ఆ బృందంలో యువ పరిశోధకురాలు నటాషా రాథర్ ఒకరు. ఆమె బాధితుల పేరును కూడా పిటిషన్‌లో చేర్చారు.

ఈ ఘటనపై నటాషా, మరో నలుగురు కలసి రాసిన 'డూ యూ రిమెంబర్ కునాన్, పొష్పోరా? (కునన్, పొష్పొరా గురించి మీకు తెలుసా?) అనే పుస్తకానికి అవార్డు కూడా వచ్చింది.

నటాషా ఈ కేసుపై మాట్లాడుతూ, "సామూహిక అత్యాచారం చాలా పెద్ద ఘటన. బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పేందుకు ఇప్పుడు ధైర్యంగా ముందుకొస్తున్నారు. నాటి ఘటనకు సంబంధించి చాలా సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ కేసును తిరిగి ప్రారంభించాలని మేం భావిస్తున్నాం" అని చెప్పారు.

ఎట్టకేలకు కేసు పున:ప్రారంభించారు. బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని జమ్ముకశ్మీర్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రాథమికంగా హైకోర్టు ఆదేశాన్ని అంగీకరించింది. కానీ, తర్వాత ఎందుకో తన నిర్ణయాన్ని మార్చుకుంది. హైకోర్టు తీర్పుపై సవాలు చేస్తూ భారత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇంకా ఆ కేసు సుప్రీం కోర్టులోనే ఉంది.

అయితే, తమపై వచ్చిన ఆరోపణలను భారత్ సైన్యం ఖండిస్తూనే ఉంది.

ఈ ఆరోపణలపై మూడు సార్లు స్వతంత్ర్యంగా దర్యాప్తు చేయించామని, పరస్పర విరుద్ధ ప్రకటనలు వెలువడటంతో కేసును మూసివేసామని ఆర్మీ అధికార ప్రతినిధి బీబీసీకి తెలిపారు.

చిత్రం శీర్షిక కోర్టులో ఇది రుజువు కావాలి-నయీమా అహ్మద్

రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నయీమా అహ్మద్ మజూర్ ఈ విషయంపై మాట్లాడుతూ, "కునాన్, పొష్పోరా ప్రజలు హింసకు గురయ్యారు. కోర్టులో ఇది రుజువు కావాల్సిందే" అని చెప్పుకొచ్చారు. అయితే న్యాయ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని మాత్రం నొక్కి చెప్పారు.

ఆ చల్లటి శీతాకాల రాత్రి కునాన్, పొష్పోరా గ్రామాలలో నిజంగా ఏం జరిగిందో బహుశా మనం ఎప్పటికీ కనుక్కోలేకపోవచ్చు.

అయితే, నవతరం మాత్రం ముందుకొస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా అక్కడి ప్రజలు, వారి నివాసాలు మారుతున్నాయి. అయితే ఇప్పటికీ కొన్ని చేదు జ్ఞాపకాలు వారిని వెంటాడుతూనే ఉన్నాయి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం