బీబీసీ 100 మంది మహిళలు: మెదడును మీ దారికి తెచ్చుకోండి

గ్రాఫిక్

ఫొటో సోర్స్, sorbetto/Getty

ఫొటో క్యాప్షన్,

మన గురించి మనం సానుకూలంగా ఆలోచించుకోగలిగితే ప్రేరణ, సంతోషానికి కారణమయ్యే మెదడు భాగాలు ఉద్దీపన చెందుతాయని డాక్టర్ స్టేసీ గ్రాస్‌మన్ బ్లూమ్ అంటారు

తమకు ఆత్మవిశ్వాసం తక్కువని, ఎందులోనూ రాణించలేకపోతున్నామని చాలామంది మహిళలు భావిస్తుంటారు, కానీ, ఏం చేస్తే ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుందనేది అందరూ తెలుసుకోలేకపోతున్నారు.

మహిళలు తమ సామర్థ్యాలకు పదును పెట్టుకున్నప్పుడు.. విలువలను, ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నప్పుడే నలుగురిలో తమ స్వరం వినిపిస్తుంది, నాయకత్వం దక్కుతుంది.

మనలోని ప్రతికూల భావనలను తొలగిస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు న్యూరోసైన్స్‌ ఉపయోగపడుతుంది. మెదడులోని కీలక ప్రాంతాలను మనకు కావాల్సిన పనిలో నిమగ్నం చేయడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఇందుదుకు కొంత అభ్యాసం అవసరం.

స్టేసీ గ్రాస్‌మన్ బ్లూమ్ న్యూయార్క్ విశ్వవిద్యాలయానికి చెందిన లేంగ్‌ఆన్ మెడికల్ సెంటర్‌లో న్యూరోసైంటిస్ట్. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో న్యూరోసైన్స్ పాత్రేమిటన్న విషయంపై ఆమె సునిశిత అధ్యయనం చేశారు. చాలామంది మహిళలకు అవసరమైన ఈ అంశంపై ఆమె తన అనుభవాలను పంచుకున్నారు.

సానుకూల దృక్పథంతో ఆలోచించండి

ఆత్మవిశ్వాసం కూడా మిగతా అన్ని వ్యక్తిత్వ స్వభావాల వంటిదే. ఇది మెదడుకు సంబంధించిన అంశం. మన మెదడులో అత్యధిక భాగం పుట్టుకతో కొన్ని లక్షణాలను కలిగి ఉంటుంది. జన్యుపరమైన, ఇతర కారణాల వల్ల ముందే అవన్నీ నిర్ణయమైపోతాయి. ఆ తరువాత జీవితంలో మన అనుభవాలు, చేసే పనులు, ఎంచుకునే మార్గాలు వ్యక్తిత్వానికి ఒక రూపునిస్తాయి.

మెదడులోని కణాలు, నాడీవ్యవస్థ మధ్య ఉండే క్లిష్టమైన, సున్నితమైన సంబంధాలను మనకు అనుగుణంగా మలచుకుంటూ సామర్థ్యాలను, జ్ఞానాన్ని పెంచుకుంటుంటాం. ఇదంతా సాధనతోనే జరుగుతుంది. మనలోని ప్రతికూల భావనలను తొలగిస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు న్యూరోసైన్స్‌ కూడా ఉపయోగపడుతుంది. మెదడులోని కీలక ప్రాంతాలను మనకు కావాల్సిన పనిలో నిమగ్నం చేయడం ద్వారా ఇది సాధ్యమవుతుంది.

ఫొటో సోర్స్, Dr. Stacie G Bloom

ఫొటో క్యాప్షన్,

తన ముగ్గురు కుమార్తెలతో డాక్టర్ బ్లూమ్

మన గురించి మనం సానుకూలంగా ఆలోచించినప్పడు ప్రేరణ, సంతోషం కలిగించే మెదడు భాగాలను ఉద్దీపన చేయొచ్చు. మనం ఆత్మవిశ్వాసంతో ఉన్న సందర్భాల్లో, తలెత్తుకుని తిరిగేటప్పుడు మనసు మంచి అనుభూతిని పొందుతుంది. ప్రతి ఒక్కరికీ ఇది ఏదో ఒక సందర్భంలో అనుభవంలోకి వచ్చే విషయమే. అదే ఈ ఉద్దీపన ప్రభావం.

అలాంటి అనుభూతికి లోనైనప్పుడు మనలో కనిపించే ఆత్మవిశ్వాసం చుట్టూ ఉన్నవారిని ఆకర్షిస్తుంది. వారు మీతో సులభంగా కలిసిపోవడానికి ఇది తోడ్పడుతుంది. మీలోని ఆత్మవిశ్వాసానికి ప్రతిఫలంగా చుట్టూ ఉన్నవారి నుంచి వచ్చే ఈ సానుకూల స్పందన మెదడుకు చేరి మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది.

ఆత్మవిశ్వాసం పెంచుకునే క్రమంలో మీరు చేయాల్సిన మొట్టమొదటి పని నిత్యం మీ మెదడును తొలిచేసే సమస్యలను, అవాంతరాలను అధిగమించేందుకు సిద్ధమవడమే. అక్కడి నుంచే మీ ఆత్మవిశ్వాసం పెరగడం మొదలవుతుంది.

ఫొటో సోర్స్, Dr. Gyorgy Buzsaki, NYU Neuroscience Institute

ఫొటో క్యాప్షన్,

వందల కోట్ల నాడుల సమాహారం ఇది. ఇక్కడ పసుపు రంగులో ఉన్నవి మెదడును మనం ఆత్మవిశ్వాసం దిశగా ఉద్దీపన చెందిస్తున్నప్పుడు సర్దుబాటు అవుతున్నవి

శిక్షణతోనే మస్తిష్క వికాసం

కొత్త విషయాలను, నైపుణ్యాలను నేర్చుకోవడం ఒక్క రోజులో సాధ్యమవుతుందా? కాదు. అందుకు సమయం పడుతుంది. ఇలా నేర్చుకుంటున్నంత కాలం మెదడు మన కొత్త నైపుణ్యాలను, కొత్త జ్ఞానాన్ని తనలో నిక్షిప్తం చేసుకోవడానికి తనలోతాను సర్దుబాటు చేసుకుంటుంది.

ఆత్మవిశ్వాసం పెంచుకోవడమూ అంతే. పెంచుకోవాలని మనం నిర్ణయించుకోవడమే తరువాయి, ఆ దిశగా మెదడుకు శిక్షణ ఇవ్వాలి, మన దారికి తెచ్చుకోవాలి.

శాస్త్రీయ కోణంలో చూస్తే.. మగవాళ్లతో పోల్చుకుంటే మహిళల్లో హార్మోన్ల విడుదల భిన్నంగా ఉంటుంది. సాధారణంగా సంఘర్షణలకు తావివ్వని, ఇతరులను సంతోషపెట్టాలనుకునే, అందరి ఆమోదం ఉండాలనుకునే మనస్తత్వం మహిళలది.

ఒత్తిడికి లోనయ్యే సందర్భాల్లోనూ వారి స్పందన మగవారి కంటే భిన్నంగా ఉంటుంది. మగవారు రిస్క్ తీసుకోవడానికి సాహసిస్తారు, అందుకు భిన్నంగా మహిళలు, చేపట్టే పని కచ్చితంగా విజయవంతం కావాలని కోరుకుంటారు. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు.

జన్యుపరమైన తేడాలే కాకుండా సామాజికంగా సృష్టించుకున్న తేడాలూ మహిళలపై ప్రభావం చూపుతున్నాయి.

బీబీసీ '100 మంది మహిళలు':

ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100 మంది స్ఫూర్తిప్రదాతలైన, ప్రభావవంతులైన మహిళల జాబితాను బీబీసీ ప్రతి ఏటా ప్రకటిస్తుంది.

కనిపించని అడ్డుగోడలు, నిరక్షరాస్యత, వీధుల్లో వేధింపులు, క్రీడల్లో లింగవివక్ష అనే నాలుగు అతిపెద్ద సవాళ్ల పరిష్కారానికి ఈ సిరీస్ ప్రయత్నిస్తోంది. వీటిని ఎదుర్కొనేందుకు ఈ ఏడాది జాబితాలోని మహిళామణులు సరికొత్త మార్గాలను అన్వేషించేందుకు ప్రయత్నించనున్నారు.

ఫొటో క్యాప్షన్,

100 మంది మహిళల లోగో

2017 సిరీస్ జాబితాలో భారత్‌లో జన్మించినవారు పది మంది ఉండగా, వీరిలో ఒకరు 16 ఏళ్ల బాలిక కావడం విశేషం. ప్రముఖ క్రికెటర్ మిథాలీ రాజ్, దిల్లీ తీహార్ జైల్లో ఎనిమిదేళ్లుగా పిల్లలకు పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయురాలు, సామాజిక కార్యకర్త తూలికా కిరణ్ కూడా వీరిలో ఉన్నారు.

ఈ 100 మంది మహిళల్లో కొందరు అక్టోబరులో నాలుగు వేర్వేరు నగరాల్లో సమావేశమై.. ఈ నాలుగు ప్రధాన సమస్యలకు సరికొత్త పరిష్కారాలపై చర్చిస్తారు. మహిళ్లో నిరక్షరాస్యతపై దిల్లీలో, కనిపించని అడ్డుగోడలనే అంశంపై అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో, వీధుల్లో వేధింపులపై బ్రిటన్‌లోని లండన్‌లో, క్రీడల్లో లింగవివక్షపై బ్రెజిల్‌లోని రియోడిజనీరోలో సమావేశాలు, చర్చలు, ఇతర కార్యక్రమాలు ఉంటాయి.

మీరు కూడా మీ సలహాలు, సూచనలూ ఇవ్వొచ్చు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో బీబీసీ న్యూస్ తెలుగును సంప్రదించండి. #100Women హ్యాష్ ట్యాగ్ వాడండి.

తేడా అక్కడ నుంచే మొదలవుతుంది

పిల్లల వయసు పెరుగుతున్నకొద్దీ ఈ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ యువతులు ఆత్మవిశ్వాసంతో కనిపిస్తూ, మగవాళ్లతో సమానంగా అన్ని రంగాల్లో చురుగ్గా ఉంటే లేనిపోని విమర్శలు ఎదురవుతుంటాయి. సమాజం నుంచి ఎదురయ్యే ఇలాంటివన్నీ వారిలోని ఆత్మవిశ్వాసానికి అవరోధాలవుతున్నాయి.

ఫొటో సోర్స్, Dr Paul Glimcher and Ifat Levy

ఫొటో క్యాప్షన్,

ఈ చిత్రాల్లో నారింజ రంగులో కనిస్తున్న మెదడు భాగాలు ఉద్దీపన చెందినవి

ఊహలే బలం

ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలను ఎంత ముమ్మరం చేస్తే అంత తొందరగా ఫలితం కనిపిస్తుంది. ఈ క్రమంలో మనం చేయాల్సిన పనులు కొన్నుంటాయి. మనకు అనుకూలంగా ఉండే పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసంతో ఉంటాం. కాబట్టి మొదట పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చుకోవాలి. మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే వ్యక్తులకు, పరిస్థితులకు వీలైనంత దూరంగా ఉండాలి.

కొన్ని ఊహలతోనూ మన మెదడుకు ప్రేరణ కలిగించవచ్చు. ఒక రేసులో గెలిచినట్లు, పబ్లిక్ మీటింగులో మాట్లాడినప్పుడు జనం నిలబడి ఆపకుండా చప్పట్లు కొట్టినట్లు, చేసే పనిలో మీకు తిరుగేలేనట్లు.. ఇలా చాలాచాలా సాధించినట్లు ఊహించుకోవడం వల్ల కూడా ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. ఏదైనా చేయగలమని మనకు మనం ధైర్యం చెప్పుకోవడం వల్ల ఫలితం ఉంటుంది.

ఇలాంటి ఎక్సర్‌సైజ్‌ల వల్ల ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు ఒత్తిడి, కుంగుబాటు, నిస్తేజం వంటివన్నీ తగ్గుతాయి. ఇది మానసికంగా, శారీరకంగా మనం ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)