ఆరుగురు దళితులను పూజారులుగా నియమించిన ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు

  • 8 అక్టోబర్ 2017
ఆలయం Image copyright PUNDALIK PAI

పరస్పర వైరుద్ధ్యాలకు భారత్ నెలవు అనేందుకు ఇదో నిదర్శనం. ఇటీవల పశ్చిమాన ఉన్న గుజరాత్‌లో మీసం పెంచుకున్నందుకు ఒక దళితుడిపై దాడి జరగ్గా, దక్షిణాన ఉన్న కేరళ‌లో ఆరుగురు దళితులు పూజారులుగా నియమితులయ్యారు.

కేరళలో ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు పరిధిలో 1,504 ఆలయాలు ఉన్నాయి. వీటిలో పూజారుల నియామకంలో ప్రభుత్వ రిజర్వేషన్ విధానాన్ని అనుసరించాలనే చరిత్రాత్మక నిర్ణయాన్ని బోర్డు తీసుకొంది.

పూజారుల నియామకాల్లోనూ రిజర్వేషన్ విధానాన్ని పాటించాలన్న కేరళ దేవస్థానాలు, పర్యాటక శాఖల మంత్రి కాడంపల్లి సురేంద్రన్ నిర్దేశానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకొంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక పద్మనాభ స్వామి ఆలయం

నియామక ప్రక్రియలో భాగంగా అభ్యర్థులకు బోర్డు రాతపరీక్ష, మౌఖిక పరీక్ష నిర్వహించింది. వెనకబడిన తరగతులకు చెందిన 36 మంది, దళితులు ఆరుగురు తుది జాబితాలో చోటు సంపాదించారు.

పూజారులుగా దళితుల నియామకంపై వ్యతిరేకత వస్తుందని దేవస్థానం బోర్డు భావిస్తోంది. అయితే తమ నిర్ణయాన్ని అంగీకరించేలా భక్తుల్లో ఏకాభిప్రాయం సాధించగలమనే నమ్మకం బోర్డులో ఉంది.

‘పూజారి కాదు, పూ ముఖ్యం’

ఈ అంశంపై ట్రావెన్‌కోర్ దేవస్థానాల బోర్డు అధ్యక్షుడు ప్రాయార్ గోపాలకృష్ణన్ బీబీసీ హిందీతో మాట్లాడుతూ- "నేడు హిందూ మతంలో పూజారి ఎవరనేదాని కన్నా పూజించడం ముఖ్యం. పూజారి బ్రాహ్మణుడా, నాయర్ కులస్థుడా అనేది ప్రధానం కాదు, పూజించడమే ప్రధానం" అన్నారు.

Image copyright Getty Images

బ్రాహ్మణుల్లో దాదాపు 40 శాఖలు, నాయర్లలో 9-10 శాఖలు ఉన్నాయని ఆయన చెప్పారు. తమ విధానం అమలయ్యేలా వివిధ కులాలకు చెందిన ఆయా వర్గాల మధ్య సమన్వయం సాధిస్తామని, ఇది తమకెంతో సంతోషాన్ని కలిగిస్తుందని తెలిపారు.

పూజారులుగా దళితుల నియామకంపై తప్పక వ్యతిరేకత వస్తుందని గోపాలకృష్ణన్ చెప్పారు. అయితే కులాల మధ్య వివక్ష తగదని భక్తులు గుర్తించేలా సంప్రదాయ విధానాన్ని ఆధునిక పోకడలతో సమ్మిళితం చేస్తామని పేర్కొన్నారు.

Image copyright Twitter

శభాష్ దేవస్థానం: కమల్ హాసన్

ఈ విషయంపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ హర్షం వ్యక్తం చేశారు. ‘‘శభాష్ ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు. 36 మంది బ్రాహ్మనేతరులను పూజారులుగా నియమించిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు సెల్యూట్. పెరియార్ కల సాకారమైంది’’ అని ట్వీట్ చేశారు.

Image copyright Getty Images

‘బ్రాహ్మణుల ఆందోళనలూ పరిగణనలోకి తీసుకోవాలి’

ఇదే అంశంపై సామాజిక కార్యకర్త రాహుల్ ఈశ్వర్ స్పందిస్తూ, "వేదవ్యాసుడు మత్స్యకారుడి కొడుకు. వాల్మీ‌కి ఒక షెడ్యూల్డ్ తెగకు చెందినవారు. స్వామి వివేకానంద చెప్పినట్లు ఒక దశలో హిందూ మతం తీవ్రస్థాయిలో కులతత్వాన్ని నింపుకొంది, బ్రాహ్మణులు మాత్రమే పురోహితులుగా నియమితమయ్యేవారు. ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయం స్వాగతించాల్సిందే అయినప్పటికీ వ్యతిరేక గళాలూ వినిపిస్తాయి" అన్నారు.

ఈ నిర్ణయాన్ని అందరూ వ్యతిరేకించరని ఈశ్వర్ చెప్పారు. అయితే బ్రాహ్మణులూ పేదరికంలో ఉన్నారని, వారు వ్యక్తంచేసే ఆందోళనల్లో న్యాయబద్ధమైన వాటిని పరిగణనలోకి తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.

వివిధ వర్గాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించి తాజా సంస్కరణను అమలు చేస్తారనే నమ్మకం తనకుందని ఆయన తెలిపారు.

Image copyright Getty Images

సామాజిక, రాజకీయ వివాదానికి అవకాశం

ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయంపై తిరువనంతపురంలో 'ద హిందూ' పత్రిక సీనియర్ అసోసియేట్ ఎడిటర్ సీజీ గౌరీదాసన్ స్పందిస్తూ- ఇది సామాజికంగానూ, రాజకీయంగానూ వివాదానికి దారితీయొచ్చన్నారు.

కేరళలోని హిందువుల్లో ఐక్యత సాధించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని, దీనిని దృష్టిలో ఉంచుకొనే సీపీఎం నేత్వత్వంలోని వామపక్ష కూటమి ప్రభుత్వం పూజారుల నియామకంపై చర్యలు చేపట్టిందని భాజపా ప్రచారం చేసే అవకాశముందని అభిప్రాయపడ్డారు.

మరోవైపు సీపీఎం వెనకబడిన తరగతుల మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తుందని గౌరీదాసన్ చెప్పారు.

దళితుల ఆలయ ప్రవేశం విషయంలో దక్షిణాది రాష్ట్రాలు కేరళ, కర్ణాటకల మధ్య ఒక సారూప్యం ఉంది. రెండు రాష్ట్రాల్లోనూ వీరికి ఆలయ ప్రవేశం కల్పించేలా రాజులే ఉత్తర్వులు ఇచ్చారు.

Image copyright Getty Images

వైకోమ్ ఉద్యమ నేపథ్యంలో 1936లో కేరళలో ఆలయాల్లోకి దళితులకు ప్రవేశం కల్పించేలా ట్రావెన్‌కోర్ మహారాజా ఉత్తర్వులు ఇచ్చారు.

1927లో మహాత్మా గాంధీ పిలుపు అందుకొని ఒకప్పటి మైసూర్ రాష్ట్రంలో నలవాడి కృష్ణరాజా వడయార్ హయాంలో దళితులకు ఆలయ ప్రవేశం కల్పించారు.

కర్ణాటకలోని మంగళూరులో ఉన్న కుడ్రోలి గోకర్ణనాథేశ్వర ఆలయంలో దళితులు అదీ వితంతువులే పూజారులుగా ఉంటారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)