ఇవీ ప్రధాని మోదీ సొంతూరి విశేషాలు

  • 9 అక్టోబర్ 2017
ప్రధాని మోదీ ఫోటో Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రధాని మోదీ పుట్టి పెరిగింది గుజరాత్‌లోని వడ్‌నగర్‌లో

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తన సొంతూరు గుజరాత్‌లోని వడ్‌నగర్‌లో పర్యటించారు. అక్కడ నిర్మించిన కొత్త మెడికల్ కళాశాలను ప్రారంభించారు.

దేశ ప్రధాని సొంతూరు కాబట్టి ఆ ఊరు పేరు చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ ఆ ఊరికి ఉన్న ప్రత్యేక చారిత్రక, సాంస్కృతిక విశేషాలేమిటో తెలియకపోవచ్చు. అవేంటో ఓసారి చూద్దాం.


1. ఇది 19 శతాబ్దాల కిందటి బౌద్ధ మఠం

Image copyright Getty Images

వడ్‌నగర్‌లో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో ఈ విశాలమైన బౌద్ధ మఠం బయటపడింది. ఈ మఠాన్ని క్రీ.శ. రెండు, ఏడు శతాబ్దాల మధ్య నిర్మించి ఉంటారని అధికారుల అంచనా.

ఇందులో రెండు భారీ స్థూపాలను, నేలమాళిగను గుర్తించారు.

వడ్‌నగర్‌లో ఒకప్పుడు పది బౌద్ధ మఠాలు, వెయ్యి మంది బౌద్ధ సన్యాసులు ఉండేవారని చైనా చరిత్రకారులు వెల్లడించారు.


2. దిల్లీ చక్రవర్తి అక్బర్‌తో లింకు

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఏటా ’టానా-రిరి‘ సంగీతోత్సవం నిర్వహిస్తారు

దిల్లీ చక్రవర్తి అక్బర్ ఆస్థానంలోని ప్రఖ్యాత గాయకుడు తాన్‌సేన్‌ ఓ రోజు ‘దీపక్’ రాగం ఆలపిస్తూ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడట. ఒళ్లంతా వేడెక్కిపోయిందట. ఆయన శరీరం చల్లబడాలంటే ఎవరైనా వర్షాన్ని కురిపించే ‘మల్‌హర్’ రాగం పాడాలని భావించారట.

ఆ రాగం పాడించేందుకు వడ్‌నగర్‌లో ఉంటున్న టానా, రిరి అనే ఇద్దరు గాయనీమణులను దిల్లీకి రావాలని అక్బర్ కబురు పంపాడు. కానీ వాళ్లు దిల్లీకి వెళ్లేందుకు నిరాకరించారని చెబుతారు.

దాంతో బలవంతంగా వాళ్లను తీసుకురావాలంటూ అక్బర్ సైన్యాన్ని పంపించగా ఆ గాయనిలిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారని చెబుతారు.

వాళ్లకు జ్ఞాపకార్థంగా వడ్‌నగర్‌లో సమాధి ఉంది. వాళ్ల పేరుతోనే ఇప్పటికీ ఏటా ఆ ఊరిలో ‘టానా-రిరి’ పేరుతో సంగీతోత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది.


3. గుజరాత్ చరిత్రకు గుర్తింపు

Image copyright Gujarat Tourism
చిత్రం శీర్షిక గుజరాత్ చరిత్రకు చిహ్నంగా నిలిచే తోరణం

గుజరాత్ ఘన కీర్తిని తెలిపే కట్టడాల్లో ఇదొకటి. 40 అడుగుల ఎత్తున్న ఈ తోరణం వడ్‌నగర్‌లోనే ఉంది.

ఒకప్పుడు ఇది మందిరానికి ద్వారంగా ఉండేదని పెద్దలు చెబుతున్నారు. ఇప్పుడు అలాంటి ఆనవాళ్లేమీ కనిపించడంలేదు.


4. మోదీ తన బాల్యంలో చాయ్ అమ్మిందిక్కడే

Image copyright AFP

ఇది వడ్‌నగర్ రైల్వే స్టేషన్‌. ఈ స్టేషన్‌లోనే ప్రధాని మోదీ తండ్రి టీ స్టాల్ నడిపేవారు.

అందులో మోదీ తన తండ్రికి సాయపడేవారు.


5. అత్యల్ప బాలికల నిష్పత్తి

Image copyright Getty Images

వడ్‌నగర్ మెహసానా జిల్లాలో ఉంది. ఈ జిల్లాలో 9 తాలూకాలు, 606 గ్రామాలున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం గుజరాత్ రాష్ట్రంలో అతి తక్కువ బాలికల నిష్పత్తి కలిగిన జిల్లాల్లో మెహసానా రెండోది. సగటున వెయ్యి మంది పురుషులు ఉంటే, బాలికలు కేవలం 842 మందే ఉన్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు