‘ద వైర్’ పై జయ్ షా దావా వేస్తారు: పీయూష్ గోయల్

  • 8 అక్టోబర్ 2017
జై షా Image copyright Getty Images
చిత్రం శీర్షిక జయ్ షా

అమిత్ షా కుమారుడు జయ్ షా ఆస్తి 16000 రెట్లు పెరిగిందని పేర్కొంటూ ద వైర్ కథనం రాసింది. దీంతో ఆ వెబ్‌సైట్ ఎడిటర్, రిపోర్టర్లపై జయ్ షా వంద కోట్ల రూపాయల పరువునష్టం దావా వేయనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు.

ద వైర్ తన కథనంలో జయ్ షా కంపెనీ టర్నోవర్ ఒక్కసారిగా ఎలా పెరిగిందని ప్రశ్నించింది.

'ద వైర్' కథనాన్ని పేర్కొంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కపిల్ సిబల్, జయ్ షా కంపెనీ టర్నోవర్ ఏడాదిలోనే రూ.50,000 నుంచి రూ.80 కోట్లకు ఎలా పెరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

బీజేపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే జయ్ షా కంపెనీ టర్నోవర్ 16 వేల రెట్లు పెరిగిందని ఆరోపించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక అమిత్ షా

కాంగ్రెస్ ఆరోపణలపై స్పందించిన పీయూష్ గోయల్.. 'ద వైర్' అమిత్ షా ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

ఆ పత్రికపై జయ్ షా పరువునష్టం దావా వేయనున్నట్లు వెల్లడించారు.

ద వైర్ ఏం రాసింది

అమిత్ షా కుమారుడి కంపెనీ ఆదాయం మోదీ ప్రధాని అయిన తర్వాత ఏడాదిలోనే 16000రెట్లు పెరిగిందని ద వైర్ ఒక కథనం రాసింది. రూ.50 వేల నుంచి రూ.80 కోట్లకు చేరిందని పేర్కొంది. లాభాలు వచ్చిన ఏడాదిలోనే నష్టాలను చూపిస్తూ జయ్ షా తన కంపెనీని మూసేశారని తెలిపింది.

పీయూష్ గోయల్ ఇంకా ఏమన్నారు?

Image copyright BJP LIVE
  • 'ద వైర్' కథనానికి ఎలాంటి ఆధారాలూ లేవు. ఆ వెబ్ సైట్ కథనంపై జై షా రూ.100 కోట్ల పరువునష్టం దావా వేస్తారు.
  • వెబ్ సైట్ ఎడిటర్ జయ్ షాకు కొన్ని ప్రశ్నలు పంపినప్పుడు, ఆయన వాటన్నిటికీ సమాధానాలు పంపారు.
  • జితేంద్ర షాతో కలిసి జయ్ షా 8-9 ఏళ్ల నుంచి నిత్యావసర వస్తువుల వ్యాపారం చేస్తున్నారు. ఎన్‌బీఎఫ్‌సీల నుంచి జై షా కంపెనీ రుణం తీసుకోవడంలో ఎలాంటి తప్పూ లేదు.
  • జయ్ షా కంపెనీ టర్నోవర్ 16 వేల రెట్లు పెరగడంలో ఎలాంటి మోసం లేదు. ఏదైనా వ్యాపారం ప్రారంభించినపుడు ఇలాంటి పెరుగుదల సాధ్యమే. నిత్యావసర వస్తువుల వ్యాపారంలో రూ.80 కోట్లు పెద్ద సొమ్మేం కాదు.
  • నష్టాలు రావడంతో జయ్ షా అక్టోబర్, 2016లో తన వ్యాపారాన్ని మూసేశారు.
  • పీయూష్ గోయల్ జయ్ షాకు వత్తాసు పలుకుతున్నారంటూ కపిల్ సిబల్ విమర్శించారు. ఒక కేంద్ర మంత్రి జయ్ షా తరపున ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.

సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు

'ద వైర్' కథనంపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరిగింది. అనేకమంది 'అభివృద్ధి ఎక్కడుందో ఇప్పుడు తెలిసింది' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Image copyright TWITTER

ఈ కథనంపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని సీపీఐ (ఎం) నేత సీతారాం ఏచూరి ప్రశ్నించారు.

''ఈ అక్రమాలు మోదీ దృష్టికి రాలేదా?'' అని ప్రశ్నాస్త్రం సంధించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు, కాంగ్రెస్ నాయకురాలు శర్మిష్ఠ ముఖర్జీ, ''బహుశా బీజేపీ చెబుతున్న అభివృద్ధి ఇదే కాబోలు'' అని ట్వీట్ చేశారు.

మహారాష్ట్ర కాంగ్రెస్ నేత షహజాద్ పూనావాలా, ''అమిత్ షా కుమారుని ఆదాయం రూ.50 వేల నుంచి ఏడాదిలో రూ.80 కోట్లకు చేరింది. ఆర్థిక వ్యవస్థ బాగుందని మోదీజీ విశ్వసించడంలో ఆశ్చర్యమేముంది'' అని ట్వీట్ చేశారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేసుకోండి.)

ముఖ్యమైన కథనాలు