తెలంగాణలో కొత్త జోన్ల ప్రతిపాదనపై ప్రశ్నలు

  • 8 అక్టోబర్ 2017
నిరుద్యోగ యువత Image copyright Getty Images

జోన్ల వ్యవస్థ కొనసాగింపును స్వాగతిస్తూనే ఆ ప్రక్రియ వేగంగా జరగాలని, అది అందరికీ న్యాయం చేకూర్చేలా ఉండాలని ప్రతిపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులలో మాత్రం ఈ పరిణామాల పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.

కొత్తగా ఏర్పడిన జిల్లాలకు అనుగుణంగా కొత్త జోన్లను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం ప్రకటించారు. దీనిపై ఓ కమిటీని కూడా నియమిస్తున్నట్లు తెలిపారు.

జోన్ల సవరణపై రాష్ట్రపతి ఉత్తర్వులను (371డీ) సవరించాల్సిన అవసరం ఉండటంతో దీనిపై కేంద్రానికి ప్రతిపాదనలు కూడా పంపుతామని చెప్పారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రాంతాలకు విద్య, ఉద్యోగాల్లో సముచిత స్థానం కల్పించే ఉద్దేశంతో జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తెలంగాణ ప్రాంతాన్ని రెండు జోన్లు గా (5, 6 జోన్లు) విభజించారు.

నాడు రద్దు అన్నారు, నేడు కొనసాగాలంటున్నారు!

2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జోన్ల కొనసాగింపుపై తీవ్ర చర్చ జరిగింది. జోన్లను కొనసాగించాలని కొందరు, రద్దు చేయాలని మరికొందరు వాదించారు.

గత డిసెంబర్‌లో జోనల్ వ్యవస్థ రద్దుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. ఉద్యోగ సంఘాలు కూడా నియామకాల్లో అడ్డంకిగా ఉన్న జోన్లను రద్దు చేయాలని, కొత్త జిల్లాల ప్రాతిపదికన ఎక్కువగా నియామకాలను చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడా చేశాయి.

Image copyright Getty Images

అయితే ప్రజాసంఘాలు, నిరుద్యోగులు మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి.

మరోవైపు, కొత్త రాష్ట్ర ఏర్పాటు తర్వాత జోనల్ వ్యవస్థ ఉద్యోగ నియామకాలకు కొంత వరకు సంక్లిష్టంగా మారింది. దీనికి తోడు కొత్త జిల్లాల ఏర్పాటు జరగడంతో పరిస్థితి మరింత జటిలంగా మారింది.

చివరకు జోన్ల సవరణకే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రం ఏర్పడిన మూడున్నరేళ్ల అనంతరం ప్రభుత్వం తాజాగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే చాలా ఆలస్యమైంది

ప్రభుత్వ నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు స్వాగతిస్తూనే, రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఈ పని చేసి ఉంటే బాగుండేదని అంటున్నాయి.

జోన్ల కొనసాగింపుపై తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం బీబీసీతో మాట్లాడుతూ, ''ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అయితే ప్రభుత్వం చాలా ఆలస్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఈ పని చేసుంటే నియామకాలు సాఫీగా జరిగేవి. ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటుతో న్యాయపరమైన చిక్కులు ఏర్పడి ఉద్యోగ నియామకాలకు అంతరాయం కలుగుతోంది. ఇప్పుడు జోనల్ వ్యవస్థ కొనసాగింపుపై కమిటీ అంటున్నారు. ఆ నివేదిక వచ్చి కొత్తగా జోనల్ వ్యవస్థ ఏర్పడాలంటే చాలా సమయం పడుతుంది. ఇది నిరుద్యోగ అభ్యర్థులపై తీవ్ర ప్రభావం చూపుతుంది'' అని అన్నారు.

Image copyright kodandaram

''జోన్లను కూడా గతంలో మాదిరిగా కాకుండా సామాజిక, ఆర్థిక వెనుకబాటు, ఆ ప్రాంతంలో వచ్చిన ఉద్యోగాల సంఖ్య ఆధారంగా విభజించాలి. అప్పుడే అందరికీ న్యాయం జరుగుతుంది.'' అని తెలిపారు.

''జోన్ పోస్టులు, కొత్తగా ఏర్పడిన జిల్లాల ఆధారంగా చేర్చే పోస్టులపై ప్రభుత్వం చాలా స్పష్టంగా చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. ఏ ఒక్క ప్రాంతానికి అన్యాయం జరగకుండా కొత్తగా వచ్చే జోనల్ వ్యవస్థ ఉండాలి, స్థానికత నిర్ధరణ శాస్త్రీయంగా జరగాలి'' అని సూచించారు.

కొలువుల భర్తీలో కాలయాపనకే: కాంగ్రెస్

మరో వైపు జోనల్ వ్యవస్థ కొనసాగింపు పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ''జోనల్ వ్యవస్థ కొనసాగింపు, కొత్త జిల్లాల ఏర్పాటు అంతా ఉద్యోగ నియామకాల్లో కాలయాపన చేయడానికి ప్రభుత్వం ఆడుతున్న నాటకం. సర్కారుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగనియాకాలు వెంటనే చేపట్టాలి. జోన్లు, కొత్త జిల్లాలు ఉద్యోగ నియామకాలకు ఆటంకం కానే కావు.'' అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు.

Image copyright Sravan

''నిరుద్యోగుల నుంచి ఎదురయ్యే వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే కొత్త జిల్లాలు, కొత్తగా జోన్ల ఏర్పాటు అంటూ సీఎం కాలయాపన చేస్తున్నారు'' అని ఆయన అన్నారు. జోనల్ వ్యవస్థ కొనసాగింపుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని, నిరుద్యోగ సంఘాల అభిప్రాయాలు కూడా తీసుకోవాలని అన్నారు.

నిరుద్యోగుల్లో నిర్వేదం

కొత్త రాష్ట్రంలో కొలువుల కోసం ఎదురుచూస్తున్న తమకు కొత్త జిల్లాలు, కొత్త జోన్ల ఏర్పాటే పెద్ద ఆటంకంగా మారుతోందని నిరుద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

''ఇన్నాళ్లు జిల్లాల ఏర్పాటు పేరుతో ప్రభుత్వం చాలా నోటిఫికేషన్లు ఇవ్వలేదు, ఇప్పుడు జోన్ల సవరణ పేరుతో అదే పని చేసే అవకాశం కనిపిస్తోంది. మూడేళ్ల నుంచి గ్రూప్ 1 కోసం ప్రిపేర్ అవుతున్నా. ఇది రాష్ట్రస్థాయి కేడర్ పోస్టు, జిల్లా, జోనల్ కు సంబంధమే లేదు. కానీ, ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వడమే లేదు.'' అని హైదరాబాద్ కు చెందిన పోటీ పరీక్షల అభ్యర్థి నరసింహులు బీబీసీతో అన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఉద్యోగావకాశాల కోసం తెలంగాణ యువత ఆందోళన

''డీఎస్సీ పరీక్ష కోసం తెలంగాణ ఏర్పాటు జరిగినప్పటి నుంచి సన్నద్ధం అవుతున్నా, గతంలో పాత జిల్లాల ప్రకారమే డీఎస్సీ ఉంటుందన్నారు. తర్వాత కొత్త జిల్లాల ఆధారంగా డీఎస్సీ ప్రకటన త్వరలోనే విడుదల చేస్తామన్నారు. ఇప్పుడేమో జోన్లపై స్పష్టత వచ్చాకే డీఎస్సీ వేస్తాం అంటున్నారు. వచ్చే ఎన్నికల వరకు డీఎస్సీ ఉంటుందో లేదో అనే అనుమానం కలుగుతోంది. '' అని వరంగల్ కు చెందిన డీఎస్సీ అభ్యర్థి రమేశ్ చెప్పారు.

మరోవైపు జోనల్ వ్యవస్థపై స్తబ్ధత నెలకొనడంతో ఇన్నాళ్ల నుంచి తమ పదోన్నతులు, బదిలీలు ఆగిపోయాయని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ప్రభుత్వ ఉద్యోగి ఒకరు బీబీసీకి తెలిపారు. ఇప్పటికైనా దీనిపై స్పష్టత వస్తే తమకు సరైన న్యాయం జరుగుతుందన్నారు.

తాము అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలిస్తామని టీఆర్ఎస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. మూడున్నరేళ్లు గడుస్తున్నా ప్రభుత్వం ఈ లక్ష్యానికి చేరువ కాలేదు.

''సమానత్వం, సముచిత స్థానం''

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాల తరఫున స్వాగతిస్తున్నట్లు టీఎన్జీవో గౌరవ అధ్యక్షుడు దేవీ ప్రసాద్ చెప్పారు.

Image copyright Deviprasad
చిత్రం శీర్షిక దేవి ప్రసాద్

''ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జోనల్ వ్యవస్థ ఉన్నా తెలంగాణకు సరైన న్యాయం జరగలేదు. ఇప్పడు అలాంటి పరిస్థితి ఉండదు. కొత్త జిల్లాలకు అనుగుణంగా కొత్తగా జోన్లు ఏర్పాటైతే అన్ని ప్రాంతాలకు విద్యా, ఉద్యోగాల్లో సముచిత స్థానం వస్తుంది. అభివృద్ధి చెందిన ప్రాంతాలను, వెనకబడిన ప్రాంతాలను గుర్తించి జోనల్ వ్యవస్థను రూపొందించే అవకాశం ఉంది. అప్పుడు వెనకబడిన ప్రాంత అభ్యర్థులకు కూడా విద్యా, ఉద్యోగాల్లో న్యాయం జరుగుతుంది.'' అని తెలిపారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు