అమిత్ షా ప్రతిబింబమే జయ్ షా

  • 9 అక్టోబర్ 2017
అమిత్ షా, జయ్ షా Image copyright Getty Images

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏకైక కుమారుడు జయ్ షా. ఆయన కంపెనీ ప్రస్తుతం రాజకీయ వివాదంలో చిక్కుకుంది.

ప్రధాని మోదీ తర్వాత అమిత్ షాను ప్రస్తుతం దేశంలో రెండవ శక్తిమంతమైన వ్యక్తిగా పరిగణిస్తారు. అయితే 27 ఏళ్ల జయ్ షా ప్రస్తుత ఇతర కారణాల వల్ల వార్తల్లో నిలిచారు.

ద వైర్ అనే వెబ్‌సైట్ ప్రచురించిన కథనం ప్రకారం అమిత్ షా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన కుమారుడి వ్యాపారం కొన్ని వేల రెట్లు వృద్ధి చెందింది.

ఈ నేపథ్యంలో చాలా మంది ఆయన వ్యాపార వృద్ధిని తండ్రి రాజకీయ పలుకుబడితో జోడించి చూస్తున్నారు. 'షా బిజినెస్ మోడల్' గురించి వివరించాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ ప్రధాని మోదీని డిమాండ్ చేశారు.

అయితే అమిత్ షాకు మద్దతుగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ముందుకొచ్చారు. ఈ కథనాన్ని ప్రచురించిన వెబ్‌సైట్‌పై పరువు నష్టం కేసు నమోదు చేయబోతున్నామని తెలిపారు. ఈ మొత్తం వివాదంపై సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తాయి.

ప్రతిపక్షం నుంచి ప్రభుత్వం దాకా అంతటా ప్రస్తుతం జయ్ అమిత్ షా చర్చలకు కేంద్రబిందువుగా నిలిచారు. అసలు జయ్ ఏం చేస్తారు? గుజరాత్‌లో తన తండ్రి నీడన ఆయన వ్యాపారం ఎలా పెంపొందింది? అనే విషయాల పట్ల పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు.

తొలిసారి మీడియా దృష్టికి వచ్చిన తీరు

జయ్‌ షా మొట్టమొదట 2010లో మీడియా దృష్టిలో పడ్డారు. అప్పటికి 20 ఏళ్ల వయసున్న జయ్ ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ గుజరాత్ హైకోర్టుకు వెళ్లేటప్పుడు ఆయనతో పాటే వెళ్లేవాడు.

కోర్టు కార్యకలాపాలు జరిగేటప్పుడు ఆయన న్యాయవాదుల వెనుకే కూర్చునేవారు. కోర్టులో సాగే వాదప్రతివాదాల్లో ఓ వైపు రాం జెఠ్మలానీ తన వాదనలు వినిపిస్తుంటే మరోవైపు కె.టి.ఎస్. తులసీ ఆ వాదనల్ని ఖండించే ప్రయత్నం చేస్తుండేవారు.

అయితే జయ్ మాత్రం వారి వాదనలకన్నా వారి ముఖాల్లో కనిపించే హావభావాలపైనే ఎక్కువ దృష్టి పెట్టే వారు. కోర్టు విచారణ జరుగుతున్నంత సేపు ఆయన హనుమాన్ చాలీసా చదువుతూ ఉండేవారు.

2010 వరకు ఈ యువకుడి పేరు జయ్ షా అనే విషయం ఎవ్వరికీ తెలియదని చెప్పొచ్చు.

2010లోనే సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో అమిత్ షాను సీబీఐ అరెస్ట్ చేసింది. ఆ సమయంలో జయ్ షా తన తండ్రి బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరిగేవారు. ఆ సమయంలోనే ఆయన తొలిసారి మీడియా, ప్రజల దృష్టిలో పడ్డారు.

గుజరాత్ హైకోర్టు అమిత్ షాకు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆయన గుజరాత్‌లో అడుగు పెట్టగూడదంటూ సుప్రీంకోర్టు ఆంక్ష విధించింది. ఆ తర్వాత అమిత్ షా దిల్లీకి వెళ్లిపోయారు.

ఆ సమయంలో అమిత్ షా నారన్‌పురా నియోజవర్గం నుంచి గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికై ఉన్నారు. ఆయన దిల్లీకి వెళ్లిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో ప్రజల సమస్యలను తెలుసుకునే బాధ్యత జయ్ తన భుజాలకెత్తుకున్నారు.

దాంతో పాటే తండ్రి నిర్వహిస్తూ వచ్చిన షేర్ మార్కెట్ వ్యాపారాన్ని కూడా ఆయన చేపట్టారు.

గుజరాత్ క్రికెట్ బాధ్యతలు

జయ్ తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (జీసీఏ)లో కూడా భాగమయ్యారు. అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అయినప్పటి నుంచి దాదాపు జీసీఏ బాధ్యతలన్నీ జయ్ చేతుల్లోనే పెట్టారు. ఆయన తన తనయుడిని జీసీఏ జాయింట్ సెక్రటరీగా నియమించారు.

గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధికారి హితేశ్ పటేల్ బీబీసీ న్యూస్ గుజరాతీతో మాట్లాడుతూ తండ్రీ తనయులిద్దరినీ పోల్చలేమని అన్నారు. జయ్ ఎల్లప్పుడూ లో ప్రొఫైల్‌లో ఉండాలని కోరుకునే వారని ఆయన తెలిపారు.

జీసీఏ రోజువారీ నిర్వహణ పనుల కోసం జయ్ సమయం కేటాయించలేకపోయేవారని పటేల్ అంటారు. తండ్రికి ఉన్నంత అవగాహన కూడా ఆయనకు లేదని పటేల్ అభిప్రాయపడ్డారు.

Image copyright Getty Images

'తండ్రి లాంటి హోదా కనిపించదు'

జయ్ నిర్మా ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఇంజినీరింగ్ చదివారు. మూడేళ్ల క్రితం ఆయన తన క్లాస్‌మేట్ రుషితా పటేల్‌ను వివాహం చేసుకున్నారు.

తండ్రీ, తనయుల్లో ఉమ్మడి లక్షణం ఏమిటంటే తమ వ్యక్తిగత జీవితాలను ఎప్పుడూ బహిరంగం కానివ్వరు.

అమిత్ షా స్నేహితుడు కమలేశ్ త్రిపాఠీ బీబీసీతో మాట్లాడుతూ, "తన కుమారుడిపై తన హోదా ప్రభావం పడగూడదని అమిత్ తొలి నుంచీ భావించేవారు" అని చెప్పారు.

తమ కుటుంబంలోనూ, సన్నిహిత మిత్రమండలిలోనూ ఎవరికీ సులువుగా చోటివ్వకపోవడం వారిద్దరిలో కనిపించే మరో ఉమ్మడి లక్షణం.

జయ్‌కు కూతురు పుట్టినప్పుడు జరిగిన కార్యక్రమానికి చాలా తక్కువ మంది బంధుమిత్రులను మాత్రమే పిలిచారు.

తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడం, వీలైనంత ఎక్కువ డబ్బు సంపాదించడమే జయ్ ఏకైక లక్ష్యమని షా కుటుంబాన్ని దగ్గరగా గమనించే వారు చెబుతారు.

ఇప్పుడు అతని వ్యాపారం రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలకు కేంద్రంగా మారింది.

మా వెబ్‌సైట్‌పై మరి కొన్ని తాజా కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేసుకోండి.)