చే గువేరా: క్యూబా మంత్రి హోదాలో భారత్‌ వచ్చినప్పుడు తన రిపోర్టులో ఏం రాశారు?

చే గువేరా

ఫొటో సోర్స్, Getty Images

అర్జెంటీనాలో ఓ మధ్య తరగతి కుటుంబంలో 1928 జూన్ 14న చే గువేరా జన్మించారు. వృత్తిపరంగా డాక్టర్ అయిన చే గువేరా 33 ఏళ్ల వయస్సులో క్యూబా పరిశ్రమల శాఖ మంత్రి అయ్యారు. ఆ తర్వాత విప్లవాన్ని విస్తరించేందుకు ఆయన ఆ పదవిని వదులుకున్నారు.

అర్జెంటీనా రాజధాని బ్యూనెస్ అయిరెస్ కళాశాలలో డాక్టర్ చదువు పూర్తి చేసిన చే గువేరా సుఖంగా జీవితం గడపాలని అనుకున్నారు.

కానీ, తన చుట్టూ పెరుగుతున్న పేదరికం, జరుగుతున్న దోపిడీలను చూసి చలించిపోయి పోరాట మార్గాన్ని ఎంచుకున్నారు. ఆ తర్వాత దక్షిణ అమెరికాలో పెరుగుతున్న సమస్యలకు సాయుధ ఉద్యమమే మార్గమని నమ్మి ఉద్యమాలు నడిపించారు.

1955లో ఆయన తన 27 ఏళ్ల వయసులో క్యూబా విప్లవ నాయకుడైన ఫిడెల్ కాస్ట్రోతో కలిశారు. ఆ తర్వాతి క్రమంలో పలు ఉద్యమాలలో పాల్గొన్న ఫలితంగా యువ విప్లవకారుడిగా ఆయన పేరు నలు దిశలా మార్మోగింది.

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES

క్యూబా విప్లవం అనంతరం చే గువేరా 31 ఏళ్ల వయసులో క్యూబా జాతీయ బ్యాంక్‌కు అధ్యక్షుడయ్యారు. ఆ తర్వాత క్యూబా పరిశ్రమల మంత్రిగా పని చేశారు.

1964 లో చే గువేరా ఐక్యరాజ్య సమితిలో క్యూబా త‌ర‌పున‌ ప్రాతినిధ్యం వహించారు. అప్పటికి ఆయన వయస్సు 36 ఏళ్లు. ఆయన చేసిన ప్రసంగానికి అప్పట్లో భారీ స్పందన వచ్చింది.

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES

జనాదరణ పొందిన పేరు

ప్రపంచవ్యాప్తంగా విప్లవకారుడనగానే చే గువేరా పేరే అందరికీ గుర్తుకొస్తుంది. ఆయన పేరే ఓ ఆశాజ్యోతి. ఆయన చేసిన పోరాటం తమకు ఆదర్శమని, తమ పోరాటానికి స్ఫూర్తి ఆయనేనని చాలా మంది అంటారు.

"చే గువేరా క్యూబా, లాటిన్ అమెరికాకు మాత్రమే పరిమితంకాదు. ప్రపంచంలో ఎన్నో దేశాలలో ఆయనను ఆదర్శ నేతగా గుర్తిస్తారు" అని చే గువేరా జీవిత చరిత్ర రాసిన జాన్ ఆండర్సన్ అన్నారు.

"నేను పాకిస్తాన్‌లో చే గువేరా ఫొటోను చూసాను. అక్కడ లారీల వెనుకాల ఆయన ఫొటో ఉంది. జపా‌న్‌లో పిల్లలకు, యువకులకు ఆయనే స్ఫూర్తి. చే గువేరా అమెరికాకు సవాలు విసిరారు. ప్రపంచంలో దోపిడీ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడే యువతకు చే గువేరానే ఆదర్శం" అని జాన్ ఆండర్సన్ తెలిపారు.

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES

బొలీవియాలో హత్య

అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా గుర్తింపు పొందిన చే గువేరా 37 ఏళ్ల వయసులో తర్వాత ఆఫ్రికన్, లాటిన్ అమెరికన్ దేశాలలో విప్లవం తీసుకురావాలని కంకణం కట్టుకున్నారు.

బొలీవియాలో తిరుగుబాటుదారులకు గెరిల్లా పోరాట పద్ధతులలో శిక్షణనిచ్చారు. బొలీవియాలో ఆయన నడిపిన ఉద్యమం అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలకు ఆందోళన కలిగించింది.

దాంతో అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెంట్లు చే గువేరా కోసం వేట మొదలుపెట్టారు. ప్రత్యేక బృందాలు ఆయన కోసం రంగంలోకి దిగాయి. చివరకు ఆయనను బొలీవియా సైన్యం సహాయంతో హత్య చేశారు.

నేటికీ చే గువేరా క్యూబా, దక్షిణ అమెరికా దేశాలలో ఎన్నో కోట్ల మందికి ఆశాజ్యోతి. ఇప్పటికీ ఆయన ప్రపంచంలో ఎందరికో ఆదర్శం. అందుకే భార‌త్‌లో యువకుల టీ-షర్టులపై, లండన్‌లో యువకులు వేసుకునే జీన్స్‌పై చే ఫొటోలు సర్వసాధారణం. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఎందరో అభిమానులున్నారు.

అక్టోబర్ 9, 1967న ఆయనను హత్య చేశారు. అప్పటికి ఆయన వయస్సు 39 ఏళ్ళు.

ఫొటో సోర్స్, PHOTODIVISION.GOV.IN

భారత్‌తో అనుబంధం

చే గువేరా భారత్‌లో కూడా పర్యటించారని చాలా తక్కువ మందికి తెలుసు. క్యూబా మంత్రి హోదాలో ఉన్నప్పుడు ఆయన భారత్‌కు వచ్చారు.

1959లో ఆయన తన భారత్‌ పర్యటనపై నివేదిక రాసి ఫిడెల్ కాస్ట్రోకు అందించారు.

"మేము కైరో నుంచి భారత్‌కు వెళ్ళాము. 39 కోట్ల జనాభా, 30 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమున్న దేశమది. మేమీ పర్యటనలో భారత అగ్రశ్రేణి రాజకీయ నాయకులను కలిశాం. జవహర్ లాల్ నెహ్రూ మాపై ఎంతో అభిమానం చూపారు. క్యూబా ప్రజలతో మేమున్నామని, వారు చేస్తున్న పోరాటానికి మద్దతు పలుకుతున్నామని" నెహ్రూ చెప్పినట్లు చే గువేరా ఆ నివేదికలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, PHOTODIVISION.GOV.IN

" నెహ్రూ మాకు ఎన్నో విలువైన సలహాలిచ్చారు. క్యూబా ప్రజా ప్రయోజనాల కోసం చేస్తున్న ఉద్యమానికి ఎటువంటి షరతులు లేకుండా మద్దతు ప్రకటించారు. భారత పర్యటనలో ఎన్నో విషయాలు మేం నేర్చుకున్నాం. అందులో ముఖ్య విషయమేమిటంటే ఒక దేశ ఆర్థిక అభివృద్ధి దాని సాంకేతిక అభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది. అందు కోసం ఎక్కువగా పరిశోధనా సంస్థలు ఏర్పాటు చేయాలి. ప్రత్యేకంగా ఫార్మాసూటికల్స్, రసాయనాలు, భౌతికశాస్త్ర రంగం, వ్యవసాయ రంగంలో సంస్థలను ఏర్పాటు చేయాలనే విషయాన్ని నేర్చుకున్నాం" అని ఆయన తన రిపోర్టులో పేర్కొన్నారు.

భారత్ నుంచి వీడ్కోలు సమయంలో తన జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ "భారత్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు స్కూలు పిల్లలు మాకు ‘క్యూబా - భారత్.. భాయి - భాయి’ అంటూ వీడ్కోలు పలికారు. నిజంగానే క్యూబా - భారత్ భాయి - భాయి’’ అని చేగువేరా రాశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)