ప్రభుత్వం వేధించాలని చూస్తోంది: 'ద వైర్' సంపాదకుడు

  • 10 అక్టోబర్ 2017
సిద్ధార్థ్ వరదరాజన్ Image copyright Twitter
చిత్రం శీర్షిక 'ద వైర్' సంపాదకుడు సిద్ధార్థ్ వరదరాజన్

'ద వైర్' వెబ్‌సైట్ శనివారం ప్రచురించిన ఒక వార్తా కథనంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు జయ్ షాకు చెందిన కంపెనీ వ్యాపారం ఒక్క సంవత్సరంలోనే అనేక రెట్లు పెరిగిందని పేర్కొంది.

ఆ కథనం రాసిన రిపోర్టర్, 'ద వైర్' సంపాదకుడిపై జయ్ షా 100 కోట్ల రూపాయల పరువునష్టం కేసు వేయడంతో దీనిపై వివాదం ముదిరింది.

ఈ పరువు నష్టం కేసును ఎదుర్కొంటామని 'ద వైర్' సంపాదకుడు సిద్ధార్థ్ వరదరాజన్ తెలిపారు. ఈ కథనం ప్రచురిస్తే ఎదురయ్యే ప్రమాదం ఏమిటో తమకు ముందే అంచనా ఉందని ఆయన చెప్పారు. జయ్ షా తరఫు న్యాయవాది ముందే కేసు పెడతామని బెదిరించారని ఆయన తెలిపారు.

ఈ మొత్తం వ్యవహారం గురించి బీబీసీ ప్రతినిధి కుల్‌దీప్ మిశ్రా 'ద వైర్' సంపాదకుడితో మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూ సారాంశం వరదరాజన్‌ మాటల్లోనే -

ప్రభుత్వం వేధించాలని చూస్తోంది

పరువు నష్టానికి సంబంధించిన నోటిస్ ఏదీ ఇంకా మాకు అందలేదు. అయితే సోషల్ మీడియా ద్వారా మేం దానిని చూశాం. ప్రభుత్వ వైఖరిని బట్టి చూస్తే అది 'ద వైర్'ను వేధించాలని చూస్తోందన్నది స్పష్టం. ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి. ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేత ధోరణిపై పోరాడుతాం.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా, ఆయన తనయుడు జయ్ షా

అమిత్ షా కుమారుడైన జయ్ షాకు సంబంధించిన స్టోరీ ప్రచురిస్తే ఎదురయ్యే ప్రమాదం ఏమిటో మాకు ముందే తెలుసు. ఆయన తరఫు న్యాయవాదికి నేను అనేక ప్రశ్నలు పంపించాను. వాటికి ఆయన జవాబిచ్చారు కూడా. ఈ సమాధానాలు ఇచ్చిన తర్వాత కూడా జయ్ షాకు వ్యతిరేకంగా కథనం ప్రచురిస్తే మీపై కేసు పెడతామని ఆయన ముందే అని ఉన్నారు.

ఇది ప్రమాదం మాత్రమే కాదు, మమ్మల్ని బెదిరించారు కూడా. బెదిరింపును అర్థం చేసుకుంటూనే ప్రజా ప్రయోజనాల రీత్యా మేమీ కథనాన్ని ప్రచురించాం. అధికారికంగా మేం రాబట్టిన గణాంకాల్ని ప్రజలకు అందజేయాలని మేం భావించాం.

మద్దతుగా ప్రభుత్వం ఎందుకొచ్చింది?

తన క్లయింట్ ఒక వ్యక్తి అనీ, ప్రభుత్వంతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదనీ జయ్ షా తరఫు న్యాయవాది అన్నారు. అలాంటప్పుడు ప్రభుత్వంలో లేని ఒక వ్యక్తిని సమర్థిస్తూ పీయూష్ గోయల్ ఎలా ముందుకు వచ్చారు? మంత్రి పీయూష్ గోయల్ ప్రభుత్వంలో భాగం కదా!

Image copyright PTI

భారత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వ్యక్తి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి జయ్ షాను సమర్థించారు. దీనిని బట్టి ఏం రుజువవుతుంది? ఒక మంత్రి మీడియా ముందుకొచ్చి 100 కోట్ల రూపాయల పరువు నష్టం కేసు పెడుతున్నామని ప్రకటించారు. ఎవరైనా ప్రశ్నిస్తే చాలు పరువు నష్టం కేసు పెట్టడం అనేది ఇప్పుడు సాధారణమైంది.

మేం మా రిపోర్టులో ఎలాంటి ఆరోపణలూ చేయలేదు. అలాంటప్పుడు ఈ కథనం ద్వారా మేం వారిని అపఖ్యాతి పాలు చేసే ప్రయత్నం చేశామన్న పీయూష్ గోయల్ ఆరోపణ నిరాధారమైంది.

మేం షాను బద్‌నాం చేయాలని ప్రయత్నించామనడం అర్థరహితం. ఈ కథనం రాసిన రిపోర్టరే 2011లో ఎకానమిక్ టైమ్స్‌లో రాబర్ట్ వాడ్రా వ్యవహారాన్ని బట్టబయలు చేశారన్న విషయం కూడా వారు గమనించాలి. ఒకవేళ అమిత్ షా, బీజేపీలకు వ్యతిరేకంగా రాయడమే ఆయన అజెండా అయినట్టయితే ఆ స్టోరీ ఎలా రాస్తారు?

Image copyright Getty Images

జయ్ షాకు సంబంధించిన గణాంకాలు అందరికీ తెలియడం అవసరం

తమను తాము సమర్థించుకోవడానికి ఇలాంటి అనేక నిరాధారమైన ఆరోపణలెన్నో చేస్తున్నారు. వాస్తవానికి ఇది సూటిగా, మామూలుగా రాసిన వార్తా కథనం. ఇందులో అధికారిక గణాంకాలిచ్చాం. వాటిని అధ్యయనం చేస్తూ ప్రజల ముందుంచాం.

ఇందులో రాజకీయం లేదు. ఆరోపణలూ లేవు. అయినా తమకు పరువు నష్టం జరిగినట్టు మాట్లాడుతున్నారు.

మీడియా రిపోర్టును పరువు నష్టం కేసుతో బెదిరించడం పత్రికా స్వేచ్ఛపై దాడి. ఒక మామూలు కథనంపై 100 కోట్ల పరువు నష్టం కేసు పెట్టడమంటే మరే ఉద్దేశం ఉంటుంది? వారు సివిల్‌తో పాటు క్రిమినల్ పరువునష్టం కేసు కూడా పెట్టారు.

ఈ వ్యవహారంతో ఏ మాత్రం సంబంధం లేని మరి కొందరి పేర్లను కూడా ఈ కేసులో కలిపారు.

ఇది మీడియాను భయపెట్టే, బెదిరించే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు. ఈ దాడి కేవలం మాపైనే కాదు, మొత్తం భారతీయ మీడియా మీదనే.

బీజేపీ లోపలికి ఎవరూ తొంగిచూడొద్దు, ఎవరూ మమ్మల్ని ప్రశ్నించొద్దు అనేదే వారి ఉద్దేశం. అందుకే వారు మమ్మల్ని పరువు నష్టం కేసుతో భయపెట్టాలని చూస్తున్నారు.

మా వెబ్‌సైట్‌పై ఇతర ప్రముఖ కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)