ఆదివాసీ గ్రామాల్లో అక్షర దీపం వెలిగిస్తున్న సాయిపద్మ
సంగీతం ప్రభాకర్, బీబీసీ ప్రతినిధి
విశాఖపట్నానికి చెందిన సాయి పద్మ పోలియో బాధితురాలు. దాంతో వీల్‌చైర్ లేనిదే కదలలేరు. ఆ పరిస్థితిలోనూ ఆమె ఎంచుకున్న సేవా మార్గం ఎందరికో ఆదర్శం.
విజయనగరం జిల్లాలో విద్యాపరంగా అత్యంత వెనకబాటులో మగ్గిపోతున్న మారుమూల ఆదివాసీ గ్రామాల్లో స్కూలు నడుపుతూ అక్షర దీపం వెలిగిస్తున్నారు. ఆమె గురించి బీబీసీ అందిస్తున్న ప్రత్యేక కథనం.
బీబీసీ '100 మంది మహిళలు':
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100 మంది స్ఫూర్తిప్రదాతలైన, ప్రభావవంతులైన మహిళల జాబితాను బీబీసీ ప్రతి ఏటా ప్రకటిస్తుంది.
కనిపించని అడ్డుగోడలు, నిరక్షరాస్యత, వీధుల్లో వేధింపులు, క్రీడల్లో లింగవివక్ష అనే నాలుగు అతిపెద్ద సవాళ్ల పరిష్కారానికి ఈ సిరీస్ ప్రయత్నిస్తోంది. వీటిని ఎదుర్కొనేందుకు ఈ ఏడాది జాబితాలోని మహిళామణులు సరికొత్త మార్గాలను అన్వేషించేందుకు ప్రయత్నించనున్నారు.
2017 సిరీస్ జాబితాలో భారత్‌లో జన్మించినవారు పది మంది ఉండగా, వీరిలో ఒకరు 16 ఏళ్ల బాలిక కావడం విశేషం. ప్రముఖ క్రికెటర్ మిథాలీ రాజ్, దిల్లీ తీహార్ జైల్లో ఎనిమిదేళ్లుగా పిల్లలకు పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయురాలు, సామాజిక కార్యకర్త తూలికా కిరణ్ కూడా వీరిలో ఉన్నారు.
ఈ 100 మంది మహిళల్లో కొందరు అక్టోబరులో నాలుగు వేర్వేరు నగరాల్లో సమావేశమై, ఈ నాలుగు ప్రధాన సమస్యలకు సరికొత్త పరిష్కారాలపై చర్చిస్తారు. మహిళ్లో నిరక్షరాస్యతపై దిల్లీలో, కనిపించని అడ్డుగోడలనే అంశంపై అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో, వీధుల్లో వేధింపులపై బ్రిటన్‌లోని లండన్‌లో, క్రీడల్లో లింగవివక్షపై బ్రెజిల్‌లోని రియోడిజనీరోలో సమావేశాలు, చర్చలు, ఇతర కార్యక్రమాలు ఉంటాయి.
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)