అభిప్రాయం: మోదీకి ఇప్పుడు కొత్త నినాదాలు కావాల్సిందే!

  • 11 అక్టోబర్ 2017
మోదీ Image copyright Getty Images

రాజకీయ నినాదాలు కూడా కరెన్సీ నోట్ల లాంటివే. ప్రజలు వాటిని నమ్మినంత కాలమే అవి చ‌లామణిలో ఉంటాయి.

'అబ్ కీ బార్.. సిరీస్', 'హర్ హర్ మోదీ', 'సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్' వంటి నినాదాలు గత మూడేళ్లుగా ప్రభావం చూపాయి. నోట్ల రద్దు వంటి కష్టాలను మర్చిపోయి మరీ ప్రజలు వాటిని విశ్వసించారు. ఈ నినాదాలను ఎద్దేవా చేసే పేరడీలు మొదటి మూడేళ్లలో ఎక్కడా కనిపించలేదు. కానీ ఇప్పుడవి సోషల్ మీడియాలో కోకొల్లలు.

బాగా ప్రజాదరణ పొందిన నినాదాన్ని ఎగతాళి చేయడం మామూలు విషయం కాదు. ఆ నినాదానికి ప్రజల మద్దతు ఉన్నంతవరకు అలాంటి ప్రయత్నం ఎవరు చేసినా విఫలం కాక తప్పదు. కానీ, ఇటీవల ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో ఈ నినాదాలపై సెటైర్లు వైరల్ అవుతుండడంతో పబ్లిక్ మూడ్ మారిందని అర్థమవుతోంది.

ట్రోల్స్, ఐటీ సెల్ కార్యకర్తలు.. వారు బీజేపీ వాళ్లయినా లేదా కాంగ్రెస్ వాళ్లయినా సరే, ఎన్ని ప్రయత్నాలు చేసినా జనం మెచ్చినప్పుడే నినాదాలు బలం పుంజుకుంటాయి. కొద్ది కాలం కిందటి వరకు సోషల్ మీడియాలో అత్యధికులు మోదీని దేశంలో అందరికన్నా గొప్ప ప్రధానిగా చూశారంటే అది నిస్సందేహంగా ఆయన జనాదరణకి సంకేతం.

కానీ ఆయన ప్రభుత్వానికి 40 నెలలు పూర్తయ్యేసరికి చాలా నినాదాలపై ప్రశ్నలు ముసురుకున్నాయి. 'ఎవరి తోడ్పాటు, ఎవరి అభివృద్ధి' అని ప్రజలు ప్రశ్నిస్తున్నారంటే అది కచ్చితంగా వారి మనసుల్లో తలెత్తిన అనుమానమే.

Image copyright Getty Images

'మంచి రోజుల' కోసం సుదీర్ఘ నిరీక్షణ

'మంచి రోజులు' వచ్చేశాయన్న మోదీ నినాదంపై తొలిసారి 2015 ఆగస్టులో సెటైర్లు మొదలయ్యాయి. పోర్న్ సైట్లు నిలిపివేయాలన్న చర్చ మొదలవగానే జనాలు 'మంచి రోజులు రాకపోగా, మంచి రాత్రులు కూడా లేకుండా పోయాయి' అని సెటైర్లు మొదలెట్టారు.

సెప్టెంబరులో హరియాణా బీజేపీ నేత సుభాష్ బరాలా కుమారుడు వికాస్ బరాలాపై.. ఒక ఐఏఎస్ అధికారి కూతురిని వెంటాడి, అపహరించేందుకు ప్రయత్నించాడన్న ఆరోపణ రావడంతో మోదీ నినాదాలను చీల్చి చెండాడే అసలు ఘట్టం మొదలైంది. అప్పటి నుంచి 'వికాస్' (అభివృద్ధి), 'బేటీ బచావో' వంటి నినాదాలపై వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తాయి.

మోదీ, అమిత్ షాల సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో 'వికాస్ గాండో థయో ఛే' (అభివృద్ధికి పిచ్చెక్కింది) అనే మాటలు ఎంతగా ట్రెండ్ అయ్యాయంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా వాటిని పట్టించుకోకుండా ఉండలేకపోయారు.

'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్' నినాదాన్ని ప్రభుత్వం మధ్యలోనే దారి మళ్లించింది. 'సాథ్ హై, విశ్వాస్ హై, హో రహా వికాస్ హై' (తోడ్పాటు ఉంది, విశ్వాసం ఉంది, అభివృద్ధి జరుగుతోంది) అనే పేరుతో కొత్త నినాదాన్ని ముందుకు తెచ్చింది. అంటే ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదనీ, అభివృద్ధి జరుగుతోందని న‌మ్మ‌బ‌ల‌క‌డ‌మే దీని ఉద్దేశం. అభివృద్ధి ఏదీ అని జ‌నం ప్ర‌శ్నించ‌డం మొద‌లైంది కాబ‌ట్టే ఈ న‌మ్మ‌బ‌లికే ప‌నిని మొద‌లుపెట్టారు.

'నల్ల ధనాన్ని వెనక్కి తేవడం', 'ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు డిపాజిట్ చేయడం' వంటి ఎన్నికల వాగ్దానాలు మాటవరుసకు అన్నవేనని 2015 ఫిబ్రవరిలో బిహార్ ఎన్నికల సందర్భంగా అమిత్ షా చెప్పారు. అప్పటి నుంచి అనేక ప్రభుత్వ నినాదాలు, వాగ్దానాలు మాటవరుసకు మాట్లాడిన మాటలే కావొచ్చనే అనుమానాలు ఎక్కువయ్యాయి.

Image copyright Getty Images

మంత్రులెవ్వరూ ఇప్పుడు 'స్మార్ట్ సిటీ', 'మేక్ ఇన్ ఇండియా', 'డిజిటల్ ఇండియా', 'స్కిల్ ఇండియా' వంటి గొప్ప పథకాల ఊసెత్తడం లేదు. పైపెచ్చు అగస్ట్ నుంచి 'సంకల్ప్ సే సిద్ధి' అనే కొత్త నినాదాన్నిఎత్తుకున్నారు. 2022 నాటికి 'న్యూ ఇండియా'ను సాధిస్తామని చెప్పడం మొదలైంది. నిజానికి ప్రస్తుత ప్రభుత్వ కాలావధి 2019 నాటికే పూర్తవుతుంది.

అంటే 2019 ఎన్నికల పట్ల ప్రభుత్వం అతి ఆత్మవిశ్వాసంతో ఉందనుకోవాలా లేక 2022 వరకు ఎక్కువ ఆశలు పెట్టుకోనక్కర లేదని అది అంగీకరిస్తోందనుకోవాలా?

అంతా బ్రహ్మాండంగా ఉందనే నెరేటివ్

సెప్టెంబరు నెల మోదీ ప్రభుత్వానికి వరుసగా క‌ష్టాలు తీసుకొచ్చింది. అంతకు ముందు వరకు విమర్శల్ని కొట్టిపారెయ్యడం, 'అంతా బ్రహ్మాండంగా ఉంది' అనే భావ‌న‌ను ముందుకు తేవడంలో ప్రభుత్వం పూర్తిగా విజయవంతమైంది.

మొదటి మూడేళ్ల కాలం నోట్ల రద్దు, సర్జికల్ స్ట్రైక్స్, లవ్ జిహాద్, యాంటీ రోమియో దళాలు, గోహత్య, దేశభక్తి, వందేమాతరం, 'కశ్మీర్‌లో దేశవ్యతిరేక కార్యకలాపాలకు దీటైన జవాబు', ప్రధాని 'అతిగా సఫలమైన' విదేశీ యాత్రలతోనే గడచిపోయింది. ఈ కాలమంతా ఈ అంశాలన్నింటిలో కథను ఎలా ముందుకు నడిపించాలనే విషయంపై ప్రభుత్వం పూర్తి పట్టుతో వ్యవహ‌రించింది. కానీ సెప్టెంబరు తర్వాత నుంచి వరుసగా అనూహ్యమైన సమస్యలు ఎదుర‌య్యాయి.

Image copyright Getty Images

గోరఖ్‌పూర్‌లో పసిపిల్లల మరణాలు, రాంరహీం అరెస్టు సమయంలో పాలనా వ్యవస్థ వైఫల్యం, భయంకరమైన నిరుద్యోగ సమస్య, నోట్లరద్దు వైఫల్యంపై రిజర్వ్ బ్యాంక్ ప్రకటన, జీడీపీలో తగ్గుదల, పెట్రో ధరల పట్ల వ్యతిరేకత, వరుస రైలు ప్రమాదాలు, జీఎస్టీపై ఆక్రోశం... ఇవన్నీ ప్రభుత్వం దాచేసినా దాగని వాస్తవాలు. బహుశా అందుకే ఇవన్నీ కొద్ది రోజుల్లోనే చాలా వేగంగా ముందుకొచ్చాయి.

ఇంకా ఏమైనా మిగిలి ఉంటే ఆ కొరతను సొంత గూటికే చెందిన యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, కీర్తి ఆజాద్, శత్రుఘ్న సిన్హా వంటి వారు తమ బహిరంగ విమర్శలతో పూర్తి చేశారు.

ఇన్ని జరుగుతున్నా రాజీనామాలు కాదు కదా ప్రభుత్వం నుంచి కనీస సానుభూతి, సంవేదన సైతం వెలువడలేదు. ఎందుకంటే అలా చేస్తే అది తమ బలహీనతకు సంకేతం అవుతుందని వారి నమ్మకం. చివ‌రికి బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో అమ్మాయిలపై లాఠీచార్జి తర్వాత కూడా ఆ వీసీని బహిరంగంగా పదవిలోంచి తొలగించే సాహసం ప్రభుత్వం చేయలేదు.

'ప్రతి సెప్టెంబరులో పిల్లలు ఎలాగూ చనిపోతారు' అన్న ఉత్తరప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సిద్ధార్థ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలే కావచ్చు, లేదా నిరుద్యోగంపై జరుగుతున్న చర్చలో భాగంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన 'ఇది మంచికే సంకేతం' అన్న వ్యాఖ్య కావచ్చు.. ఇవన్నీ అంతా బ్రహ్మాండంగా ఉందనే నెరేటివ్‌ను బలంగా ముందుకు తీసుకెళ్లడానికే ప్రభుత్వం కట్టుబడి ఉందనటానికి సంకేతం.

గోరఖ్‌పూర్‌లో పసిపిల్లల మరణాల పట్ల సానుభూతి ప్రకటన కావచ్చు, అఖ్లాక్ హత్యను ఖండించడం కావచ్చు లేదా గౌరీ లంకేశ్ హత్య తర్వాత ఆమె పట్ల అసభ్యకరమైన భాషను ఉపయోగించిన వారిని అన్‌ఫాలో చేయడం కావచ్చు లేదా ఖట్టర్, యోగీ, ప్రభులు రాజీనామా చేయాలనే డిమాండ్ కావచ్చు.. ఈ అన్ని సందర్భాల్లోనూ మోదీ తాను ఏది చేసినా తన ఇష్ట ప్రకారం మాత్రమే చేస్తారు తప్ప ఇతరుల కోరిక ప్రకారం కాదు అనే చూపించారు. ఆయన దృష్టిలో ఇది ప్రభుత్వ బలానికి సంకేతం.

మార్పుకు సంకేతం

అయితే పరిస్థితుల్లో వస్తున్న మార్పుల్ని ప్రభుత్వం చూడలేకపోతోందనుకోవడం సరికాదు. ఇటీవల జీఎస్టీలో చేసిన మార్పులు, చమురు ధరలపై కేంద్ర ఎక్సైజ్ సుంకంలో లీటరుకు 2 రూపాయలు త‌గ్గించ‌డం.. ఇవి రెండూ ప్రజల ఒత్తిడితో ప్రభుత్వం చేపట్టిన రెండు చర్యలని చెప్పొచ్చు.

గుజరాత్ వ్యాపారుల నిరసనను పరిగణనలోకి తీసుకొనే ప్రభుత్వం జీఎస్టీలో కొన్ని రాయితీలిచ్చిందని భావిస్తున్నారు. అంతకు ముందు సూరత్, రాజ్‌కోట్ వంటి పెద్ద నగరాల్లో వ్యాపారులు భారీ ప్రదర్శనలు నిర్వహించిన‌ విషయం తెలిసిందే.

త్వరలో గుజరాత్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రంలో బీజేపీ చాలా ఏళ్లుగా అధికారంలో ఉంది. ప్రతిపక్షం చాలా బలహీనంగా ఉంది. రాహుల్ గాంధీ చాలా ర్యాలీలు నిర్వహించారు. పటేళ్లు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. దళితులు కూడా బీజేపీకి మద్దతునిచ్చే అవకాశం లేదు.

Image copyright Getty Images

ఇవన్నీ ఇలా ఉన్నప్పటికీ గుజరాత్‌లో బీజేపీనే బలంగా ఉంది. అది ఓడిపోవచ్చని ఎవ్వరూ జోస్యం చెప్పడం లేదు. అయితే ఒక్కటి మాత్రం నిజం - ఇద్దరు శక్తిమంతమైన వ్యక్తుల సొంత రాష్ట్రంలో రాబోయే ఫలితాలు వారి భవిష్యత్తు వ్యూహాన్ని మాత్రం తప్పక ప్రభావితం చేస్తాయి.

గుజరాత్‌ ఎన్నికలలో గెలుపు సాధించడానికి బీజేపీ.. అభివృద్ధికి పిచ్చి పట్టలేదని నిరూపించేందుకు ప్రయత్నిస్తుంది. అయితే 'సంకల్ప్ సే సిద్ధి' అనే కొత్త నినాదంపై ప్రజల విశ్వాసాన్ని పెంచాలంటే అది మరింత ఎక్కువగా కష్టపడాలనేది మాత్రం స్పష్టం.

మోదీ పాత నినాదాలు ఇప్పుడు మునుపటి 500, 1000 రూపాయల నోట్ల లాగా ఏమీ మారిపోనప్పటికీ, వాటిని రెండు చేతులతో ఆహ్వానించేవారి సంఖ్య మాత్రం బాగా త‌గ్గిపోతున్న‌ట్లు కనిపిస్తోంది. అభివృద్ధి, హిందుత్వ అనే అపూర్వ కాంబినేషన్‌ ఫలితంగా 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ.. ఒత్తిళ్లు ఎదురైనప్పుడు హిందుత్వ అజెండాను కొత్త రెండు వేల రూపాయల నోటు లాగా ముందుకు తీసుకొస్తారా లేదా అన్నదే అతి పెద్ద ప్రశ్న.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)