పదేళ్ల బాలిక రేప్ కేసు: ఆ బిడ్డకు తండ్రి 'రెండో అంకుల్'

  • 10 అక్టోబర్ 2017
Stop word Image copyright Getty Images
చిత్రం శీర్షిక బాలికలను రేప్ చేసేవారిలో సగం మందికి పైగా బాధిత బాలికలకు బాగా తెలిసిన వారే ఉన్నట్లు చెప్తున్నారు

అత్యాచారానికి గురై శిశువుకు జన్మనిచ్చిన పదేళ్ల బాలిక కేసు మరో మలుపు తిరిగింది. ’’ఆ బాలిక జన్మనిచ్చిన శిశువు డీఎన్ఏ నమూనా బాలికకు చెందిన మరో అంకుల్ డీఎన్ఏతో సరిపోయింది'' అని చండీగఢ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నీలాంబరి విజయ్ బీబీసీకి తెలిపారు.

పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసిన అతడిని కూడా నిందితుడిగా చేర్చుతూ అత్యాచారం కేసు నమోదు చేస్తున్నట్లు ఆమె చెప్పారు. తనపై అత్యాచారం చేసినట్టు బాలిక మొదట చెప్పిన నిందితుని మీద కూడా కేసు కొనసాగుతుందన్నారు.

ఈ పదేళ్ల బాలిక జూలైలో తనకు కడుపులో నొప్పిగా ఉందని చెప్పగా.. తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రకి తీసుకెళ్లారు. అప్పుడు ఈ బాలిక గర్భం దాల్చినట్లు తెలిసింది. దీంతో ఆమె అత్యాచారానికి గురైన విషయం వెలుగులోకి వచ్చింది.

బాలిక గర్భస్రావానికి చండీగఢ్ స్థానిక కోర్టు నిరాకరించింది. గర్భస్రావం చేస్తే ఆ బాలిక ప్రాణాలకే ప్రమాదమని చెప్పడంతో సుప్రీంకోర్టు కూడా అబార్షన్‌కు నిరాకరించింది. బాధితురాలు గత ఆగస్టులో ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువును శిశు సంరక్షణ అధికారులకు అప్పగించారు.

తన అంకుల్ గత ఏడు నెలలుగా తనను పలుమార్లు రేప్ చేశాడని ఈ బాలిక పోలీసులు, శిశు సంరక్షణ అధికారులకు తెలిపింది. దీంతో 40 ఏళ్లకుపైగా వయసున్న ఆమె అంకుల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు నేరాన్ని అంగీకరించాడని పోలీసులు చెప్పారు.

అయితే.. ఆ బాలిక జన్మనిచ్చిన శిశువు డీఎన్ఏ నమూనాను పోలీసులు అరెస్ట్ చేసిన ఆమె అంకుల్ డీఎన్ఏతో పోల్చినపుడు అది మ్యాచ్ కాలేదు. పోలీసులు దర్యాప్తు చేసి అతడి సోదరుడిని కూడా అరెస్ట్ చేశారు. బాలిక మరో అంకుల్ అయిన ఇతడి డీఎన్ఏ నమూనాను పరిశీలించినపుడు అతడే ఆ శిశువుకు తండ్రని తేలింది.

Image copyright AFP
చిత్రం శీర్షిక 2015లో 10 వేల మందికి పైగా బాలికలు అత్యాచారానికి గురయ్యారు

బాలికలపై అత్యాచారాల పరంపర...

భారతదేశంలో చట్టం ప్రకారం 20 వారాలు దాటితే గర్భస్రావం చేయడానికి వీల్లేదు. తల్లి ప్రాణాలకు ముప్పున్నట్లు వైద్యులు నిర్ధరిస్తే తప్ప 20 వారాలు నిండిన గర్భణికి అబార్షన్ చేయరు.

కానీ పలు సందర్భాల్లో బాలికలు అత్యాచారానికి గురవడం.. వారు గర్భం దాల్చినట్లు ఆలస్యంగా గుర్తించడం తదితర కారణాల వల్ల ఇటీవల 20 వారాలు దాటాక కూడా అబార్షన్ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టుకు పలు పిటిషన్లు వచ్చాయి.

ఈ నెల మొదట్లో ముంబయికి చెందిన 13 ఏళ్ల బాలిక 32 వారాల గర్భంతో ఉండగా అబార్షన్‌కు కోర్టు అనుమతించింది. మే నెలలో హరియాణాలోనూ ఇలాంటి కేసు నమోదైంది. ఆ బాలిక 20 వారాల గర్భంతో ఉండగా అబార్షన్‌కు కోర్టు అనుమతించింది.


తెలిసిన వారే కాటేస్తున్నారు...

  • ప్రతి 155 నిమిషాలకోసారి ఒక 16 ఏళ్ల లోపు బాలిక వేధింపులకు గురవుతోంది.
  • ప్రతి 13 గంటలకోసారి ఒక 10 ఏళ్ల లోపు బాలికను వేధిస్తున్నారు.
  • 2015లో 10 వేల మందికి పైగా బాలికలు అత్యాచారానికి గురయ్యారు.
  • 53.22 శాతం మంది బాలికలు లైంగిక వేధింపులకు గురైనట్లు ఓ అధ్యయనంలో తెలిపారు.
  • బాలికలపై వేధింపులకు పాల్పడుతున్నవారిలో 50 శాతం మంది వారికి తెలిసినవారే.

ఆధారం: భారత ప్రభుత్వం, యూనిసెఫ్


న్యాయం కోసం 26 ఏళ్లుగా..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)