సోషల్ మీడియా... నిద్ర రాదయా!

నిద్ర, sleep, గ్యాడ్జెట్, gadget

ఫొటో సోర్స్, Getty Images

మానవ జీవితంలో సోషల్ మీడియా వరమా, శాపమా అనే ప్రశ్నను అటుంచితే రాత్రి సమయంలో గంటల కొద్దీ సోషల్ మీడియా వినియోగం నిద్రపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు వెల్లడించారు.

సోషల్ మీడియా అతి వినియోగంతో రాత్రిపూట చాలామందికి నిద్ర కరవవుతోంది, అది ఆరోగ్యానికి ఎంతో హానికరమని హెచ్చరిస్తున్నారు.

అమెరికాలో దాదాపు 48 శాతం మంది నిద్రకు ముందు టాబ్లెట్ లేదా ల్యాప్‌టాప్ వంటి గాడ్జెట్లను ఉపయోగిస్తారని, అది నిద్రపై చాలా ప్రభావం చూపుతోందని అమెరికా నేషనల్ స్లీప్ ఫౌండేషన్ తెలిపింది.

సోషల్ మీడియాను అతిగా వినియోగిస్తున్న వారిలో యువతే అధికంగా ఉంటున్నారని పలు దేశాల్లో జరిపిన అధ్యయనాల ద్వారా వెల్లడైంది.

ఫొటో సోర్స్, Getty Images

ఎన్నోఅనర్థాలు

రాత్రివేళ ఎక్కువసేపు సోషల్ మీడియాలో గడిపితే అది మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తోందని పలు అధ్యయనాల్లో తేలింది. ఈ అలవాటే నిద్రపోయిన తర్వాత మేల్కొనడానికి, సరిగా నిద్ర పట్టకపోవడానికి కారణమవుతుంది.

పనితీరుపై ప్రభావం

రాత్రివేళల్లో అతిగా సోషల్ మీడియా వాడకంతో ఉద్యోగుల పని సామర్థ్యం కూడా తగ్గుతుంది. గాడ్జెట్ల అతి వినియోగం వారిలో ఒత్తిడిని పెంచుతుందని, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఫొటో సోర్స్, Alamy

కరవవుతున్న నిద్ర

నిద్ర పోయేముందు ఒక పుస్తకం చదవడానికీ, సోషల్ మీడియాను తిరగేయడానికి మధ్య చాలా తేడా ఉంది. రోజంతా కలిగిన ఒత్తిడి నుండి మెదడు ఉపశమనం పొంది మనకు నిద్రపట్టాలంటే అరగంట లేదా ఒక గంట పడుతుంది. అది పూర్తిగా మెదడుకు ప్రశాంతతనిచ్చే సమయం.

ఒక గ్లాసు వేడిపాలు తాగితే అది ప్రశాంత నిద్రకు మరింత తోడ్పడుతుంది. కానీ.. గాడ్జెట్ల వాడకం వల్ల ఆ ప్రశాంతత లేకుండా పోతోంది.

"చాలా మందికి గాడ్జెట్ల కారణంగా ప్రశాంతత కరవవుతోంది. దాంతో నిద్రకు ఆటంకం ఏర్పడుతోంది" అని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని న్యూరోసైన్స్, సైకాలజీ ప్రొఫెసర్ మాథ్యూ వాకర్ అన్నారు.

"నిద్రపోయే ముందు ఫేస్‌బుక్ లేదా వాట్సాప్‌పై ఎదో ఒక మెసేజ్ వస్తుండటం చూస్తుంటాము. దానికి జవాబు ఇవ్వడానికో, లేదా దాని గురించి ఆలోచించడానికో 20-30 నిమిషాలు అక్కడే అయిపోతాయి. తర్వాత అవతలివైపు నుండి స్పందనల కోసం ఎదురుచూస్తాము. అప్పుడు నాడీ వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. చివరికీ అదే ఫోన్‌ను పక్కనే పెట్టుకొని పడుకుంటాము. అప్పుడు వచ్చే ప్రతీ మెసేజ్ శబ్దం నిద్రను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది." అని ప్రొఫెసర్ మాథ్యూ వాకర్ తెలిపారు.

గాడ్జెట్ల నుంచి వెలువడే నీలి కాంతి కిరణాలు నిద్ర పోయేందుకు సహాయపడే ‘మెలటోనిన్’ హార్మోన్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని, దీంతో జీవ గడియారంపై భారం పడుతుందని నిపుణులు అంటున్నారు.

కింగ్స్ కాలేజ్ లండన్‌కు చెందిన మానసిక శాస్త్ర నిపుణుడు బెన్ కార్టర్, గత కొన్నేళ్లుగా "నిద్ర మీద సాంకేతిక పరికరాల ప్రభావం" అనే అంశంపై అధ్యయనం చేస్తున్నారు. మంచానికి దగ్గరలో ఒక పోర్టబుల్ ఎలక్ట్రానిక్ పరికరముంటే సరిగా నిద్ర పట్టదని ఆయన వెల్లడించారు. ఇది చిన్న పిల్లలకూ వర్తిస్తుందని తెలిపారు.

ఫొటో సోర్స్, Alamy

గాడ్జెట్ల వ్యసనం

గాడ్జెట్ల వ్యసనాన్ని వదిలించుకోవడం అంత సులభం కాదని ఆయన అంటున్నారు. "నిద్రకు ముందు మొబైల్ చూసి, ఉదయం లేచిన వెంటనే మళ్లీ చూస్తున్నారంటే మీరు కూడా గ్యాడ్జెట్లకు బానిస అన్నట్లే" అని బెన్ కార్టర్ అన్నారు.

అమెరికన్లు 6 గంటలే నిద్రపోతున్నారు

అమెరికాలో 7 కోట్ల మంది రాత్రి 6 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారు. దాంతో వారు పనిలో దృష్టిని కేంద్రీకరించలేకపోతున్నారని అమెరికన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సెంటర్ తెలిపింది. నిద్రలేమితో మతిమరపు, రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని హెచ్చరించింది.

ఫొటో సోర్స్, Getty Images

గుండె జబ్బు, ఊబకాయం, మధుమేహం

"ప్రధాన ఆరోగ్య సమస్యల్లో నిద్రలేమి ఒకటి. అయితే దీనిపై చర్చ చాలా తక్కువగా జరుగుతోంది. సరిపడా నిద్రలేకపోతే గుండె జబ్బులు, ఊబకాయం, మధుమేహం వచ్చే ప్రమాదముంది" అని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో స్లీప్ మెడిసిన్ ప్రొఫెసర్ కోలిన్ ఎస్పీ అన్నారు.

‘‘నిద్ర పట్టని వారి కోసం కొన్ని గ్యాడ్జెట్లు ఉన్నాయి. వాటి సహాయంతో హాయిగా నిద్రపోవచ్చు" అని సూచించారు.

"భవిష్యత్తులో ప్రతి వ్యక్తీ కంటినిండా నిద్ర పోయేలా చేసే సాంకేతికత రావొచ్చు. రేపు ఏ పనులు చేయాలో, వాటికనుగుణంగా ఎన్నిగంటలు, ఎంత తొందరగా నిద్రపోవాలో చెప్పే పరికరాలు అందుబాటులోకి రావచ్చు." అని మాథ్యూ వాకర్ తెలిపారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)