ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాయాజాలం తగ్గుతోందా?

  • 13 అక్టోబర్ 2017
నరేంద్ర మోదీ Image copyright Sean Gallup/Getty Images

ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ ‘దేశం కోసం విషాన్ని సేవించాను' అని చెప్పుకొచ్చారు. కొన్ని శక్తులు తనపై విషం కక్కుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

సంస్కరణలు తెస్తామనీ, ఉపాధి అవకాశాలు సృష్టిస్తామన్న హామీలతో మోదీ గత ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు.

కానీ, ఒకవైపు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పైకి ఎగబాకుతుంటే, ఆయన హయాంలో భారత్ మాత్రం నేలచూపులు చూస్తోంది. వృద్ధిరేటు మందగించింది. ఉపాధి కల్పన ఆగిపోయింది.

నల్లధనాన్ని వెలికితీయడానికి అంటూ మోదీ గత నవంబర్‌లో పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. దాని కారణంగా అభివృద్ధి మందగించింది. సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

దేశం అంతా ఒకే పన్ను విధానం కోసం జులైలో తీసుకొచ్చిన జీఎస్టీ కూడా బెడిసికొట్టినట్లే కనిపిస్తోంది. దానిని సరిగా అమలు చేయకపోవడంతో అనేక వ్యాపారాలు దెబ్బతిన్నాయి. జీఎస్టీ పేరుతో ఆదాయపన్ను శాఖ వర్తకులను ముప్పుతిప్పలు పెట్టింది.

సొంతింటి నుంచే విమర్శలు

మూడేళ్ల పాలన తర్వాత మోదీ ప్రభుత్వం మొదటిసారిగా విమర్శలను ఎదుర్కొంటోంది.

ఆర్థికవ్యవస్థ మందగమనంపై బీజేపీ నేత, మాజీ ఆర్థికమంత్రి యశ్వంత్ సిన్హా ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శించారు.

ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు చెందిన రాహుల్ గాంధీ ఎన్నడూ లేని విధంగా అధికార పార్టీపై విరుచుకుపడుతున్నారు.

Image copyright ARUN SANKAR/Getty Images
చిత్రం శీర్షిక గోరక్షకుల దాడులపై దేశవ్యాప్త నిరసన

ఆ నాలుగు కలిసొచ్చాయా?

అయితే అనుకోని ఓ నాలుగు సంఘటనలు మోదీకి బాగా కలిసొచ్చాయి.

మొదటిది - గతంలో ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. భారత్ ఎక్కువగా దిగుమతి చేసుకునేది చమురే. భారత ఆర్థిక వ్యవస్థ పురోగతికి ఇది ఉపయోగపడుతోంది.

రెండోది - దేశంలోని ప్రధాన వార్తాసంస్థలన్నీ సర్కారు ఇచ్చే వాణిజ్య ప్రకటనల మీదే ఆధారపడుతున్నాయి. దీంతో అవి కేంద్రంపై ఎక్కువగా విమర్శలు చేయలేకపోతున్నాయి.

మూడోది - సొంతపార్టీలో మోదీకి ఎదురు నిలిచే నాయకుడు ఎవరూ లేకపోవడం.

ఇక నాల్గోది, అత్యంత ముఖ్యమైంది - ప్రధాన ప్రతిపక్షం చీలికలు పేలికలై అత్యంత బలహీనంగా ఉండటం.

అయినా సరే.. మోదీకి వ్యతిరేకంగా నిరసన గళాలు వినిపిస్తూనే ఉన్నాయి.

మోదీ వీరాభిమానులు, మద్దతుదారులు, కాషాయదళ కార్యకర్తలు సోషల్ మీడియాలో ప్రధానికి అనుకూలంగా చెలరేగుతున్నప్పటికీ.. ఆయనకు చురకలు తగులుతూనే ఉన్నాయి.

మోదీ హయాంలో దేశంలో గోమాంసం తినేవారిని, అమ్మేవారిని చితకబాదడం ఓ ఉన్మాదంగా మారిపోయింది. హిందూ అతివాదుల ఆగడాలతో యువత, పట్టణవాసులు భయపడే పరిస్థితి నెలకొంది.

వీటన్నిటికి తోడు.. ఓ అతివాద హిందువు, ముస్లిం వ్యతిరేకిగా ముద్రపడ్డ యోగి ఆదిత్యనాథ్‌ను దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం అయిన ఉత్తరప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా నియమించింది. దేశంలోని ముస్లింలలో దాదాపు ఐదో వంతు ఈ రాష్ట్రంలోనే ఉన్నారు.

Image copyright ANURAG
చిత్రం శీర్షిక బీహెచ్‌యూ విద్యార్థినుల ఆందోళన

బీజేపీ, యువత మధ్య పెరుగుతున్న దూరం!

2014 ఎన్నికల్లో యువ ఓటర్లు మోదీని బాగానే ఆదరించారు. కానీ, మోదీకి మద్దతు పలికే యువత సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్లుంది.

ఇటీవల దిల్లీ, హైదరాబాద్ విశ్వవిద్యాలయాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘాలు ఓటమి చవిచూశాయి.

గత నెల మోదీ సొంత నియోజకవర్గం వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఆందోళనలు చెలరేగాయి. అక్కడ మహిళా విద్యార్థినులను పోలీసులు తీవ్రంగా కొట్టారు.

ఇలాంటి ఘటనలు మోదీని, ఆయన పార్టీని యువత నుంచి దూరం చేస్తున్నాయి.

బీజేపీకి సైద్ధాంతిక మూలస్తంభంగా భావించే ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంలో మోదీ చిక్కుకున్నారని విమర్శకులు భావిస్తున్నారు.

ఆర్థికవ్యవస్థపై మోదీ పట్టు కోల్పోయారా?

'మోదీ అనుకున్నంత విప్లవాత్మక సంస్కర్త కారు' అని ఎకనామిస్ట్ పత్రిక గత జూన్‌లో పేర్కొంది. ఆయనకు జీఎస్టీలాంటి కొన్ని పెద్ద ఆలోచనలు ఉన్నప్పటికీ, అవన్నీ గత కాంగ్రెస్ పాలనలోనే రూపుదిద్దుకున్నాయని వివరించింది.

అయితే, ఆర్థికవ్యవస్థను చక్కదిద్దే అవకాశం మోదీకి ఇంకా ఉందని డాక్టర్ చక్రవర్తిలాంటి ఆర్థికవేత్తలు విశ్వసిస్తున్నారు.

మోదీ పాలనకు బలమైన ఎదురుగాలి వీస్తోందని ఇప్పుడే చెప్పడం తొందరపాటు చర్యే అవుతుంది. ఆగస్టులో నిర్వహించిన ఒక ప్రజాభిప్రాయ సేకరణలో, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మోదీనే ఘనవిజయం సాధిస్తారని తేలింది.

Image copyright Kevin Frayer/Getty Images

గుజరాత్‌ గాలి ఎటు?

బీజేపీ పాలిత గుజరాత్‌లో డిసెంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి.

సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ ( సీఎస్‌డీఎస్) ఇటీవల ఆ రాష్ట్రంలో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో జీఎస్టీపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని తేలింది.

దాని వల్ల బీజేపీ ఓడిపోకపోవచ్చు కానీ, మెజారిటీ మాత్రం తగ్గొచ్చు అని తేలింది.

కష్టపడే తత్వం, నిజాయితీ కలిగిన ప్రధానిగా మోదీకి తన సహచరుల్లో పేరుంది.

ప్రజల ఆగ్రహాన్ని మోదీ తన వ్యక్తిగత ప్రతిష్ట, విశ్వసనీయతతో ఎంతవరకు ఆపగలరనేది ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న.

''ప్రజల అసంతృప్తి తుపానుగా మారకపోవడానికి రెండు కారణాలున్నాయి. బీజేపీకి సరైన ప్రత్యామ్నాయం లేకపోవడం మొదటిది. మోదీకి వ్యక్తిగతంగా ఉన్న ప్రతిష్ట రెండోది'' అని రాజకీయ విమర్శకులు సంజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

భారతీయ ఓటర్లు చాలా చంచల స్వభావం కలవారు. కార్యదక్షులైన మోదీకి ఇది బాగా తెలుసు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ఈ కథనం గురించి మరింత సమాచారం