అమరావతి అసెంబ్లీ కోసం సినిమా సెట్టింగ్!

ఫొటో సోర్స్, STR/AFP/Getty Images
అమరావతి అసెంబ్లీలో సినిమా సెట్టింగ్ వేయాలా... సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఫేస్బుక్ పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారింది. ఇదీ ఆయన పెట్టిన పోస్ట్.
ఫొటో సోర్స్, Facebook
"అసెంబ్లీ గొప్పగా ఉండాలంటూ కోట్లు ఖర్చుచేయడం దేనికి? అసెంబ్లీ సమావేశాల బ్యాక్‌గ్రౌండ్‌లో గ్రీన్ మ్యాట్ ఉపయోగిస్తే మీరు కోరుకున్న గ్రాఫిక్స్ వేసి రాజమౌళి దాన్ని అద్భుతంగా చూపిస్తారు కదా! ప్రపంచంలోనే ఎక్కడా లేనంత ఘనమైన అసెంబ్లీని చూడొచ్చు. అసెంబ్లీల్లోనే బాహుబలి అనిపించుకోవచ్చు.’’ అనే సారాంశంతో వ్యంగ్యంగా చేసిన కామెంట్. ఒక రకంగా రాజధాని నిర్మాణానికి రాజమౌళి సలహా తీసుకోవాలి అని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించుకోవడం మీద కూడా సెటైర్‌గా భావించొచ్చు.
అమరావతికి సంబంధించి అందులోనూ అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు సంబంధించి ఇలాంటి కామెంట్లు కొత్తేమీ కాదు. ఈ సందడీ- అలజడీ ఇప్పట్లో సద్దుమణిగేట్టేమీ కనిపించడం లేదు.
నిర్మాణ రూపురేఖలపై ఇప్పటికే అనేక మోడళ్లు ప్రచారంలో ఉన్నాయి. అసెంబ్లీ, హైకోర్ట్ భవనాలు ఇలా ఉండబోతున్నాయి అంటూ కొన్ని ఫొటోషాప్ బొమ్మలు ప్రచారంలోకి రావడం జనాలు సోషల్ మీడియాలోనూ ఇతరత్రా కామెంట్స్ చేయడం చాలారోజులుగా సాగుతూనే ఉంది. రాజకీయ వివాదాలు సరేసరి!
ప్రభుత్వం అంతర్జాతీయ సంస్థల నుంచి మోడళ్లు సేకరించి మీడియాకు విడుదల చేసినప్పుడల్లా ఆ ప్రయత్నాలకు అనుకూలంగా ప్రతికూలంగా బోలెడంత ప్రచారం ఇంటా బయటా సాగుతున్నది. ప్రత్యేకించి రాజధాని నిర్మాణానికి సినీ దర్శకులు రాజమౌళి సలహాలు తీసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత, రాజమౌళి ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత ఆ నిర్ణయానికి అటూ ఇటూ సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ సాగుతున్నది.
నెటిజన్ల క్రియేటివిటీ కొత్త పుంతలు తొక్కి సోషల్ మీడియాకు ఎక్కుతున్నది. తనవంతుగా ఇపుడు వర్మ కూడా ఈ సోషల్ మీడియా సందడికి ఆజ్యం పోశారు అని చెప్పుకోవచ్చు.
సోషల్ మీడియాలో దీనిపై పోస్ట్ అయిన కొన్ని కామెంట్లు...
ఆర్జీవీ, ఇలాంటి సలహాలు దయచేసి ఇవ్వద్దు. ఎందుకంటే బాహుబలి అసెంబ్లీ అంటే భారీ బడ్జెట్ సినిమా, అంతే కాదు ఎన్నో వారాలు పడుతుంది. దీనికి ప్రజలే మూల్యం చెల్లించాలి.
ఫొటో సోర్స్, Facebook
ఇది చాలా మంచి ఆలోచన. అసెంబ్లీ భవనం ఎందుకు? సినిమా వాళ్లు అన్నీ గ్రాఫిక్స్‌లో రూపొందించేస్తే... ఇంజనీర్ల అవసరం కూడా ఉండదు.
ఫొటో సోర్స్, Facebook
ఆ ప్లాన్ రాజమౌళితో కాకుండా చంద్రబాబు మీతో చేసి ఉంటే డబ్బు వృథా కాదు, మీతో చేయలేదు కాబట్టే డబ్బు వృథా చేస్తున్నట్లా?
ఫొటో సోర్స్, Facebook
జనాలకి నచ్చని సినిమాలు తీసే మీరు ముందు రిటైర్ అవ్వండి. ఇంక సినిమాలు తియ్యవద్దు.
ఫొటో సోర్స్, Facebook
బాగుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా గ్రాఫిక్స్‌లో చూపించవచ్చు.
ఫొటో సోర్స్, Facebook
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)