ఆడపిల్లల చదువుకు అనుకూలంగా లేని 10 దేశాలు

సిరియాలో శిధిలాల మధ్య స్కూల్‌కి వెళ్తున్నబాలిక

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

దాదాపు అన్ని దేశాలనూ టీచర్ల కొరత వేధిస్తోంది

పదేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఆడపిల్లల చదువు విషయంలో ఎలాంటి మార్పూ రాలేదు. లక్షల మంది బాలికలు ఇప్పటికీ పాఠశాల మొహం చూడలేకపోతున్నారని ఐక్యరాజ్య సమితి నివేదికలు చెబుతున్నాయి.

అరవై కోట్ల మంది విద్యార్థులు స్కూళ్లకు వెళ్తున్నా, వాళ్లక్కడ ఏమీ నేర్చుకోవట్లేదనీ, అనేక దేశాల్లో విద్యా ప్రమాణాలు మరీ తీసికట్టుగా మారాయనీ ఐరాస స్పష్టం చేస్తోంది.

ఓ పక్క అభివ‌ృద్ధి చెందిన దేశాల్లో ఆడపిల్లలు చదువులో దూసుకెళ్తున్నారు. మరోపక్క పేద దేశాల్లో బాలికలు పాఠశాల మెట్లెక్కడమే అదృష్టంగా భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆడపిల్లల చదువుకి ఏమాత్రం అనుకూలంగా లేని టాప్ టెన్ దేశాల జాబితాను ‘వన్ క్యాంపైన్’ అనే సంస్థ రూపొందించింది.

అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా దాన్ని విడుదల చేసింది.

ఫొటో సోర్స్, Unicef

ఫొటో క్యాప్షన్,

అమ్మాయిల చదువుకి ఏమాత్రం అనుకూలంగా లేని దేశంగా సౌత్ సూడాన్ నిలిచింది

జాబితాలో ఉన్న దేశాల్లో ఎక్కువ శాతం పేదరికం, పౌష్టికాహార లోపం, అనారోగ్య పరిస్థితులూ, అంతర్గత యుద్ధాల లాంటి సమస్యలతో సతమతమవుతున్నవే. ఈ పరిణామాలన్నీ కలిసి ఆ దేశాల్లో ఆడపిల్లలను చదువుకు పూర్తిగా దూరం చేస్తున్నాయి.

అక్కడ బాలికలను పాఠశాలకంటే పనులకు పంపించడానికే తల్లిదండ్రులు ప్రాధాన్యమిస్తున్నారు. ఇంకొందరైతే చిన్న వయసులోనే వారికి పెళ్లిళ్లు చేసి చదువుకోవాలన్న వారి కోరికపై నీళ్లు జల్లుతున్నారు.

ప్రాథమిక విద్య, హైస్కూల్, కాలేజీల చదువు పూర్తి చేసిన అమ్మాయిలు, ఆడవాళ్ల అక్షరాస్యత శాతం, టీచర్లూ విద్యార్థుల నిష్పత్తి, విద్యారంగంలో పెట్టుబడులు లాంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని ‘వన్ క్యాంపైన్’ సంస్థ ఆడపిల్లల చదువుకు అనుకూలంగా లేని దేశాల జాబితాను సిద్ధం చేసింది. సిరియాలాంటి కొన్ని దేశాలకూ ఆ జాబితాలో చేరే అవకాశం ఉన్నా, సరిపడా గణాంకాలు లేని కారణంగా వాటిని చేర్చలేదు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

నైగర్‌లో ప్రతి ఐదుగురు మహిళల్లో నలుగురు నిరక్షరాస్యులే

ఇవే ఆ దేశాలు

1. సౌత్ సూడాన్: ఆరేళ్ల క్రితం స్వాతంత్ర్యాన్ని సాధించిన ఈ చిన్న దేశం అంతర్గత సమస్యలతో సతమతమవుతోంది. యుద్ధం, హింస కారణంగా ఇక్కడ ఎన్నో స్కూళ్లు నేలమట్టమయ్యాయి. ఇక్కడ మూడొంతుల మంది ఆడపిల్లలు కనీసం ప్రైమరీ స్కూళ్లో కూడా అడుగుపెట్టరు.

2.సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్: ఇక్కడ ప్రతి ఎనభై మంది విద్యార్థులకు ఒక టీచరే ఉన్నారు.

3. నైగర్: 15-24 మధ్య వయసున్న యువతుల్లో పదిహేడు శాతం మందే చదువుకున్నారు.

4. అఫ్గానిస్థాన్: లింగ వివక్ష ఎక్కువ.

5.చాద్: సామాజిక, ఆర్థిక పరిమితుల కారణంగా ఆడపిల్ల చదువుకోవడం చాలా కష్టం.

6. మాలి: కేవలం 38శాతం అమ్మాయిలే ప్రాథమిక విద్యను పూర్తి చేస్తున్నారు.

7. గినియా: ఇక్కడ పాతికేళ్లు దాటిన మహిళలు సగటున ఏడాది పాటు కూడా చదువుకోలేదు.

8. బర్కినా ఫాసో: కేవలం 1శాతం బాలికలే హైస్కూల్ విద్యను పూర్తి చేస్తున్నారు.

9. లైబీరియా: దాదాపు మూడులో రెండొంతుల మంది బాలికలు ప్రాథమిక విద్యకు దూరమయ్యారు.

10. ఇథియోపియా: ప్రతి ఐదుగురిలో ఇద్దరికి పద్దెనిమిదేళ్లలోపే పెళ్లి చేస్తున్నారు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

అంతర్గత సమస్యల కారణంగా సౌత్ సూదాన్ అభివృద్ధి క్షీణించింది

దాదాపు అన్ని దేశాల్లో సరిపడా టీచర్లు లేకపోవడం ప్రధాన సమస్య. ఆడపిల్లలు చదువుకి దూరమయ్యేకొద్దీ ప్రపంచం పేదరికానికి దగ్గరవుతూనే ఉంటుందన్నది ‘వన్ క్యాంపైన్’ అధ్యక్షుడు గేల్ స్మిత్ అభిప్రాయం.

‘ఇప్పటికీ 13కోట్ల మంది ఆడపిల్లలు స్కూళ్లకు దూరంగానే ఉన్నారు. అంటే 13 కోట్ల మంది డాక్టర్లు, ఇంజినీర్లు, వ్యాపారులు, టీచర్లు, రాజకీయ నేతలు లాంటి వాళ్ల సేవల్ని ప్రపంచం కోల్పోనుంది.’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)