నేను పురుషుడిని కాదంటే పిచ్చాసుపత్రికి పంపారు

  • 11 అక్టోబర్ 2017
సబీ సెల్ఫీ
చిత్రం శీర్షిక ప్రస్తుతం ఆమె పురుషుడు కాదు. ఒక స్త్రీ

భారత నావికాదళంలో పని చేస్తున్న మనీష్ గిరి, లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకుని మహిళగా మారారు. సబీ అని పేరు కూడా మార్చుకున్నారు. ప్రస్తుతం సబీ పురుషుడు కాదు. ఒక స్త్రీ.

ఈ అంశం ఇప్పుడు లింగ మార్పిడిపై మరోసారి తీవ్ర చర్చకు దారి తీసింది.

కారణం.. లింగమార్పిడి చేయించుకున్నారని సబీని అధికారులు, విధుల నుంచి తొలగించారు.

నావికాదళంలో పని చేసేవారు లింగమార్పిడి చేయించుకున్నాక తమ ఉద్యోగాల్లో కొనసాగడానికి వీలు లేదని, నేవీ నిబంధనలు అందుకు అంగీకరించవని, అధికారులు ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు.

తన జెండర్‌ను మార్చుకుని, ఉద్యోగ అర్హతలను మనీష్ కోల్పోయాడన్నది అధికారుల అభిప్రాయం.

మనీష్ ఉద్యోగంలో చేరినప్పటి అర్హత, ఆరోగ్య పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరని ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు.

తనను ఉద్యోగం నుంచి తొలగించడాన్ని సబీ వ్యతిరేకిస్తోంది. ఈ విషయంపై తాను మిలిటరీ కోర్టును ఆశ్రయిస్తానని అంటోంది.

ట్రాన్స్‌జెండర్స్‌కు చట్టబద్దత కల్పించినా, సబీను ఉద్యోగం నుంచి తొలగించడం వివాదాస్పదమైంది.

2010లో మనీష్ గిరి ఇండియన్ నేవీలో చేరారు. 2016 చివర్లో లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారు.

మొదట్లో, తన కుటుంబం కూడా మద్దతుగా నిలవలేదు. కానీ, డాక్టర్లతో పలుమార్లు సంప్రదించాక, సబీ నిర్ణయాన్ని వారు సమర్థించారు. ప్రస్తుతం సబీని వారు మన:స్ఫూర్తిగా అంగీకరించారు.

ఆపరేషన్ తర్వాత ఉద్యోగానికివెళ్లిన సబీకి చేదు అనుభవం ఎదురైంది. సెక్సువల్ ఐడెంటిటీ డిసార్డర్ ఉందని, అధికారులు ఆమెను 5నెలలుసైకియాట్రిక్ వార్డులో ఉంచారు.

గతంలోకూడా, సమస్యను నేవీ డాక్టర్లకు వివరించినపుడు అర్థం చేసుకోకుండా తనను సైకియాట్రీ వార్డులో ఉంచేవారని సబీ తెలిపారు..

ఆమె బీబీసీతో మాట్లాడుతూ, ''ఆ 5నెలలూ జైలులో ఉన్నట్టు అనిపించింది. నేను లింగమార్పిడి చేయించుకుని పూర్తీ మహిళగా మారానని అధికారులకు తెలుసు. కానీ, ఓ మగ గార్డుతో పాటే నన్ను ఉంచారు.'' అని వివరించారు.

సబీని 5 నెలలపాటు సైకియాట్రిక్ వార్డులో ఉంచిన ఆరోపణలపై నేవీ అధికారులు వివరణ ఇవ్వాల్సి ఉంది. కానీ, ఈ విషయమై బీబీసీతో మాట్లాడ్డానికి వారు నిరాకరించారు.

తాను ఏప్రిల్లో తిరిగి విధుల్లోకి చేరితే, విధుల్లోనుంచి తొలగిస్తూ అక్టోబర్ 6న తనకు ఉత్తర్వులు అందాయని సబీ తెలిపారు.

లింగమార్పిడి చికిత్స చేయించుకునే అంశంలో, న్యాయపరమైన అడ్డంకులేవీ ఉండవని భారత న్యాయస్థానం 2012లో తీర్పుచెప్పింది.

2014లో సుప్రీంకోర్టు, ట్రాన్స్‌జెండర్లను థర్డ్‌జెండర్లుగా గుర్తించింది.

''నేను దోషిని కాదు. ఏ నేరమూ చేయలేదు. నా వ్యక్తిగత గుర్తింపును బహిర్గతం చేశానంతే! చివరి వరకూ న్యాయం కోసం పోరాడుతా.. '' అంటూ సబీ తన ఆవేదనను వ్యక్తం చేశారు.

భారతదేశంలో ట్రాన్స్‌జెండర్స్ ఓ వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నారని నిపుణులు చెబుతున్నారు. ఒకవైపు, రాజ్యాంగం వీరికి ప్రత్యేక గుర్తింపునిచ్చి, రక్షణ కల్పించింది.

మరోవైపు, వీరు చట్టాన్ని మీరుతున్నారన్న ఆరోపణలూ కొనసాగుతున్నయని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)