డవ్ ‘రేసిస్ట్’ ప్రకటనపై స్పందించిన మోడల్

  • 12 అక్టోబర్ 2017
లోలా ఒగున్యెమి
చిత్రం శీర్షిక ప్రకటనను తప్పుగా అర్థం చేసుకున్నారని లోలా అంటున్నారు

డవ్ సంస్థ ఇటీవల ఫేస్‌బుక్‌లో విడుదల చేసిన ఓ ప్రకటన జాతి వివక్షను ఎత్తి చూపుతోందన్న విమర్శలు ఎదురవుతున్నాయి.

కానీ, నిజానికి ప్రపంచంలో ఉన్న భిన్నత్వాన్ని చూపించడమే ఆ ప్రకటన ఉద్దేశమని అందులో నటించిన మోడల్ అంటున్నారు.

లోలా ఒగున్యెమీ అనే మోడల్ ఇటీవల డవ్ సంస్థకు చెందిన ఫేస్‌బుక్ ప్రకటనలో నటించారు. డవ్ బాడీ వాష్ ఉపయోగించాక నల్లగా ఉండే ఆమె తెల్లగా మారినట్లు ఆ యాడ్‌లో చూపించారు.

అది జాతి వివక్షను ఎత్తి చూపేలా ఉందంటూ ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. కానీ ప్రజలు ఆ ప్రకటనను తప్పుగా అర్థం చేసుకున్నారనీ, డవ్ సంస్థ అసలు ఉద్దేశం అది కాదనీ లోలా అంటున్నారు.

మహిళలు కనిపెట్టిన అద్భుతాలివి

అభిప్రాయం: ఏది 'సెక్స్', ఏది 'రేప్'?

చిత్రం శీర్షిక వివక్షని ఎత్తి చూపుతుందన్న కారణంగా డవ్ ప్రకటన వివాదాస్పదమైంది

ఆ ప్రకటనలో లోలా టీ షర్టుని తొలగించగానే ఓ విదేశీ యువతి కనిపిస్తుంది. ఆమె మళ్లీ టీ షర్టుని తీయగానే మరో ఆసియా యువతి కనిపిస్తుంది.

మొత్తంగా ఐదు భిన్న జాతులకు చెందిన యువతులు ఆ ప్రకటనలో నటించారు. కానీ ముగ్గురు యువతులు కనిపించే ప్రకటననే ఫేస్‌బుక్‌లో పెట్టారు.

చిత్రం శీర్షిక ప్రకటన ప్రజలకు ఆగ్రహం తెప్పిస్తుందని డవ్ ఊహించలేకపోయింది

ఐదు భిన్న జాతులకు చెందిన యువతులు నటిస్తున్న ప్రకటనలో నల్ల జాతీయుల తరఫున నటించే అవకాశం తనకు దక్కినందుకు సంతోషించాననీ, కానీ అది ఇలా వివాదాస్పదమవుతుందని తాను ఊహించలేదనీ లోలా అంటున్నారు.

ఫేస్‌బుక్‌లో ప్రకటనను కుదించి చూపడం వల్ల దాని అసలు అర్థం దెబ్బతిందని ఆమె చెబుతున్నారు.

'ప్రకటనను విడుదల చేసిన మరుసటి రోజు నిద్రలేచేసరికి నన్ను విమర్శిస్తూ చాలా ఎస్సెమ్మెస్‌లు, ఈ మెయిల్స్ వచ్చాయి. నేను అలాంటి స్పందనను అసలు ఊహించలేదు. ఫేస్‌బుక్‌లో కేవలం నల్లగా ఉండే నేను తెల్లగా మారే ఫొటోకి సంబంధించిన స్క్రీన్ షాట్ మాత్రమే చక్కర్లు కొడుతోంది. దాని వల్లే ఆ ప్రకటన వివాదాస్పదమైంది' అన్నది లోలా మాట.

ప్రకటనకు ఇలాంటి స్పందన వస్తుందని ఊహించలేకపోయిన డవ్ వెంటనే దాన్ని తొలగించి క్షమాపణలు చెప్పింది. వివక్షను ఎత్తి చూపే ప్రకటనలను రూపొందించిన కారణంగా గతంలోనూ డవ్ ప్రజల ఆగ్రహాన్ని చవిచూసింది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ఈ కథనం గురించి మరింత సమాచారం