100 మంది మహిళలు: కంపెనీ లాభాలకూ ఆడవాళ్లకూ ఏంటి సంబంధం?

ఫొటో సోర్స్, Getty Images
‘బోర్డులో మహిళలకు స్థానం కల్పిస్తే సరిపోదు, వారి నిర్ణయాలకు ప్రాధాన్యమూ ఇవ్వాలి’
కంపెనీల్లో అత్యున్నత స్థానాల్లో మహిళలుంటే వాటి లాభాలు కచ్చితంగా పెరుగుతాయని అనేక నివేదికలు చెబుతున్నాయి. కానీ, ఆ నివేదికలు నిజమా కాదా, వాటిని నమ్మాలా వద్దా అన్నదానిపైన భిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఎన్నో దేశాల్లోని పెద్ద పెద్ద కంపెనీలు మేనేజ్మెంట్ బోర్డులో మహిళలకు సమ ప్రాధాన్యం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.
కంపెనీ బోర్డులో కనీసం 30 శాతం మంది మహిళా సభ్యులు ఉండేలా ప్రోత్సహించేందుకు 30% క్లబ్ పేరుతో 2010లో యూకేలో ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చారు.
అమెరికాలోనూ అలాంటి లక్ష్యాన్నే అందుకునేందుకు 30% కో-అలీషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు.
వివిధ దేశాలు చేపడుతున్న ఇలాంటి విధానాలు మంచి ఫలితాల్నే అందిస్తున్నాయన్నది చాలా మంది అభిప్రాయం.
ఫొటో సోర్స్, Getty Images
కొన్ని యూరోపియన్ దేశాలు తమ కంపెనీల బోర్డుల్లో మహిళలకు కొంత కోటాని కల్పించాయి
పూర్తిగా మగవాళ్లతో నిండిన బోర్డు కంటే కనీసం ఒక మహిళా డైరెక్టర్ అయినా ఉన్న కంపెనీలే ఎక్కువ లాభాలను అర్జిస్తున్నాయని గతేడాది విడుదలైన క్రెడిట్ సూస్ రిపోర్టు చెబుతోంది.
సీనియర్ మేనేజ్మెంట్ సభ్యుల్లో కనీసం పదిహేను శాతం మహిళలున్న కంపెనీలు యాభై శాతం ఎక్కువ లాభాల్ని అందుకుంటున్నాయి.
అదే బోర్డులో పది శాతం కంటే తక్కువ మహిళలున్న సంస్థలు తక్కువ లాభపడుతున్నాయన్నది ఆ నివేదిక సారాంశం.
అయితే, ఇలాంటి నివేదికల్ని ఆమోదించేముందు అవి అన్ని అంశాల్నీ పరిగణనలోకి తీసుకుంటున్నాయో లేదో చూడాలంటారు అమెరికాలోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అలీస్ ఎగ్లీ.
కొన్ని నివేదికలు మహిళల వల్ల సంస్థలకు ఎక్కువ లాభమని చెబితే, ఇంకొన్ని నివేదికలు అవన్నీ ఒట్టి మాటలేనని కొట్టిపారేస్తున్నాయి.
కానీ సగటున ఎక్కువ శాతం నివేదికలు సంస్థల లాభాలపైన మహిళల ప్రభావం తప్పకుండా ఉంటుందనే చెబుతున్నాయి.
ఫొటో సోర్స్, PA
దేశాలూ, వాటి విధానాల్ని బట్టి కంపెనీల్లో మహిళల ప్రాధాన్యం ఆధారపడి ఉంటుంది
పెద్ద సంస్థల్లో మహిళా ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుందనీ, అందుకే వాటి పనితీరుపైన మహిళల ప్రభావం ఉన్నట్టు కనిపించడం సహజమేననీ అంటారు ప్రొఫెసర్.ఎగ్లీ. నిజానికి వాటి అభివృద్ధికి మహిళలతో పాటు మరెన్నో ఇతర కారణాలూ తోడవుతాయన్నది ఆవిడ అభిప్రాయం.
అమెరికాలోని పెద్ద సంస్థల లాభాల్ని పరిగణనలోకి తీసుకుంటే వాటి అభివృద్ధిలో మహిళలు కీలక పాత్ర పోషించారని మరో నివేదిక స్పష్టం చేస్తోంది.
బీబీసీ '100 మంది మహిళలు':
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100 మంది స్ఫూర్తిప్రదాతలైన, ప్రభావవంతులైన మహిళల జాబితాను బీబీసీ ఏటా ప్రకటిస్తుంది.
కనిపించని అడ్డుగోడలు, నిరక్షరాస్యత, వీధుల్లో వేధింపులు, క్రీడల్లో లింగవివక్ష అనే నాలుగు అతిపెద్ద సవాళ్ల పరిష్కారానికి ఈ సిరీస్ ప్రయత్నిస్తోంది. వీటిని ఎదుర్కొనేందుకు ఈ ఏడాది జాబితాలోని మహిళామణులు సరికొత్త మార్గాలను అన్వేషించేందుకు ప్రయత్నించనున్నారు.
2017 సిరీస్ జాబితాలో భారత్‌లో జన్మించినవారు పది మంది ఉండగా, వీరిలో ఒకరు 16 ఏళ్ల బాలిక కావడం విశేషం. ప్రముఖ క్రికెటర్ మిథాలీ రాజ్, దిల్లీ తీహార్ జైల్లో ఎనిమిదేళ్లుగా పిల్లలకు పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయురాలు, సామాజిక కార్యకర్త తూలికా కిరణ్ కూడా వీరిలో ఉన్నారు.
ఈ 100 మంది మహిళల్లో కొందరు అక్టోబరులో నాలుగు వేర్వేరు నగరాల్లో సమావేశమై, ఈ నాలుగు ప్రధాన సమస్యలకు సరికొత్త పరిష్కారాలపై చర్చిస్తారు. మహిళల్లో నిరక్షరాస్యతపై దిల్లీలో, కనిపించని అడ్డుగోడలనే అంశంపై అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో, వీధుల్లో వేధింపులపై బ్రిటన్‌లోని లండన్‌లో, క్రీడల్లో లింగవివక్షపై బ్రెజిల్‌లోని రియోడిజనీరోలో సమావేశాలు, చర్చలు, ఇతర కార్యక్రమాలు ఉంటాయి.
మహిళలకు సమాన హక్కులు కల్పించే దేశాలే వాళ్ల ద్వారా ఎక్కువ లాభపడుతున్నాయి. ఏ దేశాల్లో ఆడవాళ్లకు సమ ప్రాధాన్యం గౌరవం లభిస్తున్నాయో, ఆ దేశాల్లోని సంస్థలు అభివృద్ధిలో ముందున్నాయని నివేదికలు చెబుతున్నాయి.
కేవలం లాభాలతో మాత్రమే మహిళల్ని ముడిపెట్టకూడదనీ, వాళ్ల వల్ల మొత్తం పని వాతావరణమే సానుకూలంగా మారుతుందనీ జర్మనీ, డచ్, బెల్గయిన్ దేశాలకు చెందిన శాస్త్రవేత్తల బృందం అధ్యయనంలో తేలింది. కంపెనీలో మహిళలు తక్కువ సంఖ్యలో ఉంటే అది వారి పనితీరుపైన ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశమూ ఉందని ఆ అధ్యయనం చెబుతోంది.
అమెరికాలో పెద్ద సంస్థల లాభాల్లో మహిళల భాగస్వామ్యం స్పష్టంగా కనిపిస్తుంది
బోర్డులో మహిళలున్నంత మాత్రాన సరిపోదనీ, వాళ్ల నిర్ణయాలను గౌరవిస్తున్నారా లేదా అన్నదీ ముఖ్యమేననీ ప్రొఫెసర్. ఎలీ అంటారు. మహిళల నిర్ణయాల్ని గౌరవించినప్పుడే బోర్డులో వాళ్లకు కల్పించిన స్థానానికి అర్థముంటుందన్నది ఎలీ మాట.
ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ కోరిన్ పోస్ట్ మాత్రం ఆడవాళ్లకు కంపెనీ లాభాలతో కంటే సేవా కార్యక్రమాలతోనే ఎక్కువ సంబంధం ఉంటుందని చెబుతారు.
మహిళలు సీనియర్ మేనేజ్మెంట్ పదవుల్లో ఉన్న కంపెనీలు పర్యావరణహితంగా పనిచేసే అవకాశాలు ఐదు రెట్లు ఎక్కువగా ఉంటాయనీ, సేవా కార్యక్రమాలకూ అవి ప్రాధాన్యమిస్తాయనీ చెబుతారు కోరిన్.
ఈ చర్చలన్నీ పక్కనబెడితే, ముందు మహిళలకు యాజమాన్య బోర్డులో సమ ప్రాధాన్యం ఇచ్చాకే లాభాలపైన వాళ్ల ప్రభావం గురించి మాట్లాడాలి అంటారు ప్రొఫెసర్ ఎగ్లీ.
'జనాభాలో యాభై శాతం ఉన్న వాళ్లని ముఖ్యమైన ఉద్యోగాలకు ఎందుకు దూరంగా పెట్టాలి‘ అని ప్రశ్నిస్తారామె.'
'మాట్లాడాల్సింది మహిళల లాభాల గురించి కాదు, వాళ్లకు జరగాల్సిన న్యాయం గురించి.'
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)