శబరిమలలో మహిళల ప్రవేశంపై విచారణ రాజ్యాంగ ధర్మాసనానికి

  • 13 అక్టోబర్ 2017
శబరిమల అయ్యప్ప Image copyright sabarimala.kerala.gov.in

శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై విచారణ కేసు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి చేరనుంది.

ఇప్పటి వరకూ ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ ఈ కేసులో వాదనలు విన్నది.

రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలా? లేదా? అన్న అంశంపై గత ఫిబ్రవరిలో కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే.

10 నుంచి 50 ఏళ్లున్న మహిళలను శబరిమల మందిరంలోకి అనుమతించకుండా ఆలయ యాజమాన్యం విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది.

ఈ అంశంపై చట్టపరమైన సవాళ్లను కోర్టుకు సమర్పించాలని అన్ని పక్షాలను కోరింది.

ఈ కేసులో మహిళా సంఘాలు, అయ్యప్ప సంఘాలు, కేరళ రాష్ట్ర ప్రభుత్వం, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు కక్షిదారులుగా ఉన్నాయి.

ఎందుకీ వివాదం?

అయ్యప్ప స్వామి బ్రహ్మచారి అని చెబుతారు. కాబట్టి, రుతుస్రావంలో ఉన్న మహిళలు ఆలయం లోపలికి అనుమతించకూడదని ఆలయ నిర్వాహకులు నిర్ణయించారు.

అయితే, అన్ని వయసుల మహిళలనూ మందిరంలోకి అనుమతించడానికి తాము సిద్ధమేనని కేరళ ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో తెలిపింది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)