అసదుద్దీన్ ఓవైసీ: ‘బీజేపీ గెలవడానికి కాంగ్రెస్ బలహీనతే కారణం, మేం కాదు’

  • 14 అక్టోబర్ 2017
అసదుద్దీన్ ఓవైసీ
చిత్రం శీర్షిక రాజకీయ సమస్యల పరిష్కారానికే ఎన్నికల్లో పోటీ చేస్తున్నామంటున్న ఓవైసీ

అఖిల భారత మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ బీబీసీతో మాట్లాడారు. తన బైక్ హాబీతో మొదలుపెట్టి రాజకీయ వ్యూహాల దాకా వివిధ అంశాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు.

ఆయనపై ప్రత్యర్థుల విమర్శలను ప్రస్తావించినప్పుడు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీబీసీ ప్రతినిధి దీప్తి బత్తిని ఆయనతో చేసిన ఇంటర్వ్యూ పూర్తి పాఠం ఇదీ:

మీరు మోదీతో కుమ్మక్కు అయ్యారని కాంగ్రెస్ వాళ్లు ఆరోపిస్తున్నారు. మీది బీజేపీ బీ-టీం అంటుంటారు, నిజమేనా?

కాన్షీరామ్ లాంటి నేతలు కూడా ఇలాంటి ఆరోపణలను ఎదుర్కొన్నారు. గతంలో ఏ ప్రాంతీయ పార్టీ విజయం సాధించినా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. ప్రస్తుతం మేం (ఎంఐఎం) కాంగ్రెస్‌తో కలవలేదు. అందువల్లే మాపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. మేము గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిదేళ్ల పాటు కాంగ్రెస్‌తో కలిసి ఉన్నాం. అప్పుడు మేం మంచి స్నేహితులం. నా ప్రశ్న ఏమిటంటే, ఎంఐఎం పోటీ చేయని చోట కూడా కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయింది? ఢిల్లీ, జమ్మూకశ్మీర్, హర్యానా, జార్ఖండ్‌లలో ఆ పార్టీ గెలవలేదు. కాంగ్రెస్‌కు సొంత సమస్యలు ఉన్నాయనే ఈ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. వాటిని పరిష్కరిచుకునే బదులు, నన్ను విమర్శించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఉత్తరప్రదేశ్, బిహార్‌లలో పోటీ చేయడం ద్వారా మీరు ఒక జాతీయ స్థాయి ముస్లిం నేతగా పేరు పొందాలనుకున్నట్లు అనిపించింది. కానీ, ఫలితాలు మాత్రం దానికి భిన్నంగా వచ్చాయి. అక్కడి ప్రజలు మీకు మద్దతు పలకలేదు. దీని గురించి మీరేమంటారు?

జాతీయస్థాయి ముస్లిం నేత కావాలని నేనెన్నడూ అనుకోలేదు. మాది ఒక రాజకీయ పార్టీ. ఎన్నికల్లో పోటీ చేయడం మా విధానం. మీరన్నట్లు మేము బిహార్, ఉత్తర ప్రదేశ్‌లలో విజయం సాధించలేదు. అయినా ఫర్వాలేదు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని నేను భావిస్తున్నాను. ప్రజల మీద నాకు అచంచల విశ్వాసం ఉంది, అందువల్ల మేము పోటీ చేస్తూనే ఉంటాము. ఒక పౌరునిగా నేను ఎదుర్కొంటున్న సమస్యలకు రాజకీయ పరిష్కారాన్ని ఆశిస్తాను. అందువల్ల ఎన్నికల్లో పోటీ చేయడమే నా పని.

మీరు ఇతర రాష్ట్రాలలో పోటీ గురించి మాట్లాడుతున్నారు. కానీ, ప్రత్యర్థులు మాత్రం మీ ప్రభావం కేవలం హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమంటున్నారు. ఇలాంటి విమర్శలు మీరూ, మీ పార్టీ జాతీయ స్థాయికి ఎదగడానికి అడ్డు పడుతున్నాయా?

జాతీయ నేతగా గుర్తింపు పొందాలనే కోరిక నాకు లేదు. హైదరాబాద్‌ బయట పోటీ చేసినప్పుడు ఇలాంటి విమర్శలు వస్తున్నాయి. మహారాష్ట్రలో మాకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడి చాలా పట్టణాలలో ఎంఐఎం నుంచి గెలిచిన మున్సిపల్ కౌన్సిలర్లు కూడా ఉన్నారు. ఔరంగాబాద్‌లో మేమే ప్రధాన ప్రతిపక్ష పార్టీ. సెక్యులర్ పార్టీ, జాతీయవాద పార్టీ అని చెప్పుకునే వారెవరైనా మేం హైదరాబాద్ వెలుపల పోటీ చేయకూడదంటే నేను ఒప్పుకోను. మా పార్టీ విస్తరణ వల్ల కాంగ్రెస్ సమస్యలు ఎదుర్కొంటోంది. అయితే వాళ్ల వల్లే మేమక్కడ కాలు మోపడం సాధ్యపడిందని వాళ్లు గుర్తించాలి. బీజేపీకి వ్యతిరేకంగా నిలబడే సత్తా కాంగ్రెస్‌కు లేదు. ఆ పార్టీ వల్లే మోదీ ప్రధాని కాగలిగారు. యూపీఏ పాలనా వైఫల్యాలు, అవినీతి కారణంగానే బీజేపీ అధికారంలోకి రాగలిగింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక కాంగ్రెస్ బలహీనత వల్లే బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఓవైసీ అభిప్రాయపడుతున్నారు

ప్రత్యర్థులు మిమ్మల్ని ఆధునిక జిన్నా అంటున్నారు. దీనిపై మీ ప్రతిస్పందన ఏమిటి?

ప్రస్తుతం మనం దారుసలాంలోని మా పార్టీ కేంద్ర కార్యాలయంలో కూర్చున్నాం. ఇక్కడి నుంచే జిన్నా ఆహ్వానాన్ని అంగీకరించబోమని ఆనాడే చెప్పాం. జిన్నా ఒకసారి ఇక్కడికి వచ్చారు కూడా. మా పార్టీ కార్యాలయం మీద జాతీయ జెండా ఎగురుతోంది చూడండి. మా పార్టీ సీనియర్లు జిన్నా పిలుపును తోసిపుచ్చారు. ఇప్పుడు ఎవరైనా నన్ను జిన్నా అంటే అది చాలా పెద్ద తప్పు. ఆయన ఇచ్చిన రెండు దేశాల పిలుపును మేం కాదన్నందుకు ఇప్పటికీ కొందరు భారత, పాకిస్తాన్ ముస్లింలు మమ్మల్ని తప్పుబడతారు.

మా ఇతర కథనాలు:

ఇటీవల ఒక బహిరంగ సభలో మీరు బీజేపీహైదరాబాద్ విమోచన దినం జరుపుకోవడం గురించి మాట్లాడారు. హైదరాబాద్ సంస్థానం భారత్‌లో కలవడంలో ఎంఐఎం కీలకపాత్ర పోషించిందన్నారు. బీజేపీ సీనియర్ నేతలపై ఆరోపణలు చేసారు. కానీ తెలంగాణలో బీజేపీ బలోపేతం అవుతున్నట్లు కనిపిస్తోంది. దీనిలో ఎంఐఎం పాత్ర ఏంటి?

ఆపరేషన్ పోలో సమయంలో అసలు బీజేపీ ఉనికిలోనే లేదు. ఇప్పుడు వాళ్లు సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని జరుపుకుంటామని చెబుతున్నారు. నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయంపై జాతీయ జెండా ఎగరేయడానికి 50 ఏళ్లు పట్టిందన్న విషయం నిజం కాదా? అది కూడా ఇద్దరు యువకులు ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి జాతీయ జెండా ఎగరేశారు. సంఘ్ నేత శ్యామ ప్రసాద్ ముఖర్జీ నాటి బ్రిటిష్ గవర్నర్‌కు 'క్విట్ ఇండియా' ఉద్యమాన్ని ఎలా బలహీనపరచాలో రాయలేదా? జాతీయ జెండాలో మూడు రంగులు ఉండడం మంచిది కాదని, దానిని ఆమోదించనని గోల్వాల్కర్ బహిరంగంగా చెప్పడం నిజం కాదా? మన జాతీయ జెండాగా కేవలం కాషాయ జెండా మాత్రమే ఉండాలని సావర్కర్ చెప్పడం నిజం కాదా? అలాంటి చరిత్ర ఉన్న బీజేపీ జాతీయవాదానికి, జాతీయ జెండాకు తామే సంరక్షకులమని చెప్పుకోవడం హాస్యాస్పదం.

రాష్ట్రాల సంగతి పక్కన పెడితే, కేంద్రం విషయం ఏమిటి? లోక్‌సభలో కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షం పాత్ర పోషించడం లేదనే విమర్శ ఉంది. ఎంఐఎం ఎంపీగా మీరెలాంటి పాత్ర పోషిస్తారు?

మేం మా రాజకీయ పరిధిని విస్తరించుకుంటే విమర్శిస్తారు. కాంగ్రెస్ క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలను తెలుసుకోవాలి. హాయిగా దిల్లీలో కూర్చుని ప్రతిపక్షంగా ప్రభావశీలమైన పాత్ర నిర్వహించాలంటే కుదరదు. ఇవాళ ప్రతిపక్షాల గొంతుకలు బలహీనంగా ఉన్న మాట నిజమే. కానీ రాబోయే రోజుల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఇంకా అనేక మంది గొంతెత్తుతారని నాకు నమ్మకముంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక హైదరాబాద్‌కే ఎంఐఎం పార్టీ పరిమితమైందన్న విమర్శలను ఓవైసీ కొట్టిపారేస్తున్నారు

మీ సోదరుడు అక్బరుద్దీన్ రెచ్చగొట్టే ప్రసంగాలతో ఎక్కువగా వార్తల్లో ఉంటున్నారు. మీరు అతణ్ని నియంత్రించేందుకు ప్రయత్నించలేదా?

ఒక్క కేసు తప్ప, అక్బరుద్దీన్‌పై ఏమైనా కేసులు ఉన్నాయేమో చూపించండి? దానిపై కూడా మీడియా అతిగా స్పందించింది. ఇప్పటివరకు విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన వారెవరినీ ఎందుకు జైలులో పెట్టలేదు? ఎప్పుడూ మజ్లిసే ద్వేషాన్ని ఎగదోస్తోందని ఆరోపిస్తారు. సమాజంలో భావవ్యక్తీకరణే కీలకం. అక్బర్ మా పార్టీకి బలమైన గొంతుక. నాకన్నా మంచి వక్త. కావాలంటే అసెంబ్లీలో అతను చేసిన ప్రసంగాలు వినండి. అతను చాలా సమర్థంగా ప్రజా సమస్యలను లేవనెత్తుతూ, ప్రభుత్వంపై ప్రశ్నలు సంధిస్తుంటాడు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

పాకిస్తాన్‌ను టార్గెట్ చేసిన మోదీ.. ‘సొంత దేశాన్నే చూసుకోలేకపోతున్న వారు, భారత్‌లో ఏం చేసినా ఇబ్బంది పడిపోతున్నారు’

'మా అమ్మను, తోబుట్టువులను నా ముందే చంపేశారు.. చనిపోయినట్లు నటించి నేను బయటపడ్డా'

కళ్లు కనిపించవు, చెవులు వినిపించవు... అయినా 130కి పైగా దేశాలు చుట్టేశారు ఈయన

ప్రెస్ రివ్యూ: 'బాహుబలి' తీయకపోతే 'సైరా' వచ్చేది కాదు: చిరంజీవి

Howdy Modi: ‘ట్రంప్ కోసం ఎన్నికల ప్రచారం చేసిన పీఎం మోదీ’ - కాంగ్రెస్ పార్టీ విమర్శ

అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ పెచ్చు ఊడిపడి మహిళ మృతి

హూస్టన్‌లో మోదీ సభా ప్రాంగణం ఎదుట ఆర్టికల్ 370 సవరణకు వ్యతిరేకంగా నిరసనలు

గులాలాయీ ఇస్మాయిల్: పాకిస్తాన్ నుంచి అమెరికా పారిపోయిన మానవహక్కుల కార్యకర్త