రాజస్తాన్: రోడ్లమీదన్నా పడుకుంటాం కానీ ఊళ్లోకి వెళ్ళం అంటున్న మంగణ్యార్‌!

  • 14 అక్టోబర్ 2017
మాంగన్యాన్ వర్గం

పాటలు పాడటమే వారి జీవనోపాధి. సంగీతం వారి నరనరాల్లో ఉంది. కానీ ఇప్పుడు ఆ సంగీతమే మంగణ్యార్‌ వర్గానికి చెందిన అమద్ ఖాన్ హత్యకు కారణమయ్యింది.

న్యాయం చేయాల్సింది పోయి ఊళ్ళోవాళ్లంతా ఏకమై వీరిని సామాజికంగా బహిష్కరించారు.

రాజస్తాన్‌ రాష్ట్రంలోని బలాడ్ గ్రామానికి చెందిన ఈ మంగణ్యార్‌ వర్గ ప్రజలంతా ఇప్పుడు జైసల్మేర్‌కు వలస వచ్చి స్థానికుల వద్ద తాత్కాలిక ఆశ్రయం పొందుతున్నారు.

అసలు సమస్యేంటి?

సెప్టెంబర్‌ 27వ తేదీన జరిగిన నవరాత్రి జాగరణ్ కార్యక్రమంలో రమేష్ అనే వ్యక్తి అమద్ ఖాన్‌ను దేవి ఆత్మను రప్పించే ఓ ప్రత్యేక పాట పాడమని అడిగితే అమద్ ఖాన్ ఆ పాట పాడారు. కానీ అతని పాట రమేష్‌కు నచ్చలేదు.

ఆ తర్వాత అమద్ ఖాన్‌పై తీవ్రమైన దాడి జరిగింది. దీంతో అతడు మృతి చెందాడు. ఆ తర్వాత మంగణ్యార్‌ వర్గంవారు భయంతో తమ మేకలను కూడా ఆ ఊళ్ళోనే వదిలేసి బయటికి వచ్చేశారు.

తమ కుటుంబ సభ్యుడైన అమద్ ఖాన్ హంతకులను పట్టుకోవాలని, వారికి శిక్ష విధించాలని మంగణ్యార్‌‌లు పంచాయితీలో డిమాండ్ చేశారు.

కానీ ఊళ్ళో వారు, పంచాయితీ సభ్యులు వారి మాటలు నమ్మలేదు. దీంతో మంగణ్యార్‌‌లు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఊళ్ళోవారందరూ సామాజికంగా మంగణ్యార్‌లను బహిష్కరించారు.

Image copyright Faisal Mohammad Ali

కోపం లేదు.. కానీ భయం ఉంది

మంగణ్యార్‌ వర్గం వారు ముస్లిం మతానికి చెందినవారు. పాటలు పాడటమే వారి వృత్తి. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ముందు వచ్చేది వాళ్ళే. ఎన్నో తరాల నుంచి వారు ఈ వృత్తిలో కొనసాగుతున్నారు.

"మా గురించి ఊళ్ళో వాళ్లకు అస్సలు చెప్పొద్దు.. పోస్ట్ మార్టం గురించి అస్సలు మాట్లాడొద్దని" వారు భయంగా అన్నారు.

ఇంతకు ముందు ఆమద్ ఖాన్ తమ్ముడిని కూడా ఎవరో పనికి తీసుకెళ్తున్నానని చెప్పి తీసుకెళ్లారు. తర్వాత అతని శవం కనిపించింది. అయినా ఆ ఊళ్ళో వాళ్లు వీరికి న్యాయం జరగనీయలేదు. అసలు ఈ విషయం బయటికి పొక్కనీయలేదు.

Image copyright Preeti Mann

అసలేం జరిగింది ?

అమద్ ఖాన్ తలపై తీవ్రంగా దాడి చేయడంతోనే అతడు మృతి చెందాడని పోస్ట్ మార్టం రిపోర్టులో తేలింది.

అమద్ ఖాన్ హత్య తర్వాత అతని ఫొటో చూస్తే శరీరం మీద నీలి రంగులో గాయాలు స్పష్టంగా కనిపించాయి.

Image copyright Faisal Mohammad Ali

"మేమేం చేయగలం? మా దగ్గర ఏమీ లేదు. ఒకప్పుడు మాతో పాటలు పాడించుకునేవారే నేడు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మేము వారి స్థలంలో ఉంటాము, వారిచ్చేదే తింటాము. ఇప్పుడు వారే మమ్మల్ని బహిష్కరిస్తే మా పరిస్ధితి ఏంటి" అని హకీమ్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు.

Image copyright Faisal Mohammad Ali

"పంచాయితీ సభ్యులు శవాన్ని మట్టిలో పాతిపెట్టండని అన్నారు. మేము దానికి కూడా అంగీకరించాం. కానీ వారు మాకు న్యాయం చేయలేదు. ఆ తర్వాతే మేము పోలీసులను సంప్రదించాం" అని కుర్తాలో ఉన్న జక్కే ఖాన్ అన్నారు.

స్థానిక పోలీసులు, అధికారులు ఎంత చెబుతున్నా వారు మాత్రం "రోడ్లమీదన్నా పడుకుంటాం కానీ ఊళ్లోకి అస్సలు వెళ్ళం" అని అంటున్నారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)