80 ఏళ్లుగా పని చేస్తున్న ఆర్ఎస్ఎస్ మహిళా విభాగం

  • సరోజ్ సింగ్
  • బీబీసీ ప్రతినిధి
రాష్ట్ర సేవిక సమితి

ఫొటో సోర్స్, Rastra Sevika Samiti

ఫొటో క్యాప్షన్,

రాష్ట్ర సేవిక సమితి సభ్యులు

గుజరాత్‌లోని వడోదరలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల (అక్టోబర్ 2017లో) విద్యార్థులతో మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్‌)లో మహిళలకు ప్రాధాన్యం లేదని విమర్శించారు.

ఆర్ఎస్ఎస్‌లో మహిళలుంటే వాళ్లు నిక్కర్లు వేసుకోవడం ఎప్పుడైనా చూశారా అని ప్రశ్నించారు.

తానెప్పుడూ అలాంటిది చూడలేదని, అసలు ఆర్ఎస్ఎస్‌లోకి మహిళలను ఎందుకు రానివ్వరంటూ ప్రశ్న లేవనెత్తారు.

బీజేపీలో చాలా మంది మహిళలున్నారు కానీ, ఆర్ఎస్ఎస్‌లో లేరని రాహుల్ చెప్పారు.

రాహుల్ వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్ అఖిల భారత ముఖ్య ప్రచారక్ మన్మోహన్ వైద్య స్పందించారు. ''రాహుల్ గాంధీ పురుషుల హాకీ మ్యాచ్‌లో మహిళలను చూడాలనుకుంటున్నారు. అలా అనుకుంటే ఆయన మహిళల హాకీ మ్యాచ్‌కి వెళ్లాలి'' అని వైద్య చెప్పినట్లు ఆంగ్ల దినపత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.

అసలు ఆర్ఎస్ఎస్‌లో మహిళలు ఉన్నారా, లేరా.. నిజమేంటో తెలుసుకోడానికి ఆర్ఎస్ఎస్ ముఖ్యులతో బీబీసీ మాట్లాడింది.

మహిళల కోసం ఆర్ఎస్ఎస్‌లో ప్రత్యేక విభాగం ఉన్నట్లు వారు తెలిపారు. ఈ విభాగాన్ని రాష్ట్ర సేవిక సమితిగా పిలుస్తారని వారు చెప్పారు.

ఒక్క దిల్లీలోనే దాదాపు 100 రాష్ట్ర సేవిక సమితి శాఖలు ఉండగా, దేశ వ్యాప్తంగా ఇలాంటివి 3,500 ఉన్నాయని వివరించారు.

సుష్మిత (40) దిల్లీలోని ఇలాంటి ఓ శాఖలో 16 ఏళ్లుగా పనిచేస్తున్నారు. 2001‌లో ఆమె ఆర్ఎస్ఎస్ మహిళా విభాగం గురించి తెలుసుకొని అందులో చేరారు. అంతకు ముందు ఆమె లండన్‌లో రెడ్ క్రాస్‌లో పనిచేశారు.

ఫొటో సోర్స్, Rastra Sevika Samiti

ఫొటో క్యాప్షన్,

గులాబీ అంచు చున్నీ, తెల్లటి సల్వార్ కమీజ్ వీరి యూనిఫాం

రాష్ట్ర సేవిక సమితిలోని మహిళల యూనిఫాం గురించి ఆమెను ప్రశ్నించగా, ''తెల్లటి సల్వార్ కమీజ్, గులాబీ అంచుతో ఉండే చున్నీ మా డ్రెస్‌కోడ్‌గా ఉంటుంది. లేదంటే గులాబీ అంచున్న చీరలు కూడా కట్టుకోవచ్చు'' అని చెప్పారు.

రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై స్పందిస్తూ, ''ఎవరి కోసమో మేం మా యూనిఫాంను మార్చుకోం. 80 ఏళ్ల నుంచి ఇదే మా సంప్రదాయంగా వస్తోంది'' అని అన్నారు.

''ఆర్ఎస్ఎస్‌తో మా విభాగానికి సుదీర్ఘ అనుబంధం ఉంది. బాల్యంలో ఎవరైనా మా శాఖలో చేరొచ్చు. మహిళలు మాత్రం రాష్ట్ర సేవిక సమితిలో భాగంగా ఉంటారు'' అని పేర్కొన్నారు.

రాష్ట్ర సేవిక సమితి తన అధికారిక వెబ్‌సైట్‌లో 'స్త్రీ జాతికి మూలాధారం' అని పేర్కొంది.

ఫొటో సోర్స్, Rastra Sevika Samiti

ఫొటో క్యాప్షన్,

రాష్ట్ర సేవిక సమితి ముఖ్య కార్యదర్శిగా శాంతక్క వ్యవహరిస్తున్నారు

మహారాష్ట్రలోని వార్ధ కేంద్రంగా 1936‌లో విజయదశమినాడు రాష్ట్ర సేవిక సమితిని లక్ష్మీబాయి కేల్కర్ ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం దీని ప్రధాన కార్యదర్శిగా శాంతక్క వ్యవహరిస్తున్నారు.

విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా ఒకప్పుడు ఇందులో పనిచేశారు.

ఫొటో సోర్స్, Rastra Sevika Samiti

దిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్, ఆర్ఎస్‌ఎస్ ప్రతినిధి రాకేశ్ సిన్హా మాట్లాడుతూ, 80 ఏళ్లుగా పనిచేస్తున్న రాష్ట్ర సేవిక సమితి గురించి రాహుల్‌కి తెలియకపోవడం ఆయన అవగాహనారాహిత్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.

రాణి లక్ష్మీబాయి, కమలా నెహ్రూ నిక్కర్లు వేసుకొని జాతీయ పోరాటంలో పాల్గొనలేదు కదా అని ఆయనన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)