జార్ఖండ్‌లో ఆకలికి తట్టుకోలేక చిన్నారి మృతి

కోయలి దేవి

ఫొటో సోర్స్, Dhiraj

పదకొండేళ్ల సంతోషి నాలుగు రోజుల పాటు ఆకలితో అలమటించింది. కానీ, రేషన్ దొరకలేదు. తినడానికి అన్నం లేక ఆమె చనిపోయిందని కుటుంబీకులు చెబుతున్నారు.

అది జార్ఖండ్ రాష్ట్రం. సిండేగా జిల్లా. కారామాటి గ్రామం. ఈ గ్రామంలో 100 కుటుంబాలుంటాయి.

వెనుకబడిన వర్గానికి చెందిన సంతోషి కుటుంబానికి రేషన్ డీలర్ 8 నెలలుగా సరకులు ఇవ్వడంలేదు.

కారణం.. ఆధార్ కార్డుతో రేషన్ కార్డును లింక్ చేయలేదంట.

ఫొటో సోర్స్, Dhiraj

‘ఆకలి నొప్పి’

అనారోగ్యం కారణంగా సంతోషి తండ్రి ఏ పనీ చేయలేరు. అందువల్ల కుటుంబ భారమంతా తల్లీకూతుళ్లపైనే. తల్లి కోయలిదేవి, పెద్ద కూతురు ఇద్దరూ కలిసి వేప పుల్లలు అమ్ముకునో, ఎవరింట్లో అయినా పాచిపని చేసుకుంటూనో కుటుంబాన్ని పోషిస్తున్నారు.

వెనుకబడిన వర్గానికి చెందిన వారు కావడంతో ఎవరూ వారికి పని ఇవ్వటానికి ఆసక్తి చూపలేదు.

తమ కుటుంబంలో ఎన్నో రాత్రులు ఆకలితో గడిచిపోతాయని సంతోషి తల్లి తెలిపారు.

''సెప్టెంబరు 28 మధ్యాహ్నం కడుపులో నొప్పి వస్తోందని సంతోషి చెప్పింది. ఆకలి వల్లే ఆమెకు కడుపునొప్పి వచ్చిందని, అన్నం తినిపిస్తే నొప్పి తగ్గిపోతుందని ఊర్లో ఉన్న డాక్టరు చెప్పారు.''

''కానీ సంతోషికి తినిపించడానికి ఇంట్లో ఒక్క మెతుకు అన్నం కూడా లేదు. అప్పటికే సంతోషి అన్నం కావాలి అని ఏడవటం మొదలుపెట్టింది. ఆమె కాళ్ళు చేతులు బిగుసుకుపోయాయి. ఇంట్లో ఉన్న టీ పొడి, ఉప్పు కలిపి టీ కాచి, సంతోషికి ఇవ్వాలని అనుకున్నాను. ఇంతలోపే సంతోషి గిలగిలా కొట్టుకుంటూ చనిపోయింది" అని కోయలిదేవి తెలిపారు.

ఫొటో సోర్స్, Dhiraj

ఆకలి కాదు మలేరియా !

కానీ సిండేగా జిల్లా డిప్యూటీ కలెక్టరు మంజునాథ్ భజంత్రి మాత్రం సంతోషి ఆకలితో చనిపోలేదన్నారు.

మలేరియా సోకడంతోనే ఆమె చనిపోయిందని బీబీసీకి తెలిపారు.

''సెప్టెంబరు 28న సంతోషి చనిపోయింది. కానీ దీని గురించి అక్టోబర్ 6న పేపరులో వార్త వచ్చింది. దసరా సందర్భంగా స్కూలుకు సెలవులిచ్చారని, అందుకే సంతోషికి మధ్యాహ్న భోజనం దొరక్కపోవడంతో ఆమె చనిపోయిందని వార్త వచ్చింది.''

''కానీ సంతోషి మార్చ్ తర్వాత అసలు స్కూలుకే రాలేదు. మేము సంతోషి మృతిపై దర్యాప్తుకు ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేశాం. వారి నివేదిక ప్రకారం, సంతోషి చనిపోవడానికి మలేరియాయే కారణమని తేలింది. సంతోషికి చికిత్స అందించిన డాక్టరుతో కూడా ఈ కమిటీ మాట్లాడింది" అని మంజునాథ్ తెలిపారు.

ఫొటో సోర్స్, Dhiraj

మలేరియానా? ఆకలి చావా?

కానీ డిప్యూటీ కమిషనర్ ఈ ఆకలి చావును దాస్తున్నారని జల్ డేగాలో ఉండే సామాజిక కార్యకర్త తారామతి సాహు ఆరోపించారు.

సెప్టెంబరు 27న స్థానిక ఆరోగ్య కేంద్రంలో ఉండే నర్సు మాలాదేవి సంతోషికి జ్వరం లేదని స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు.

''ఆగస్టు 21న డిప్యూటీ కలెక్టరు నిర్వహించిన జనతా దర్బార్‌లో కోయల్ దేవి రేషన్ కార్డును రద్దు చేశారని ఫిర్యాదు చేశాను. సెప్టెంబరు25న రేషన్ కార్డును పునరుద్ధరించమని మళ్ళీ ఫిర్యాదు చేశాను. అప్పుడు సంతోషి బతికే ఉంది. అయితే అధికారులు మా ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో సంతోషి ఆకలితో చనిపోయింది" అని తారామతి సాహు తెలిపారు.

ఫొటో సోర్స్, Dhiraj

'రైట్ టు ఫుడ్' విచారణ

ఈ ఘటన తర్వాత 'రైట్ టు ఫుడ్'కు చెందిన ఐదుగురు సభ్యుల బృందం కారామాటి గ్రామానికి వెళ్లి దర్యాప్తు చేపట్టింది. వారి వెంట ఆ రాష్ట్ర ఫుడ్ కమిషన్ బృందం కూడా ఉంది.

''సంతోషి ఆకలి వల్లే చనిపోయిందని కోయల్ దేవి నాకు చెప్పారు'' అని ఈ బృందంలో సభ్యులయిన ధీరజ్ కుమార్ తెలిపారు.

''ఎవరైనా అన్నం దొరక్క ఆకలితో చనిపోతే దాన్నేమనాలి? దానికి ప్రభుత్వమే కొత్త పదం కనుగొనాలి. ఎవరైనా ఇలా చనిపోతే దానికి ఆకలి కారణం కాదని అనడం ప్రభుత్వం తన బాధ్యతలను విస్మరించడమే'' అని ప్రముఖ సామాజిక కార్యకర్త బలరాం అన్నారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)