సింగపూర్ పర్యటనకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత రైతులు: విమర్శలు, సమాధానాలు

  • 18 అక్టోబర్ 2017
అమరావతి నగరానికి శంకుస్థాపన చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు Image copyright APCRDA PROJECT REOPORT
చిత్రం శీర్షిక రాజధాని రైతులు వ్యవసాయం నుంచి వాణిజ్యంలోకి మారడానికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించే కృషి జరగాలని సీఎం చంద్రబాబు అంటున్నారు

అమరావతి రైతుల సింగపూర్ యాత్రతో ఎవరికి లాభం?. సింగపూర్‌ నగర అభివృద్ధి గురించి, నగరం అభివృద్ధి చెందుతున్నపుడు లభించే అవకాశాల గురించీ రాజధాని ప్రాంత రైతులకు అవగాహన కల్పించడం అమరావతి పర్యటన లక్ష్యమని ఏపీ సీఆర్‌డీఏ చెప్తోంది. కానీ ఇది ప్రభుత్వ ప్రచార ఎత్తుగడలో భాగమని.. రాజధానికి భూములు ఇచ్చిన రైతులను సంతృప్తి పరచడం కోసం నిర్వహిస్తున్న విహార యాత్ర అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వంటి పలు సంస్థలు విమర్శిస్తున్నాయి.

''రాజధాని నగరంలో వాస్తవ పౌరులు ఈ రైతులు. వారు సంతోషంగా ఉండాలి. వారు వ్యవసాయం నుంచి వ్యాపార రంగానికి మారడం సజావుగా జరగాలి. కాబట్టి వారిలో ఈ నైపుణ్యాలను అభివృద్ధి చేసే కృషి నిరంతరం కొనసాగాలి'' అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇటీవల విజయవాడలో జరిగిన ఏపీసీఆర్‌డీఏ సమావేశంలో పేర్కొన్నారు.

నిజానికి తొలుత 100 మంది రైతులను సింగపూర్ పర్యటనకు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది.

అంతకన్నా ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నట్లయితే లాటరీ ద్వారా 100 మందిని ఎంపిక చేసి పర్యటనకు పంపిస్తామని పేర్కొంది. ఈ పర్యటన కోసం 158 మంది రైతులు దరఖాస్తు చేశారని.. వారిలో లాటరీ ద్వారా 123 మందిని ఎంపిక చేశామని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్‌డీఏ) కమిషనర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రైజ్ - సింగపూర్, ఏపీసీఆర్‌డీఏ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని ఆయన చెప్పారు.

Image copyright Getty Images

ప్రయాణం, వీసా చార్జీలు రైతులవే

ఈ నెల 30వ తేదీ నుంచి వీరిని మూడు బృందాలుగా సింగపూర్ పంపిస్తున్నారు. ఒక్కో బృందం నాలుగు రోజుల పాటు సింగపూర్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటన కోసం రూ. 40 లక్షలు బడ్జెట్ కేటాయించినట్లు సీఆర్‌డీఏ కమిషనర్ తెలిపారు. వారికి సింగపూర్‌లో బస, ఆహారం, ప్రయాణం తదితర ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది.

అయితే సింగపూర్‌కి రానూపోనూ విమాన ప్రయాణ చార్జీలు, వీసా చార్జీలను రైతులే భరించాల్సి ఉంటుంది.

ప్రభుత్వం ఒక్కొక్కరి కోసం రూ. 30,000 వరకూ ఖర్చు పెడుతోంది. రైతులు విమాన చార్జీలు, వీసా ఫీజుల కోసం మరో రూ. 25,000 నుంచి రూ. 30,000 వరకూ భరించాల్సి ఉంటుంది. సింగపూర్‌లో తమకు లభించగల అనుభవంతో పోలిస్తే ఈ ఖర్చు తమకు పెద్ద సమస్య కాదని కొందరు రైతులు చెప్తున్నారు.

కానీ.. ‘‘చాలా మంది రైతులకు పాస్‌పోర్టులు లేవు. అప్పటికప్పుడు అకస్మాత్తుగా చెప్పడంతో చాలా మంది దరఖాస్తు కూడా చేసుకోలేకపోయారు. పైగా పర్యటన కోసం రైతుల ఎంపిక కూడా పారదర్శకంగా లేదు’’ అని ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకుడు బత్తుల కిశోర్ ఆరోపించారు.

‘‘అదీగాక ఏడాదిలో అండర్ గ్రౌండ్ కరెంటు, రోడ్లు తదితర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కానీ ఇంతవరకూ ఒక్క హామీ కూడా అమలు కాలేదు. హామీలు నెరవేర్చకుండా అటు తిప్పి ఇటు తిప్పి మభ్యపెడుతున్నారు’’ అని ఆయన విమర్శించారు.

Image copyright AP CRDA FACT FILE
చిత్రం శీర్షిక సింగపూర్ తరహాలో రాజధాని నగరం అమరావతిని నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తోంది

భూమి ఇచ్చిన రైతులు 26,512 మంది

ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక ప్రకారం.. రాజధాని ప్రాంతంలోని 30,572 మంది రైతుల్లో 26,512 మంది రైతులు భూ సమీకరణ పథకంలో చేరారు. వారంతా కలిసి ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్‌డీఏ)కు 33,008 ఎకరాల భూమిని అప్పగించారు.

ఇందులో 23,903 మంది రైతులకు ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి.. భూ సమీకరణ పథకం నిబంధనల ప్రకారం 59,014 ప్లాట్లు కేటాయించారు. ఇక మిగతా 4,060 మంది రైతులు భూ సమీకరణ పథకంలో చేరడానికి వ్యతిరేకించారు.

అయితే.. భూ సమీకరణ పథకంలో చేరిన రైతులు 26 వేల మందికి పైగా ఉండగా.. వారిలో కేవలం 120 మందిని మాత్రమే వ్యాపార నైపుణ్యాలు నేర్పించడం కోసం సింగపూర్ పర్యటనకు తీసుకెళ్లడంలో ఆంతర్యమేమిటని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.

'రైతులను శాంతింపజేసే ప్రయత్నం'

ఇటీవల రాజధాని ప్రాంతంలో పర్యటించిన ప్రపంచ బ్యాంకు పరిశీలక బృందం తాజాగా ఒక నివేదిక సమర్పించింది. రాజధాని కోసం చేపట్టిన భూ సమీకరణ పథకం, భూ సేకరణ చట్టం అమలు తీరుతెన్నులపై పలు ఆరోపణలు వచ్చాయని, వాటిపై దర్యాప్తు చేయాలని ఆ నివేదికలో సిఫారసు చేసింది.

Image copyright Getty Images

దీనివల్ల బ్యాంకు నుంచి రాజధానిలో రోడ్లు తదితర మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రావలసిన రూ. 7,000 కోట్ల రుణంపై నీలినీడలు కమ్ముకున్నాయని ఉండవల్లికి చెందిన రైతు దంటు బాలాజీరెడ్డి చెప్తున్నారు.

రాజధానిలో భూ సమీకరణ పథకాన్ని వ్యతిరేకిస్తున్న ఆయన.. భూములు ఇవ్వడానికి నిరాకరించిన వారి మీద భూసేకరణ చట్టం ప్రయోగించడాన్నీ కోర్టులో సవాల్ చేశారు. ''ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక నేపథ్యంలో.. భూసమీకరణలో భూములు ఇచ్చిన రైతుల్లో అభద్రతాభావం మొదలైంది. వారిని శాంతింపజేసేందుకు కొందరు పెద్ద రైతులను సింగపూర్ పర్యటన పేరుతో తీసుకెళుతున్నారన్నది నా అభిప్రాయం'' అని బాలాజీరెడ్డి బీబీసీ తెలుగుతో చెప్పారు.

Image copyright KOMMINENI AADILAKSHMI
చిత్రం శీర్షిక సింగపూర్ పర్యటనకు వెళుతున్న రాజధాని ప్రాంత రైతుల్లో హహిళా రైతు కొమ్మినేని ఆదిలక్ష్మి కూడా ఉన్నారు

''సింగపూర్ బాగా అభివృద్ధి చెందిందని చెప్తున్నారు. అది స్వయంగా చూస్తే రైతులకు కూడా అభివృద్ధి గురించిన ఒక అవగాహన వస్తుందని ముఖ్యమంత్రి ఈ కార్యక్రమం చేపట్టారు’’ అని తుళ్లూరుకు చెందిన మహిళా రైతు కొమ్మినేని ఆదిలక్ష్మి పేర్కొన్నారు.

మొదటి విడతలో సింగపూర్ పర్యటనకు వెళుతున్న రైతుల బృందంలో ఆమె కూడా ఉన్నారు. రాజధాని కోసం భూ సేకరణ పథకం కింద భూములు ఇచ్చిన మొదటి రైతుల్లో ఈమె ఒకరు.

''సింగపూర్‌లో భవనాలు, ప్లాట్లు ఎలా నిర్మించారు, ఎలా అభివృద్ధి చేశారు, వాటిని బట్టి ఇక్కడ ఎలా అభివృద్ధి చేసుకోవచ్చు అనే ఆలోచనలు వస్తాయని భావిస్తున్నాం. ఏదేమైనా సింగపూర్ వెళితే కానీ.. మనకు ఏది ఆసక్తిగా ఉంటుందనేది చెప్పలేం'' అని ఆమె పేర్కొన్నారు.

'వ్యాపార మెలకువలు తెలుసుకోవచ్చు'

''ఇప్పటివరకూ మాకు వ్యవసాయం తప్ప వేరే ఏమీ తెలియదు. ఇతరత్రా ఆలోచనలూ లేవు. ఇప్పుడు మా భూములను రాజధాని అభివృద్ధి కోసం ఇచ్చాం. సింగపూర్‌ పర్యటనలో అక్కడ క్షేత్రస్థాయిలో వ్యాపారాలు ఎలా ఉన్నాయి? ఎలాంటి మెలకువలు అవసరం అనేవి తెలుసుకోవచ్చని నేను భావిస్తున్నా'' అని తుళ్లూరుకు చెందిన రైతు దామినేని శ్రీనివాసరావు బీబీసీ తెలుగు కు వివరించారు.

రాజధాని భూ సమీకరణ పథకంలో తనకు, తన కుటుంబ సభ్యులకు చెందిన 34 ఎకరాల భూమిని సీఆర్‌డీఏకి అప్పగించిన శ్రీనివాసరావు.. మొదటి బృందంలో సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటన ప్రచారం కోసమేనని, ఇందులో చిన్న, సన్నకారు రైతులకు చోటు లేదని విమర్శకులు చేస్తున్న ఆరోపణలను ఆయన కొట్టివేస్తున్నారు.

''వ్యాపార మెలకువలు నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్న వాళ్లు దరఖాస్తు చేసుకున్నారు. పెద్ద రైతులకే చోటు కల్పించారన్న మాట అవాస్తవం. ఎందుకంటే 50 ఎకరాలు, 100 ఎకరాలు ఇచ్చిన రైతులు కొందరు దరఖాస్తులు కూడా పెట్టలేదు. వారికి ఈ పర్యటన మీద ఆసక్తి లేదు కనుక. నిజానికి ఇది అభివృద్ధి కోసం జరుగుతున్న పర్యటన.. ఈ ఆలోచన చాలా మందికి రావడం లేదు'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

Image copyright APCRDA DRAFT PLAN
చిత్రం శీర్షిక రాజధాని భూ సమీకరణ అమలు తీరుతెన్నులపై పలు ఆరోపణలు వచ్చాయని, వాటిపై దర్యాప్తు చేయాలని ప్రపంచ బ్యాంకు బృందం తాజా నివేదికలో సిఫారసు చేసింది

'ఇది రైతుల విహార యాత్ర'

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రతి దానికీ సింగపూర్ జపం చేస్తున్నారని.. ఇప్పుడు రాజధాని ప్రాంత రైతుల సింగపూర్ పర్యటన కూడా ఆ ప్రచార పర్వంలో భాగమేనని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి వై.రాధాకృష్ణ విమర్శించారు.

''వాస్తవానికి ఇది రైతుల విహార యాత్ర. రాజధాని నిర్మాణం మూడేళ్లయినా అడుగు ముందుకు పడలేదు. అక్కడ భూముల రేట్లు పడిపోతున్నాయి. దీనివల్ల రైతుల్లో అసంతృప్తి పెరుగుతోంది. దానిని చల్లార్చడం కోసం ప్రభుత్వం కొందరు పెద్ద రైతులను సింగపూర్ విహార యాత్రకు తీసుకెళుతోంది. సింగపూర్ నమూనా గురించి వారు కూడా ప్రభుత్వానికి ప్రచారం చేస్తారన్నది ప్రభుత్వ యోచన'' అని ఆయన బీబీసీ తెలుగు ప్రతినిధితో మాట్లాడుతూ ఆరోపించారు.

రైతుల్లో వ్యాపార నైపుణ్యాలు పెంచడమే లక్ష్యం అయితే.. ఇక్కడే ఎంతో అద్భుతమైన వ్యాపార దక్షత గలవారు ఉన్నారని.. వారితో రైతులకు, ఆ రైతుల పిల్లలకు శిక్షణా శిబిరాలు నిర్వహించవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎక్కడో సింగపూర్‌లో వ్యాపార అవకాశాలను అధ్యయనం చేయడానికి బదులుగా.. స్థానిక పరిస్థితులను అధ్యయనం చేసి, అందుకు అనుగుణంగా రైతులు, వారి పిల్లల్లో నైపుణ్యాభివృద్ధి చేపట్టవచ్చునని పేర్కొన్నారు.

Image copyright Getty Images

'సింగపూర్ అభివృద్ధి మీద అవగాహన కోసమే'

''ఫిషింగ్ విలేజ్‌గా ఉన్న సింగపూర్ నగరం 40-50 ఏళ్లలో ప్రపంచంలో అగ్రస్థాయి వాణిజ్య కేంద్రంగా ఎలా ఎదిగింది? ప్రజలు ఏ విధంగా అభివృద్ధి చెందారు? అనే అంశాలపై రైతులకు అవగాహన కల్పించడం ఈ పర్యటన ఉద్దేశం'' అని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్‌డీఏ) కమిషనర్ శ్రీధర్ చెరుకూరి చెప్పారు.

ఆయన బీబీసీ తెలుగు ప్రతినిధితో మాట్లాడుతూ.. వ్యవసాయం ప్రధాన రంగంగా ఉన్న రైతులు వ్యాపార రంగంలోకి అడుగు పెడుతున్నందున.. సింగపూర్ వంటి ఒక నగరం అభివృద్ధి చెందుతున్నపుడు అందివచ్చే వ్యాపారావకాశాలు ఏమిటి అనేదానిపైనా అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమం లక్ష్యమని వివరించారు.

ఈ పర్యటన మీద వస్తున్న విమర్శల గురించి ప్రస్తావించగా.. ప్రపంచంలో ఏ నగరాన్నైనా 34 నెలల్లో నిర్మించలేదంటూ.. అమరావతి నిర్మాణం ఒక ప్రణాళిక ప్రకారం సాగుతోందని ఆయన బదులిచ్చారు. రాజధాని స్టాక్ మార్కెట్ కాదని వ్యాఖ్యానించారు. విమర్శల మీద స్పందించాల్సిన అవసరం లేదన్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)