బీజేపీ ఆస్తులు పదకొండేళ్లలో 600 శాతానికి పైగా పెరిగాయి

అమిత్ షా, బీజేపీ

పదకొండేళ్లలో రాజకీయ పార్టీల ఆస్తులు భారీ స్థాయిలో పెరిగాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజా నివేదికలో తెలిపింది. 2005 నుంచి 2016 వరకూ వివిధ పార్టీలు ప్రకటించిన ఆదాయ వివరాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఈ నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు:

  • 2015-16లో బీజేపీ అత్యంత ధనిక పార్టీగా అవతరించింది.
  • 2004-05 నుండి 15-16 మధ్య ఈ పదకొండేళ్లలో బీజేపీ ఆస్తులు 627శాతం పెరిగాయి.
  • 2004-05లో బీజేపీ తన ఆస్తి 123 కోట్లున్నట్లు చూపించింది, 15-16 నాటికి ఆ పార్టీ ఆస్తులు 894 కోట్లకు చేరాయి.
  • తమ పార్టీకి 24 కోట్ల అప్పులున్నట్లు బీజేపీ తెలిపింది. దీంతో 15-16 నాటికి తమ రిజర్వ్ ఫండ్లు 868 కోట్లకు చేరాయని బీజేపీ తెలిపింది.
  • ఈ పదకొండేళ్లలో కాంగ్రెస్‌ పార్టీ ఆస్తులు 167 కోట్ల నుండి 758 కోట్లకు చేరాయి.
  • కానీ కాంగ్రెస్‌ పార్టీకి 329 కోట్ల అప్పులుండటంతో రిజర్వ్ ఫండ్ల విషయంలో అది వెనుకబడింది.
  • రిజర్వ్ ఫండ్ల విషయంలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీగా బహుజన్ సమాజ్ పార్టీ అవతరించింది. ఈ పదకొండేళ్లలో ఆ పార్టీ రిజర్వ్ ఫండ్లు 43 కోట్ల నుంచి 557 కోట్లకు చేరాయి.
  • రిజర్వ్ ఫండ్ల విషయంలో మూడో అతిపెద్ద పార్టీగా సీపీఎం నిలిచింది. ఆ పార్టీ రిజర్వ్ ఫండ్లు 432 కోట్లున్నట్లు తెలిపింది.

రిజర్వ్ ఫండ్లను రాజకీయ పార్టీలు తమ ఖర్చులకు వాడుకుంటాయి. ఈ ఫండ్లను మొత్తం ఆస్తి నుండి అప్పులన్నీ తీసి లెక్కిస్తారు. 2014-15లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆ పార్టీ ఆస్తులు పెరిగాయని ఈ నివేదిక వెల్లడించింది.

అంతకు ముందు కాంగ్రెస్ మొదటి స్ధానంలో ఉండేదని ఈ నివేదిక పేర్కొంది.

ఇది మొత్తం ఆస్తి కాదు..!

పెరిగిన ఈ ఆస్తులంతా వివిధ రాజకీయ పార్టీలు ప్రకటించిన ఆస్తులు మాత్రమే. ఇది ఆ పార్టీల మొత్తం ఆస్తి కాదు. అప్రకటిత ఆస్తులు, తెలియని వనరుల ద్వారా అందే విరాళాలకు సంబంధించి వివరాలు ఇందులోకి రావు.

తెలియని వనరుల ద్వారా అందే విరాళాలను రాజకీయ పార్టీలు చూపించవు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల మొత్తం ఆదాయంలో 77శాతం ఆదాయం తెలియని వనరుల ద్వారానే వస్తుందని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ జారీ చేసిన మరో రిపోర్ట్ పేర్కొంది.

రాజకీయ పార్టీలు 20 వేలకన్నా తక్కువ అందిన విరాళానికి సంబంధించి వివరాలను తప్పకుండా అందించాలనే నిబంధన గత సంవత్సరం వరకూ లేదు, కానీ ఈ ఏడాది బడ్జెట్ సమయంలో కేంద్ర ప్రభుత్వం దీని పరిమితిని 20 వేల నుంచి 2 వేలకు తగ్గించింది. రాజకీయ విరాళాలలో పారదర్శకత పెంచడానికే ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

పారదర్శకత పెరగనుందా?

ఇలా చేస్తే విరాళాల్లో పారదర్శకత పెరగదని ఆర్థికవేత్త అరుణ్ కుమార్ అంటున్నారు. "పారదర్శకత మొత్తం ఆస్తులపై ఉండాలి. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలు తమ మొత్తం ఆస్తుల్లో కేవలం ఒక భాగాన్ని మాత్రమే ప్రకటిస్తే పారదర్శకత ఎలా వస్తుంది? ఓ పరిమిత స్థాయిలోనే మార్పుతో పారదర్శకత సాధ్యం కాదు. మొత్తం రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో దీని గురించి నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే ఈ సమస్య పరిష్కారమవుతుంది" అని అరుణ్ కుమార్ అన్నారు.

నల్లధనాన్ని అరికడతామని, రాజకీయ పార్టీలు స్వీకరించే విరాళాలలో పారదర్శకతను పెంచుతామని బీజేపీ గతంలో ఎన్నో సార్లు ప్రకటించింది. ఈ నివేదిక తర్వాత బీజేపీతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది కానీ ఈ విషయంపై మాట్లాడేందుకు ఎవరూ ముందుకు రాలేదు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)