నవాజ్ షరీఫ్‌, ఆయన కుమార్తె, అల్లుడిపై అభియోగాలు ఖరారు చేసిన కోర్టు

  • 19 అక్టోబర్ 2017
నవాజ్ షరీఫ్‌ Image copyright AFP/NA

పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి షరీఫ్‌పై ఇస్లామాబాద్ ప్రత్యేక కోర్టు అవినీతి అభియోగాలను ఖరారు చేసింది. నవాజ్ షరీఫ్‌తో పాటు ఆయన కూతురు మర్యమ్ నవాజ్, అల్లుడు కెప్టెన్ మొహమ్మద్ సఫ్‌దర్‌పై కూడా అభియోగాలు నమోదు చేసింది.

లండన్‌లో ఫ్లాట్లకు సంబంధించి ఈ ముగ్గురిపైనా అభియోగాలు నమోదయ్యాయి. గురువారం కోర్టులో విచారణ జరిగిన తర్వాత ఈ ఆరోపణలు ఖరారయ్యాయి. అవినీతికి సంబంధించి మరో రెండు కేసుల్లో కూడా వీరిపై అభియోగాలు నమోదవ్వచ్చని బీబీసీ ఉర్దూ ప్రతినిధి షహజాద్ మాలిక్ తెలిపారు.

"న్యాయ ప్రక్రియలో పాల్గొనేందుకే మేం ఇక్కడికి వచ్చాం. న్యాయస్థానాలను, చట్టాలను మేం గౌరవిస్తాం. న్యాయస్థానాల్లో కేసులు మాకు కొత్త కాదు" అని కోర్టు నిర్ణయంపై స్పందిస్తూ మర్యమ్ నవాజ్ అన్నారు.

67 ఏళ్ల నవాజ్ షరీఫ్‌ను పాకిస్తాన్ సుప్రీంకోర్టు జూలై నెలలో అవినీతి ఆరోపణల విషయంలో ప్రధాని పదవికి అనర్హుడంటూ సంచలన తీర్పు వెలువరించింది. ఆ తర్వాత ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం నవాజ్ షరీఫ్ బ్రిటన్‌లో ఉన్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)