తెలంగాణ: పురోహితుల పెళ్లిళ్లకు రూ. 3 లక్షల ప్రభుత్వ సాయం

  • 20 అక్టోబర్ 2017
శ్రీలంకలో ఒక పురోహితుడు Image copyright Getty Images

పురోహితుల పెళ్లిళ్లకు 3 లక్షల రూపాయల చొప్పున సాయం అందించాలని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నిర్ణయించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పురోహితులకు ఆర్థిక స్థిరత్వం లేనందున పెళ్లిళ్లు కష్టం అవుతున్నాయని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చెపుతోంది.

ప్రత్యేక పథకం కింద పెళ్లి సమయంలో పురోహితుడు, అతని భార్య పేరు మీద జాయింట్ ఎకౌంట్ ఓపెన్ చేసి అందులో రూ. 3 లక్షలు డిపాజిట్ చేయాలని నిర్ణయించినట్టు బ్రాహ్మణ పరిషత్ తెలిపింది. బ్రాహ్మణ పరిషత్ ప్రభుత్వ నిధులతో నడుస్తుంది.

"అర్చకులు ఉంటేనే దేవాలయాలు నిలబడతాయి, పౌరోహిత్యం ఉంటేనే వేదం నిలబడుతుంది. దేవాలయాలు, వేదం ఉంటేనే సమాజం నిలబడుతుంది. అందుకే అర్చకుల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం" అని బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ కె.వి. రమణాచారి అన్నారు.

''బ్రాహ్మణుల తరపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు'' అని 'మన బ్రాహ్మణ సంఘం' తెలంగాణ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి అవధానుల నర్సింహ శర్మ చెప్పారు. ''ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు బ్రాహ్మణ పక్షపాతి అని మరోసారి నిరూపించుకున్నారు. ఇది బ్రాహ్మణుల అభ్యున్నతికి తోడ్పడే నిర్ణయం. పేద బ్రాహ్మణులను పైకి తీసుకురావడానికి, సంప్రదాయాల పరిరక్షణకు ఇలాంటి అనేక నిర్ణయాలు అవసరం'' అని ఆయన పేర్కొన్నారు.

Image copyright Getty Images

ప్రభుత్వ నిధులతో నడిచే బ్రాహ్మణ పరిషత్‌కు ప్రభుత్వం 2016 బడ్జెట్‌లో 100 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. పూజారుల్లో పేదలున్నమాట వాస్తవమే అయినప్పటికీ ప్రభుత్వ నిధులను పెళ్లిళ్లకు, అందులోనూ ఒక కులం వారి పెళ్లిళ్లకు కేటాయించడం కరెక్టేనా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

ఈ నిర్ణయం రాజ్యాంగబద్ధం కాదని, ఎగ్జిక్యూటివ్ విచక్షణ కింద పాలకులు దాక్కుంటున్నారని మాజీ లా ఫ్రొఫెసర్, కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ కల్పన కన్నబీరన్ అన్నారు. పెళ్లికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలతో రాజ్యానికి ఏం పని అని ఆమె ప్రశ్నించారు.

అనేక ‌వృత్తుల్లో పేదలుండగా ఒక వృత్తిలోని వారికి ఇలా నిధులు కేటాయించడంలో హేతుబద్ధత ఏంటి అని ఆమె ప్రశ్నించారు. ఇందులో వాళ్లకున్న ప్రివిలేజెస్ ఏమిటి అన్నది ఆమె ప్రశ్న.

''రాజ్యాంగం ప్రకారం వెనుకబడిన సమూహాలకు విద్య, ఉపాధి రంగాల్లో సాయం అందించడానికి ప్రభుత్వం సాయం చేయాలి. అంతేకానీ వెనుకబడిన వారిగా గుర్తింపులేని బ్రాహ్మణ కులంలోని వారికి, ఒక వృత్తిలోని వారికి ఇలా పెళ్లిళ్ల పేరుతో ప్రభుత్వ నిధులు వెచ్చిండం ఏమిటి? పెళ్లికి ఖర్చు అనే ప్రస్తావనే ఎందుకొస్తుంది? ఖర్చు లేకుండా ఆధునికంగా పెళ్లిళ్లు చేసుకోలేరా? అసలు పెళ్లిళ్ల గురించి రాజ్యానికి బెంగ ఎందుకు? మనుషులు సింగిల్ గా ఉండకూడదా?'' అని కల్పన సూటిగా ప్రశ్నించారు. ఇది పూర్తిగా తిరోగమనవాద నిర్ణయం, కులవ్యవస్థను మరింత బలపరిచే ఫ్యూడల్ నిర్ణయం" అని ఆమె ఘాటుగా విమర్శించారు.

''ఈ నిర్ణయం హిందూ వివాహ చట్టాన్ని, ప్రత్యేక వివాహ చట్టాన్ని ఉల్లంఘించడమే'' అని హైకోర్టు న్యాయవాది రచనా రెడ్డి పేర్కొన్నారు.

''పూజారి అబ్బాయిలకు ప్రభుత్వం కట్నమిస్తోందా ఏమిటి, ఇది విడ్డూరంగా, హాస్యాస్పదంగా ఉంది'' అని సామాజిక కార్యకర్త దేవి వ్యాఖ్యానించారు.

వారం రోజుల్లో ఈ స్కీమ్‌కు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడిస్తామని బ్రాహ్మణ పరిషత్ వెల్లడించింది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు