‘చెప్పులతో కొట్టి, ఉమ్మిని నాకించి అవమానించారు’

  • 21 అక్టోబర్ 2017
మహేశ్ ఠాకూర్, దళితులు, బిహార్ Image copyright JITENDRA
చిత్రం శీర్షిక మహేశ్ ఠాకూర్

స్వయానా బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సొంత జిల్లా నలందాలో అమానుష ఘటన చోటు చేసుకుంది.

అనుమతి లేకుండా తమ ఇంట్లో ప్రవేశించాడన్న కారణంతో అగ్రవర్ణాల వారు ఒక వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తి చేత ఉమ్మిని నాకించారు. తమ ఆడవాళ్లతో చెప్పులతో కొట్టించారు.

నలందా జిల్లాలోని అజ్నోరా గ్రామానికి చెందిన మహేశ్ ఠాకూర్ దళితుడు. గ్రామంలోని సురేంద్ర యాదవ్‌ ఇంట్లోకి తలుపు తట్టకుండా వెళ్లాడని ఆరోపిస్తూ ఆ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

ఈ దారుణం గురించి తెలిసిన వెంటనే దీనిపై విచారణకు ఆదేశించినట్లు జిల్లా మేజిస్ట్రేట్ డా.త్యాగరాజన్ వెల్లడించారు.

ఈ సంఘటన నేపథ్యంలో ఎనిమిది మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ పొరిక తెలిపారు.

''ఇంట్లోకి అనుమతి లేకుండా ప్రవేశించాడని ఆరోపిస్తూ ధర్మేంద్ర యాదవ్ అనే వ్యక్తి మహేశ్ ఠాకూర్‌ను ఇంటికి పిలిపించారు. అక్కడ గ్రామ పెద్ద దయానంద్ మాంఝీ కూడా ఉన్నారు. అందరూ కలిసి మహేశ్ ఠాకూర్‌ చేత ఆ పనులన్నీ చేయించారు'' అని వివరించారు.

Image copyright JITENDRA
చిత్రం శీర్షిక జిల్లా మేజిస్ట్రేట్ డా.త్యాగరాజన్

ఖైనీ కోసమే వెళ్లా !

ఈ సంఘటన గురించి వివరిస్తూ మహేశ్ ఠాకూర్‌, తాను ఉదయం కాలకృత్యాలకు వెళుతూ ఖైనీ కోసం సురేంద్ర యాదవ్ ఇంటికి వెళ్లినట్లు తెలిపారు.

ఇంటిలో సురేంద్ర లేడని ఆయన భార్య చెప్పడంతో మహేశ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాలకృత్యాలు తీర్చుకుని వస్తుండగా, ఈ దారుణానికి పాల్పడినట్లు వివరించారు.

మహేశ్ ఠాకూర్‌ను అనరాని మాటలతో అవమానిస్తూ, అతనితో ఉమ్మిని నాకిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇదే వీడియోలో మహేశ్‌ను చెప్పులతో కొట్టడం కూడా కనిపించింది.

Image copyright JITENDRA

ఈ సంఘటనతో మహేశ్ పూర్తిగా భయపడిపోయారు.

''వాళ్లు నన్ను గ్రామం నుంచి బహిష్కరిస్తామని బెదిరించారు. నా ప్రాణాలకు ప్రమాదం ఉంది'' అని మహేశ్ తెలిపారు.

జరిగిన ఘటనతో తన కుమార్తెకు పెళ్లి కాదేమోనని ఆందోళన చెందుతున్నారు.

ఈ సంఘటన నేపథ్యంలో ధర్మేంద్ర యాదవ్, రామవృక్ష మహతో, అరుణ్ మహతో, నరేంద్ర యాదవ్, రామ్‌రూప్ యాదవ్, దయానంద్ మాంఝీ, సంజయ్ యాదవ్, రాజేంద్ర పండిట్‌లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఎస్పీ సుధీర్ కుమార్ తెలిపారు.

ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు