ప్రెస్ రివ్యూ: 22.10.2017

  • 22 అక్టోబర్ 2017
Image copyright NOAH SEELAM/Getty Images

తెలంగాణలో రేషన్ షాపులు రద్దు!

తెలంగాణలో రేషన్ షాపులు రద్దు కానున్నాయా? రేషన్ షాపుల్లో అవినీతి, అక్రమాలు, డీలర్ల బెదిరింపులకు చెక్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు.

దీనికోసం ప్రత్యామ్నాయ విధానంపై కసరత్తు చేస్తున్నారు. రేషన్ అక్రమాల కారణంగా సర్కారుకు చెడ్డపేరు వస్తోందని, ప్రత్యక్ష నగదు బదిలీ విధానాన్ని ప్రవేశ పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు.

దీనిద్వారా ఒక్కో కుటుంబానికి ఇంచుమించుగా రూ. వెయ్యి అందే అవకాశం ఉండొచ్చని అంచనా. అయితే దీనిపై రేషన్ డీలర్లు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సుమారు 36వేల కుటుంబాలు వీధిన పడతాయని వారంటున్నారు. అని ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్‌లో పతాక కథనం ప్రచురించింది.

Image copyright INDRANIL MUKHERJEE/Getty Images

పొదుపు మరిచిపోయారా?

'సగటు భారతీయుడి జీవనశైలి మారుతోంది. ఆర్థిక స్థితిని మర్చిపోయి దుబారా ఖర్చులకు డబ్బు వృథా చేస్తున్నారు.

ఆన్ లైన్ మార్కెట్లు, క్రెడిట్ కార్డులు, ఈఎంల వలలో చిక్కి పొదుపు మార్గాన్ని పూర్తిగా వదిలిపెడుతున్నారు.

తర్వాత చెల్లించలేక ఒత్తిడితో ఆత్మహత్యలు, హత్యలకు పాల్పడుతున్నారు.' అంటూ ఆంధ్రజ్యోతి ఒక విశ్లేషణాత్మక కథనం ఇచ్చింది.

Image copyright SAM PANTHAKY/Getty Images

24న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం?

'24న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుందని సమాచారం. ఈ భేటీలోనే రాహుల్ అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన ముహూర్తం ఖరారు కానుంది.

అధ్యక్ష ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించడంతో ఈ లాంఛనం ప్రారంభం కావొచ్చు.

ఇప్పుడే అధ్యక్షుడిగా ఎన్నికైనా, డిసెంబరులో జరిగే పార్టీ ప్లీనరీలోనే అధికారికంగా రాహుల్ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని అంచనా' అని 'ఆంధ్రజ్యోతి' పేర్కొంది.

Image copyright KAZUHIRO NOGI/Getty Images

స్కూల్ ట్యాబుల్లో పోర్న్ చూస్తున్నారు!

ఆంధ్ర ప్రదేశ్‌లో పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, డిజిటల్ క్లాస్‌రూమ్‌ల నిర్వహణ వంటి అవసరాలకోసం ఇచ్చిన బయోమెట్రిక్ ట్యాబ్‌లు పక్కదారి పడుతున్నాయి.

వీటిని యూట్యూబ్ వీడియోలు, ఇతర అశ్లీల వెబ్‌సైట్లు వీక్షించేందుకు ఉపయోగిస్తున్నట్లు తేలింది. దీనికి చెక్ పెట్టేందుకు కొత్త సాఫ్ట్‌వేర్‌ని సిద్ధం చేస్తున్నట్లు ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్ పేర్కొంది.

Image copyright Getty Images

గొర్రెల గోల్‌మాల్!

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పథకం పక్కదారి పడుతోంది.

తొలిదశలో పంపిణీ సరిగ్గానే జరిగినా తర్వాత పరిస్థితి మారిపోయింది.

గొర్రెలను ఆంధ్ర ప్రదేశ్ నుంచి తెప్పించి, ఇక్కడ పంపిణీ చేశాక, దళారులు మళ్లీ అవే కొని ఆంధ్రాకి తరలిస్తున్నారు. మళ్లీ అధికారులు వాటిని కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నారు.

ఈ రీసైక్లింగ్ దందాపై సాక్షి క్షేత్రస్థాయి పరిశీలనాత్మక కథనం ఇచ్చింది.

Image copyright DESHAKALYAN CHOWDHURY/Getty Images

ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఎప్లాస్టిక్ ఎనీమియా!

పురుగు మందుల వాడకం కారణంగా ఎప్లాస్టిక్ ఎనీమియా వ్యాధి ప్రబలుతోందంటూ సాక్షి ఓ కథనాన్ని ప్రచురించింది.

యువతపైనే ఇది ఎక్కువ ప్రభావాన్ని చూపుతోందని పేర్కొంది.

పురుగు మందుల అవశేషాలున్న ఆహార పదార్థాల ద్వారా ఈ వ్యాధి ప్రబలుతుందని.. చికిత్స ఖరీదైనది కావడంతో బాధిత కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయని తెలిపింది.

ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో దీనిపై ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని వివరించింది.

Image copyright NOAH SEELAM/Getty Images

ఎన్నారై సంబంధాలపై మోజు తగ్గుతోంది!

ఎన్నారై సంబంధాలపై మోజు తగ్గుతోందా.. విదేశీ సంబంధాలను అడిగేవారు తగ్గుతున్నారా.. అంటే అవుననే అనిపిస్తోంది.

ఇటీవల కాలంలో ఈ తరహా మోజు తగ్గి బంధుమిత్రుల కుటుంబాల్లోనే బంధం కలుపుకునేందుకు ఆసక్తి పెరుగుతోందంటూ ఈనాడు ఓ కథనం ప్రచురించింది.

ప్రేమ వివాహాలు పెరుగుతుండడంతో వివాహ వేదికలకు గిరాకీ తగ్గుతోంది. పిల్లలు ప్రేమించుకుంటున్నామని చెబితే, గౌరవం నిలుపుకోవాలంటే ఒప్పుకోవాలనే విధంగా తల్లిదండ్రుల ఆలోచనా ధోరణి మారుతోంది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)