మాధవీలత : టాలీవుడ్‌లో హీరోయిన్లకు వేధింపులు ఇలా ఉంటాయ్

వీడియో క్యాప్షన్,

హాలీవుడ్ లోనే కాదు.. టాలీవుడ్ లోనూ వైన్‌స్టీన్‌లు..

లైంగిక వేధింపులు.. కేవలం హాలీవుడ్‌కే పరిమితం కాదు. రంగుల ప్రపంచంలో ఎక్కడైనా ఇలాగే ఉంటుందని అంటున్నారు నటి మాధవీలత. టాలీవుడ్‌లోనూ వైన్‌స్టీన్‌లాంటి వారు ఎందరో ఉన్నారని చెబుతున్నారు.

'నచ్చావులే' సినిమాతో నటిగా మారిన మాధవీలత తనకు ఎదురైన చేదు అనుభవాలను బీబీసీ ప్రతినిధి పద్మమీనాక్షితో పంచుకున్నారు. తాడిపత్రిలో ఓ మూవీ షూటింగ్‌లో ఉన్న మాధవీలత ఫోన్ ద్వారా ఈ ఇంటర్వ్యూ ఇచ్చారు.

టాలీవుడ్‌లో తెరవెనుక జీవితం ఎలా ఉంటుందో కళ్లకుకట్టారు. వర్ధమాన హీరోయిన్‌లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుందో వివరించారు.

పద్మమీనాక్షి: చదివింది ఆర్థిక శాస్త్రం, ఫ్యాషన్ డిజైనింగ్. తర్వాత నటిగా మారారు. అప్పుడు సినీ రంగంలో ఇబ్బందులు ఉండవనుకున్నారా?

మాధవీలత: నాకు చిన్నప్పటి నుంచి ఈ రంగంలోకి రావాలని కోరిక ఉండేది. నా కలలను సాకారం చేసుకోవాలనే వచ్చాను. కానీ చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అందరూ చెడ్డవాళ్లని ముద్ర వేయలేను కానీ అత్యధిక శాతం వాడుకోవాలని చూసేవారే.

వీడియో క్యాప్షన్,

హాలీవుడ్ లోనే కాదు.. టాలీవుడ్ లోనూ వైన్‌స్టీన్‌లు..

మరి ఎలా వాడుకుంటారు?

"నాకు క్లోజ్ ఫ్రెండ్‌గా ఉండగలవా? మనం ఫన్నీగా ఉందామా?" అంటూ వేధింపులు మొదలవుతాయి. ఇక్కడ స్నేహం అనే పదానికి అర్థమే వేరు. మొదట్లో ఆ ప్రతిపాదన నాకు వెంటనే అర్థం కాలేదు. "నాతో కాసేపు ఏకాంతంగా గడపవచ్చు కదా. అలా బయటకి వెళ్దామా. నీ సినిమా అవకాశాలు గురించి మాట్లాడొచ్చు" అని మేనేజర్లు సందేశాలు పంపిస్తారు. నేరుగా ఎవరూ ఏమీ అనరు. కానీ ప్రతి సందేశం వెనుకా 'అదే' అంతరార్థం ఉంటుంది.

మరి నో అంటే!

"ఒక్కటే జీవితం, తేలికగా తీసుకోవచ్చు కదా, తప్పేముంది అవునంటే" అని సలహాలిస్తారు. పార్టీలకు వెళితే రూంకి రావచ్చా, కొంతసేపు దగ్గరగా గడపవచ్చు కదా అని అడుగుతారు. అలా అని ఒత్తిడికి తలొగ్గితే అవకాశాలు వస్తాయని నియమం ఏమీ లేదు.

ఇంకా ఎలా వేధిస్తారు?

"మేము సినిమా ఇస్తున్నాం, డబ్బులిస్తున్నాం. మాకేమిటి అని ఆలోచిస్తారు చాలా మంది నిర్మాతలు. ఆ అమ్మాయి అంకిత భావంతో పని చేస్తుందా అని అడుగుతారు, కానీ అంకిత భావం వృత్తికి కాదు, వ్యక్తులకి. ఇది అందరికీ తెలిసిన నిజం. ఎవరూ చెప్పడానికి ఇష్టపడరు. ఎందుకంటే, చెప్పిన మరుక్షణం అవకాశాలు మాయమవుతాయి".

నిజం బయటకు చెబితే ఏమవుతుంది?

"నేను ఒక రోజు నా స్నేహితురాలికి పెట్టిన మెసేజ్ చూసిన డైరెక్టర్ ఆ రోజు నుంచి నన్ను ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టాడు. చెడు ప్రచారం చేశాడు. నేను కాదనడంతో నా కెరీర్ అంతా పోయింది. వచ్చిన అవకాశాలు అన్నీ పోయాయి. నాకున్న సౌకర్యాలు అన్నీ తీసేశారు. తిట్టారు. రోజూ మానసిక వేదన అనుభవించాను. ఒత్తిడి భరించలేక వాళ్ళ ప్రతిపాదనలకు ఒప్పుకుంటామని ప్రణాళికాబద్ధంగా ప్రయత్నిస్తారు.

తర్వాత..?

ఆ అమ్మాయికి పొగరు, మాట వినదు అని ముద్ర వేస్తారు.

అస్సలు 'సహకరించదు'. నాట్ కమిటెడ్ అంటారు. ఈ పదాలకు ఈ పరిశ్రమలో అర్థాలు వేరు.

అమ్మాయి ఆత్మాభిమానంతో ఉంటే పొగరు అని ముద్ర వేస్తారు.

మొత్తానికి "ఇష్టపడి చేసినదాని కన్నా కష్టపడి చేసినదే ఎక్కువ (తొలి సినిమాలో కష్టాలు గుర్తు చేసుకుంటూ).

నా మొదటి సినిమా చూస్తున్నపుడు బాధపడే సంఘటనలే కానీ, ఆనంద క్షణాలు లేవు.

సినిమా తీస్తున్నపుడు పెట్టిన ఇబ్బంది మాత్రమే గుర్తు వచ్చి బాధపడ్డాను.

చివరకు ఏమైంది..?

"సమాజం నిజాలు చెప్పనివ్వదు, జీవితంలో కూడా నటించమనే సలహాలిస్తారు.

అవకాశాలు కావాలంటే ముందు నిజం మాట్లాడితే మౌనంగా ఉండు అని సలహాలిచ్చే వారు.

ఇప్పుడు మాట్లాడుతుంటే వెలుగులోకి రావడానికి ఇలా మాట్లాడుతోందని అంటున్నారు. నిజంగా వెలుగులోకి రావాలంటే ఏ విషయం గురించి అయినా మాట్లాడవచ్చు కదా!

సినిమాలు గురించి మాత్రమే ఎందుకు మాట్లాడాలి."

మరి చట్టపరంగా రక్షణ పొందవచ్చు కదా?

"ఇక్కడ ఎవరూ మనసు విప్పి బాధలు, ఇబ్బందులు చెప్పరు. ఎందుకంటే చెబితే వాళ్ళ కెరీర్ కే ప్రమాదం. కొంతమంది నేరుగా సలహాలిస్తారు, ఫలానా వ్యక్తితో వెళ్లినా కూడా నీకు ఏమీ అవకాశాలు రావు అని. నిజాలు ఎప్పుడూ కథలానే ఉంటాయి.

సినీ పరిశ్రమ అంతా ఇలాగే ఉంటుందని చెప్పలేను. మంచి చెడు రెండూ ఉంటాయి.

సినిమ పరిశ్రమలో ఎవరూ బలవంతం చేయరు. కానీ ఇక్కడ ముందే చెప్పేస్తారు.

ఇలా ఉంటేనే అవకాశాలు వస్తాయి. లేకుంటే రావు అని సూటిగా చెప్పేస్తారు.

మీరు ఈ వేధింపులను ఎలా ఎదుర్కొంటున్నారు?

నేను నిజాలు మాట్లాడటం వల్ల చిన్న స్థాయి సినిమాలు మాత్రమే చేశాను. సినిమాల్లో అందరూ చెడ్డవాళ్ళే అని సమాజం ముద్ర వేసేస్తుంది.

కొత్తగా సినీ పరిశ్రమలోకి వచ్చేవారికి మీరిచ్చే సలహా..

తప్పుడు మనుషులని నమ్మి జీవితాలని నాశనం చేసుకోకండి. ఆత్మహత్యలు చేసుకోకండి అని మాత్రమే సలహా ఇస్తాను.

"ఒక్కసారి స్టార్ స్థాయి సంపాదిస్తే ఇలాంటి ఒత్తిడులు తగ్గే అవకాశాలు ఉంటాయి".

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)